ప్రజాహృదయ విజేతగా నారా లోకేష్
ప్రతీ గడపా తొక్కాడు…ప్రతీ తలుపు తట్టాడు…
జనం బాధలు చూశాడు…అండగా ఉంటానన్నాడు…
కష్టాలు విన్నాడు…కన్నీళ్లు తుడిచాడు…
చిరువ్యాపారులకు సాయంగా నిలిచాడు…
తెలుగుదేశం కుటుంబసభ్యులకి ఆత్మీయత పంచాడు…
గుడి,మసీదు,చర్చిలను సందర్శించాడు….
అన్నివర్గాలకీ చేరువయ్యాడు….
ఇదీ మూడు రోజులుగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పర్యటనలో కనిపించిన దృశ్యాలు. నియోజకర్గంలో ప్రతీ ఇంటినీ చేరాలి, ప్రతీ మనిషిని పలకరించాలనే నారా లోకేష్ లక్ష్యం నెరవేరింది. మనుషుల్ని కలిసి, వారి మనసుల్ని గెలిచి ప్రజాహృదయవిజేతగా నిలిచారు.
మూడు రోజుల్లో కొన్ని వేలమందిని కలిశారు. కొన్ని వందల ఇళ్లకి నేరుగా వెళ్లారు. ఉదయం ఆరంభిస్తే ఏ అర్ధరాత్రికో టూర్ ముగిసింది. విసుగులేదు. విరామంలేదు. అలసట దరిచేరలేదు. ఇవన్నీ జనాభిమానం ముందు కనిపించలేదు. కుల,మతాలకు అతీతంగా ఆదరించి ఆత్మీయత పంచడం చూసిన నారా లోకేష్ కళ్లు కృతజ్ఞతతో చెమ్మగిల్లాయి. తనపై ఇంత అభిమానం చూపిస్తోన్న మీకు అండగా వుండి, అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. శుక్రవారం ఉదయం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళగిరి టౌన్ లోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. అనంతరం భగీరథ మహర్షిని దర్శించుకున్నారు. మంగళగిరిలోని భావనాఋషి స్వామి దేవాలయంలో స్వామి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. జాతీయ న్యాయదినోత్సవం సందర్భంగా న్యాయవాదులకు శుభాకాంక్షలు తెలిపి డైరీ ఆవిష్కరించారు. ప్రముఖ జాతీయోద్యమ నాయకుడు, చేనేత రక్షణ కోసం పోరాటం చేసిన యోధుడు ప్రగడ కోటయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కరోనా అనంతరకాలంలో జీవనోపాధికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న మంగళగిరిలో చిరు వ్యాపారులకు తన సొంత నిధులతో తోపుడుబండ్లు పంపిణీ చేశారు. టిడిపి నేతలు, కార్యకర్తలు, సామాన్యజనం, అభిమానుల ఇళ్లకి కూడా వెళ్లి పేరుపేరునా పలకరించిన నారా లోకేష్..కాలనీలు, వీధుల్లో కాలినడకన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు విన్నారు.
“చెత్త మీద కూడా పన్నేసారు. అవి వసూలు చేయడానికి వార్డు ఉద్యోగులు వస్తున్నారు. మేము కట్టమంటే …మీరు
కట్టకపోతే మాకు జీతాలు రావని ఉద్యోగులు అంటున్నారు. సీఎం జగన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే మాటతప్పారు“ అని పాతమంగళగిరి పీర్ల పంజా సెంటర్ లో మహిళలు వాపోయారు. దీనిపై స్పందించిన లోకేష్ “ నేను మాట తప్పను. మంగళగిరిలో గెలుస్తా. మీ అందరికి అండగా వుంటా“ అని హామీ ఇచ్చారు.
“నా భర్త చనిపోతే చంద్రబాబు ఫించన్ ఇచ్చాడు. ఆ పింఛను ఇప్పుడు ఇవ్వడానికి నానా బాధలు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం మళ్లీ వస్తే మా చెప్పులతో మేమే కొట్టుకోవాలి“- ఓ వితంతువు ఆక్రోశం
“ఎప్పుడో మేము కట్టుకున్న ఇంటికి ఇప్పుడు 10వేలు కట్టమంటున్నారు. నేను ముసలిదాన్ని. పదివేలు ఏడ నుంచి తేవాలయ్యా. కట్టాల్సిందేనని వలంటీర్లు ఇంటికొచ్చి బెదిరిస్తున్నారయ్యా“ అని ఓ వృద్దురాలు ఆవేదన వ్యక్తం చేస్తే…నారా లోకేష్ ఆమెని అనునయించి ఎవ్వరూ రూపాయి కట్టొద్దని, టిడిపి ప్రభుత్వం త్వరలో వస్తుందని, అందరికీ ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తామని భరోసా ఇచ్చారు.
“మాకు మంజూరైన టిడ్కో ఇళ్లు నిర్మాణం పూర్తయినా అప్పగించడంలేదు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 50 వేలు కట్టాం. అప్పుడు నెలకి 3 వేలు కట్టాలని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చినతరువాత ఇప్పుడు 3 లక్షలు కట్టమంటున్నారు. పేదలం ఎలా కట్టగలం“ అని ముస్లిం మహిళలు నారా లోకేష్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ
“తెలుగుదేశం ప్రభుత్వహయాంలో ఎన్టీఆర్ గృహాలు సుమారు మంగళగిరితో కలిపి 12 వేలు నిర్మించాం. మంగళగిరి పట్టణంలో టిడ్కో గృహాలు 1728 మేము పూర్తిచేసినా, ఆ సముదాయంలో జగన్‌రెడ్డి ప్రభుత్వం రెండున్నరేళ్లుగా డ్రైన్లు, రోడ్లు వేయలేదు. లబ్దిదారులకు గృహాలు అప్పగించలేదు. అభివృద్ధి లేదు. ఇళ్లు ఉచితంగా ఇస్తానని ఇప్పుడు 3 లక్షలు కట్టమంటున్నట్టే.. సన్నబియ్యం ఇస్తానని ఇవ్వలేని సన్నాసి మాటలు నమ్మొద్దు“ అని అన్నారు. టిడిపి ప్రభుత్వం రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు.
వారంలో మూడురోజులు మంగళగిరి నియోజకవర్గానికే కేటాయిస్తానని గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి..మొదలుపెట్టిన మూడు రోజుల పర్యటనలో జనహృదయాలను గెలుచుకున్నారు నారా లోకేష్. అన్నివర్గాలూ జేజేలు పలికాయి. యువత వెన్నంటి నడిచింది.