గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు
ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్
అమరావతి
విషయం: రైతులు క్రాప్‌హాలీడే విరమించేలా తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
ముఖ్యమంత్రి గారూ!
రైతురాజ్యం తెస్తానని మీరు ప్రభుత్వంలోకొచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రమంతా క్రాప్‌హాలీడేలు ప్రకటించడం వల్ల రైతుల్లేని రాష్ట్రంగా మారుతోంది. దేశానికే ధాన్యాగారంగా అన్నపూర్ణ అనిపించుకున్న ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయరంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పంట విరామం ప్రకటిస్తూ రైతులు వ్యవసాయానికి దూరమవడం బాధాకరం. గత ఏడాదే రాష్ట్రంలో కర్నూలు, కడప, ఉభయ గోదావరి జిల్లాల్లో క్రాప్ హాలిడే ప్రకటించారు. అప్పుడే రైతుల సమస్యలు గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుని వుంటే ఈ ఏడాది మరిన్ని ప్రాంతాల్లో క్రాప్ హాలీడే ప్రకటించేవారు కాదు.
`ఈ`క్రాప్ బుకింగ్‌లో సమస్యలు, సున్నా వడ్డీకి రుణాలు అందకపోవడం, వరికి మద్దతు ధర దక్కకపోవడం, ధాన్యం కొనుగోలు చేసి బకాయిలు చెల్లించకపోవడం వంటి ఇబ్బందులను ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోకుండా మొద్దునిద్ర పోయారు. ధాన్యం అమ్మి 4 నెలలు దాటినా డబ్బులు ఖాతాలో జమచేయక పోవడం, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం, సకాలంలో ఎరువులు, పురుగు మందులు సరఫరా చేయకపోవడం, ప్రభుత్వ సబ్సిడీలు నిలిపివేయడం, కాలువల ద్వారా నీళ్లందించడంలో నిర్లక్ష్యం, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోకపోవడంతో సాగుకు దూరమవుతున్నారు. మూడేళ్లలో ప్రకృతి వైపరీత్యాలతో 50 లక్షల ఎకరాలలో పంట నష్టం ఏర్పడితే ఒక్క రైతును కూడా ప్రభుత్వం పూర్తిగా ఆదుకోలేదు. పెట్టుబడికి, రాబడికి మధ్య భారీవ్యత్యాసం నెలకొంది.
పెట్రోల్, డీజిల్, వ్యవసాయం, యంత్ర పనిముట్లు ధరలు పెరిగిన స్థాయిలో వరి మద్దతు ధర పెంచకపోవడంతో వ్యవసాయం నష్టాలమయం అవుతోంది. ప్రభుత్వ చర్యలతో రైతు ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడోస్థానంలో ఉండగా, కౌలు రైతుల మరణాల్లో రెండో స్థానంలో నిలవడం వ్యవసాయరంగ సంక్షోభాన్ని సూచిస్తోంది. ఇప్పటికి 3వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీ సొంత జిల్లా కడపలో పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నా గతేడాది నుంచి రైతులు పంట విరామం కొనసాగిస్తున్నారు. కేసీ కెనాల్ కింద 90 వేల ఎకరాలు ఆయకట్టు ఉంటే మెజారిటీ రైతులు సాగుకు దూరమయ్యారు. కష్టనష్టాలు అధిగమించి పండిస్తే వచ్చే మద్దతు ధర పెట్టుబడి ఖర్చులకీ రాకపోవడంతో క్రాప్‌హాలీడే వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు.
గోదావరి జిల్లాలు, అనంతపురం, కర్నూలు, నెల్లూరులో పలు ప్రాంతాల్లో ఇప్పటికే పంట విరామం ప్రకటించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 5 లక్షల ఎకరాల్లో మిర్చి వేసి నష్టపోయిన రైతులకు మీ ప్రభుత్వం ఒక్క రూపాయి పరిహారం కూడా ఇవ్వకపోవడం దారుణం. మా ప్రభుత్వ హయాంలో ధాన్యం బకాయిలు వారంలోనే చెల్లించగా, నేడు 3 నెలలు దాటినా బకాయిలు చెల్లించకపోవడం రైతు ద్రోహం కాదా? టిడిపి సర్కారు రూ.4వేల కోట్లు పంటల బీమా కింద రైతులకు చెల్లిస్తే, మీరు ఇచ్చింది 2 వేల కోట్ల లోపే. రైతుల్ని ఆదుకుని వ్యవసాయరంగ సంక్షోభాన్ని నివారించాలనే చిత్తశుద్ధి మీ ప్రభుత్వానికి ఉంటే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం ఆపేయాలి. పంటలకు మద్దతు ధర అందించాలి. ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలి. ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి రూ.7 లక్షలు ఇవ్వాలి. పంట నష్టపరిహారం చెల్లించాలి. పోలవరం పూర్తిచేసి నదుల అనుసంధానం ద్వారా ఉత్తరాంధ్ర, రాయలసీమకు సాగునీరు, తాగునీరు అందించాలి. క్రాప్ హాలీడే ప్రకటించిన ప్రాంతాల్లో మీరు నేరుగా పర్యటించి, ప్రభుత్వం అండగా వుంటుందనే భరోసా నింపి రైతాంగాన్ని పంటలు వేసేలా ప్రోత్సహించాలి.
నారా లోకేష్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి