– 70 లక్షలమంది పసుపుసైన్యం ఉరికించి ఉరికించి కొడతారు
-2024లో చంద్రబాబు సీఎం..చట్టాన్ని ఉల్లంఘించిన వారెవ్వరూ తప్పించుకోలేరు
-అత్యధిక మెజారిటీతో మంగళగిరి గెలిచి చంద్రబాబు గారికి కానుకిస్తాం
-ఒక చెంపపై కొడితే రెండు చెంపలు పగలకొట్టి పంపుతాం
-చంద్రబాబు దీక్ష సభలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
సీఎం జగన్‌రెడ్డికి దమ్ముంటే పోలీసుల్లేకుండా దమ్ముంటే టిడిపి కార్యాలయం వైపు రావాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. ఎవరూ లేని సమయంలో టిడిపి ఆఫీసుపై రాళ్లేసి, ఉద్యోగుల్ని కొట్టి వెళ్లడం కాదు…దమ్ముంటే ఇప్పుడు రండి…మా సత్తా చూపిస్తామంటూ గర్జించారు.
“అయ్యా జగన్‌రెడ్డి నీ తాడేపల్లి కొంపలో పడుకోవడం కాదు. టిడిపిపై దాడి చేయాలని వుంటే, నువ్వే నేరుగా రా.. నీ ఇంట్లో పెంపుడు కుక్కల్ని పంపిస్తే… 10 నిమిషాలలో పిల్లుల్లా పారిపోతారు“ అంటూ లోకేష్ ఆగ్రహంతో ఊగిపోయారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టిన ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరుకి మద్దతు ఇచ్చేందుకు వచ్చిన ప్రతీ ఒక్క తెలుగుదేశం కార్యకర్త, నేతకీ కృతజ్ఞతలు తెలియజేశారు నారా లోకేష్. ప్రతిపక్ష నేతగా జగన్‌రెడ్డి మాట తప్పను, మడమ తిప్పనంటూ పాదయాత్ర చేశాడని, ఊరుకి ఒక మాట చెబుతూ..అన్నీ పెంచుకుంటూ పోతానన్నాడని, జనమేమో చంద్రన్నబీమా, పెన్షన్లు పెంచుతాడనుకుంటే..ఇసుక, మద్యం, బస్సు, విద్యుత్, నిత్యావసరాల ధరలు పెంచి…ఇంకా పెంచుకుంటూ పోతున్నాడని విమర్శించారు. ఇది మాట తప్పడం కాదా? ఇది మడమ తిప్పడం కాదా? అని నిలదీశారు.
యువతకి 2 లక్షల 30 వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నాడు చేశాడా? అని ప్రశ్నించారు. రెండున్నరేళ్ల జగన్ పాలనలో ఒక్క పరిశ్రమ రాలేదని, వచ్చిన ఒకే ఒక్క ఒక్క పరిశ్రమ గంజాయి పరిశ్రమ అని ఆరోపించారు. గంజాయి, డ్రగ్స్‌తో యువత భవితని నాశనం చేయొద్దని డిమాండ్ చేసిన టిడిపి నేతలపైనా కార్యాలయాలపైనా దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. పోలీసు అధికారులే టిడిపి ఆఫీసుపై దాడి చేయించారని, టిడిపి సిబ్బంది తిరుగుబాటు చేస్తే పోలీసులే వారిని దగ్గరుండి తీసుకెళ్లిపోయారని ఆరోపించారు. దాడిచేసిన వైసీపీ ముష్కరులను తప్పించేందుకు గుంటూరు నుంచి డిఎస్పీ వచ్చారంటే ఇది ప్రభుత్వ ఉగ్రవాద దాడి కాదా అని ప్రశ్నించారు.
పోలీసుల లేకుండా దమ్ముంటే రండి…తెలుగుదేశం పార్టీ సత్తా చూపిస్తామంటూ వైసీపీ సవాల్ విసిరారు. పోలీసుల అండదండలతో వైసీపీలో కొంత మంది పిల్లులు..పులుల్లా ఫీలైపోతున్నారని, మరోవైపు టిడిపి నేతల్ని గృహనిర్బంధం చేస్తున్నారని, తెలుగుదేశాన్ని, పసుపు జెండాని చూస్తే ఎందుకింత భయపడుతున్నారని ప్రశ్నించారు.
మా నాయకుడు చంద్రబాబుకి ఓర్పు, సహనం ఎక్కువని, ఆయనది గాంధేయవాదమని చెప్పిన నారా లోకేష్… తెలుగుదేశంలో ఇప్పుడు యువరక్తం ఉరకలెత్తుతోందని, ఎవ్వరూ ఊరుకోరని, ఒక చెంపపై కొడితే రెండు చెంపలు పగల కొడతామని హెచ్చరించారు. చట్టాల్ని ఉల్లంఘిస్తూ.. మా కార్యకర్తలు, నాయకుల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్లు… దేశంలో ఎక్కడున్నా వదిలిపెట్టమన్నారు.
ఏళ్ల తరబడి, వేల కిలోమీటర్ల జగన్ పాదయాత్ర చేస్తే నాడు సీఎంగా వున్న చంద్రబాబు అదనపు భద్రత కల్పించారని, ఆనాడు చంద్రబాబు ఒక్క చిటికె వేస్తే జగన్ పాదయాత్ర చేసేవాడా అని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పగిలింది అద్దాలు మాత్రమేనని, ఇది 70 లక్షల మంది తెలుగుదేశం పార్టీ దేవాలయం అని, అద్దాలు పగులకొట్టిన మీరు టిడిపి కార్యకర్తల గుండెల్లో తెలుగుదేశంపై అభిమానాన్ని పగులకొట్టలేరన్నారు. ఏ ముహూర్తాన అన్నగారు పార్టీని ఆరంభించారో కానీ, ఆ జెండాని చూస్తే ప్రాణాలు ఇచ్చేంత త్యాగం ఉన్న తిరుగులేని పసుపుసైన్యం తెలుగుదేశం పార్టీ సొంతమని, ఇది వైసీపీ పేటీఎం కూలీల పార్టీ కాదని స్పష్టం చేశారు.
రెండున్నరేళ్లు ఓపిక పట్టాలని, 2024 నాటికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకొస్తుందని, ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కేసులకు ఎవ్వరూ భయపడొద్దని, నా మీద ఏనాడూ ఒక్క కేసూ లేదని, నా మీద జగన్ 13 తప్పుడు కేసులు పెట్టించారన్నారు. జగన్‌రెడ్డి నీలాగ మీ చిన్నాన్న జోలికెళ్లలేదు..మీ చిన్నాన్నని ఎవరు చంపారో దర్యాప్తు చేయించగలవా? అని సవాల్ విసిరారు. “డిజిపి గారు 307 హత్యాయత్నం కేసులు నాపై పెడితే ఈ బండి ఆగదు..అడ్డగోలు కేసులు పెడితే ఈ బండి ఇంకా స్పీడ్ పెంచేస్తుంది.“ అంటూ తన శైలిలో చెప్పారు.
మా కార్యకర్తలు, నాయకులపైనా చట్టాలను ఉల్లంఘించి కేసులు పెడుతున్నారో వారంతా తగిన మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు. దుగ్గిరాలలో 20 ఏళ్ల తరువాత ఎంపీటీసీలు అత్యధికంగా గెలిచాం..ఇది ఓర్చుకోలేని వైసీపీ మైనారిటీ సోదరికి బీసీ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఏడిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో మంగళగిరిలో తెలుగుదేశంని గెలిపించి చంద్రబాబుకి కానుకగా ఇస్తామన్నారు. ఇప్పుడు ట్రైలర్ మాత్రమే చూపించామని, అసలు సినిమా రెండున్నరేళ్లలో చూపిస్తామంటూ వైసీపీ నేతలకు హెచ్చరించారు.