-
ఎమ్మెల్యేలను సైరన్ వాడవద్దని హెచ్చరికలు
-
సింప్లిసిటీ నేర్చుకోవాలని హితవు
-
ఇసుక సరఫరాపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
-
ఇకపై సచివాలయంలోనే బట్వాడా చార్జీల విధానం
-
ఎమ్మెల్యేల ఎస్కార్టు విధానంపై జూన్‌లో ‘సూర్య’లో కథనం
-
ఇసుకలో ట్రాన్సుపోర్టర్ల దోపిడీపై ‘సూర్య’లో తాజా కథనం
-
అన్ని లిక్కర్‌బ్రాండ్లు అందుబాటులోకి తెస్తామని బాబు వెల్లడి
-
ఇంకా ‘జనంలో ఇంకా జే బ్రాండ్లు’ పేరుతో జులైలో ‘సూర్య’లో కథనం
-
కలెక్టర్-ఎస్పీల కాన్ఫరెన్సులో వాటినే ప్రస్తావించిన సీఎం చంద్రబాబునాయుడు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తాజాగా నిర్వహించిన కలెక్టర్-ఎస్పీల కాన్ఫరెన్సులో, ‘సూర్య’ ఈ-పేపర్‌లో వెలువరించిన కథనాల్లో మూడు ప్రధాన అంశాలను ప్రస్తావించారు. ఎమ్మెల్యేలు అనధికారికంగా ఎస్కార్టులు వాడకుంటూ, సైరన్ మోగించుకుంటూ వెళుతున్న వైనం.. ఉచిత ఇసుక విధానాన్ని ట్రాన్సుపోర్టర్లు తూట్లు పొడుస్తున్న దోపిడీ విధానంపై ‘సూర్య’లో వచ్చిన వార్తా కథనాలను, చంద్రబాబునాయుడు తన ప్రసంగంలో ప్రస్తావించడం విశేషం.
‘ఎమ్మెల్యేలకు ఎస్కార్టు ఎందుకు’ కథనంతో జూన్ 15న వెలువడ్డ వార్తా కథనంలో.. ఎమ్మెల్యేల శైలిపై ప్రజల్లో వస్తున్న విమర్శలను, ‘సూర్య’ సవివరంగా వెల్లడించింది. అందులో స్థానిక డీఎస్పీ-సీఐల ఓవరాక్షన్ ప్రదర్శించి ఎమ్మెల్యేలను మెప్పించేందుకు చేస్తున్న వైనాన్ని వివరించింది. పైలెట్,ఎస్కార్టు వాహనాలతో సైరన్ మోగించుకుంటూ తిరుగుతున్న వైనంపై ప్రజల్లో వెల్లువెత్తుతున్న విమర్శలను ఆ కథనంలో వివరించింది. కాగా తాజాగా సీఎం చంద్రబాబు నిర్వహించిన కలెక్టర్-ఎస్పీల కాన్ఫరెన్సులో దాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో సైరన్ వేసుకుని వెళ్లడం మంచిదికాదు. ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయి. మనం సింప్లిసిటీ మెయింటైన్ చేయాలి. అందరికీ ఆదర్శంగా ఉండాల’ని హితవు పలికారు.
అధికారంలోకి వచ్చి ఇన్నిరోజులయినా మందుబాబుల గొంతులో ఇంకా జగన్ జె బ్రాండ్లే వెళుతున్న వైనంపై ‘సూర్య’లో జులై 11న ‘జనంలో ఇంకా జగన్ బ్రాండ్లు’ శీర్షికతో వార్తా కథనం వెలువడిన విషయం తెలిసిందే.
కాగా తాజా సదస్సులో ఈ అంశాన్ని ప్రస్తావించిన చంద్రబాబు.. త్వరలో అన్ని బ్రాండ్ల మద్యం అందుబాటులోకి రానుందని, ఇలా చేయడం వల్ల ఇతర రాష్టాల నుంచి మద్యం అక్రమ రవాణా తగ్గుతుందని బాబు ప్రకటించారు. తాము ప్రవేశపెట్టనున్న కొత్త లిక్కర్ పాలసీ దేశంలోనే అత్యుత్తమంగా ఉండబోతోందన్నారు.
ఇక ఇసుక విధానంపై చేసిన ప్రసంగంలో, ట్రాన్సుపోర్టు చార్జీల అంశాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. ‘ఉచిత ఇసుక విధానం లోపాలు గుర్తించాలి. దానిపై అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలి. వినియోగదారుడు సచివాలయంలోనే బట్వాడా చార్జీలు చెల్లించే విధానం ప్రవేశపెడుతున్నాం.
వినియోగదారుడు ట్రక్కులో ఇసుక వచ్చిందని చెబితేనే, రవాణా ఖర్చు చెల్లించే విధానం తీసుకువస్తున్నాం. ఇసుక తీసుకువెళ్లే వాహనాలను ప్రీపెయిడ్ ట్యాక్సీల తరహాలో ఊబరైజేషన్ చేస్తాం. రేట్లు కూడా స్థిరీకరిస్తాం. ఉచిత ఇసుక పాలసీకి తూట్లు పొడిస్తే సహించేది లేదని’ విస్పష్టంగా ప్రకటించారు.
కాగా ఉచిత ఇసుక విధానానికి ట్రాన్సుపోర్టర్లు తూట్లు పొడుస్తూ, ప్రభుత్వానికి అప్రతిష్ట తె స్తున్న వైనంపై గత రెండురోజుల క్రితం ‘కూటమి కళ్లలో ట్రాన్స్‌పోర్టర్ల ‘ఇసుక’ శీర్షికతో, ‘సూర్య’లో పరిశోధనాత్మక వార్తా కథనం వెలువడిన విషయం తెలిసిందే. చంద్రబాబు సర్కారు పేద-మధ్యతరగతి-సామాన్యులకు పైసా ఖర్చు లేకుండా, కేవలం తవ్వకాల చార్జీలు మాత్రమే వసూలు చేస్తు ఉచితంగా ఇస్తున్న ఉచిత ఇసుక విధానం.. ట్రాన్సుపోర్టర్ల దోపిడీతో నిర్వీర్యమవుతోందని ‘సూర్య’ ఉదాహరణలతో సహా పరిశోధనాత్మక కథనం వెలువరించింది.
ట్రాన్సుపోర్టర్ల ధనదాహంతో ఇసుక గత ప్రభుత్వంలో కంటే, ఇప్పుడు వందరూపాయలు పెరిగిన వైనాన్ని వివరించింది. ట్రాన్సుపోర్టర్లకు ముకుతాడు వేసి, 20 టన్నుల పరిమిత లోడింగ్ విధానాన్ని సమీక్షించకపోతే, బాబు ఇచ్చిన ఉచిత ఇసుక వల్ల ఉపయోగం ఉండదని స్పష్టం చేసింది. దానితోపాటు పోలీసు-మైనింగ్-రెవిన్యూ శాఖల సమన్వయం అవసమని సూచించింది. తాజా కలెక్టరు-ఎస్పీల సదస్సులో, సీఎం చంద్రబాబునాయుడు ఈ అంశాన్నే ప్రస్తావించడం గమనార్హం.