-అవే బ్రాండుయలు.. అవే ధరలు
– పాలన మారినా మందుకొట్లలో అవే బ్రాండ్లు
-అప్పుడప్పుడు రెండు మూడు ప్రీమియం బ్రాండ్లు
-కొత్తగా మారింది డిజిటల్ పేమెంట్లే
-జగన్ జమానాలో క్యాష్ పేమెంట్లే
– గతంలో జే బ్రాండ్లపై రఘురామరాజు పోరాటం
– ప్రాణాంతకమంటూ లోక్‌సభలో ఆందోళన
– సర్కారు హెచ్చరికలను ఖాతరు చేయని రాజు
– ల్యాబలేటరీ నుంచి జే బ్రాండ్లపై నాణ్యతా పరీక్షలు
– యమాడేంజర్ అని తేల్చిన ల్యాబ్ నివేదికలు
– దానిని అందిపుచ్చుకుని టీడీపీ సమరం
– జే బ్రాండ్లపై క్షేత్రస్థాయిలో నిరసనలు
– కొద్దిరోజులు హడావిడి చేసిన బీజేపీ చీఫ్ పురందేశ్వరి
– ఆ తర్వాత ‘మౌన’పోరాటం
– జే బ్రాండ్ల కొనసాగింపుపై మందుబాబుల అసంతృప్తి
– అధికారం మారినా అవే బ్రాండ్ల కొనసాగడంపై సందేహాలు
– అధికారులు కుమ్మక్కయారన్న అనుమానాలు
– ఇంకా ‘రాజంపేట లిక్కర్ లాబీ’ హవా సాగుతోందన్న సందేహాలు
– రాజకీయవర్గాల్లో చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)
బిడ్డ చచ్చినా పురిటి కంపు పోలేద న్నట్లు.. పాలన మారినా తమ గొంతులో అనే జగన్ బ్రాండ్లు నింపుకోవలసిన దుస్థితి పట్టిందని మందుబాబులు ఘొల్లుమంటున్నారు. గత ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే.. నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులోకి తీసుకువస్తామని, జే బ్రాండ్లకు పాతర వేస్తామని ఎన్డీయే కూటమి హామీ ఇచ్చింది. దానితో ఏపీలోని మందుబాబులంతా ‘ఫుల్లు’గా కూటమికి ఓట్లు గుద్దేశారు. వైసీపీ ఓటమికి ప్రధాన కారణాల్లో అదొకటి అన్నది బహిరంగమే. ఆ విషయాన్ని ఓడిన వైసీపీ ఎమ్మెల్యేలే కుండబద్దలు కొట్టారు.
సీన్ కట్ చే స్తే.. కూటమి అధికారంలోకి వచ్చి నెలరోజులవుతున్నా.. ఇంకా ప్రభుత్వ మద్యం షాపుల్లో జగన్ బ్రాండ్లే అమ్ముతుండటం.. అప్పటి ధరలే కొసాగిస్తుండటం, మందుబాబులకు అసంతృప్తినిస్తోంది. కాకపోతే జగన్ జమానాలో కేవలం నగదు అమ్మకాలే ఉండగా, ఇప్పుడు పేటీఎం ద్వారా అమ్మకాలు సాగుతున్నాయి. మిగిలినదంతా సేమ్ టు సేమ్. ప్రస్తుతం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ప్రీమియం బ్రాండ్లు దొరకడం లేదు. విజయవాడ, విశాఖ, గుంటూరు వంటి నగరాల్లో మాత్రం మాన్షన్‌హౌస్, బ్లండర్స్‌ప్రైడ్‌తోపాటు.. కింగ్‌ఫిషర్ బీర్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు.
మందుబాబులు ఎక్కువగా మాన్షన్‌హౌస్, మార్ఫియస్, మాక్‌డోవల్స్, బ్లెండర్స్‌ప్రైడ్, రాయల్‌స్టాగ్, రాయల్‌చాలెంజ్ బ్రాండ్లు కోరకుంటారు. ఇక టీచర్స్, 100 పైపర్స్, రెడ్‌లేబుల్, బ్లాక్ అండ్ వైట్ బ్రాండ్లు ఎగువ మధ్యతరగతి-ఆపై స్థాయి వర్గాలు కోరుకుంటారు. ప్రభుత్వం మారితే ఆ బ్రాండుయల వస్తాయని మందుబాబులు ఆశించారు. కానీ అది నేటికీ నెరవేరకపోవడం వారిని అసంతృప్తికి గురిచేసింది.
చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో ప్రతి వైన్ షాపు, బార్ అండ్ రెస్టారెంట్లలో ఇవి విరివిరిగా దొరికేవి. అప్పట్లో తెలంగాణ రాష్ట్రం ధరలతోనే అవి సమానంగా ఉండేవి. చీప్ లిక్కరు కూడా పేదవాడికి అందుబాటు ధరలోన్లే ఉండేవి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన పార్టీకి చెందిన ఓ యువ ఎంపీ, చెన్నైలో ఉండే జగన్ సోదరుడు కలసి రాష్ట్రంలోని ప్రధాన డిస్టలరీస్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ‘రాజంపేట లాబీ’.. అందులోనే తమకు ఇష్టమైన బ్రాండ్లు తయారుచేసి, విస్కీ-బ్రాందీ అమ్మేవారు. అందుకు అప్పటి కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి కూడా ఇతోథికంగా సాయం చేశారన్న విమర్శలొచ్చాయి.
వారి బ్రాండ్లను మాత్రమే.. ప్రభుత్వ లిక్కర్ షాపుల్లో అమ్మేలా ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా, జగన్ అండ్ కో వేల కోట్లకు పడగలెత్తిందని స్వయంగా టీడీపీ నేతలే ప్రెస్‌మీట్లు పెట్టి ఆరోపించారు. ఇప్పటి టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా-టీడీపీ అధికార ప్రతినిధి ఆనం రమణారెడ్డి అయితే, జే బ్రాండ్లు ప్రెస్‌మీట్‌లో ప్రదర్శనకు పెట్టి, ఎవరి వాటా ఎంతో వెల్లడించారు. ఇక టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి , లిక్కర్ స్కాం సూత్రధారుల పేర్లు బయటపెట్టారు.
స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు సైతం నాణ్యతలేని జే బ్రాండ్లతో వందలాదిమంది చనిపోతున్నారని, ప్రాణాంతకమైన రసాయనాలు కలిపి తయారుచేస్తున్న జేబ్రాండ్లను తాగవద్దని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు కూడా జే బ్రాండ్లతో మరణించిన వారి జాబితాను విడుదల చేసింది.
ఆ తర్వాత పురందీశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలిగా వచ్చిన తర్వాత కొద్దిరోజులు ప్రభుత్వ వైన్‌షాపుల వద్ద ఆందోళనలు చేశారు. బాటిళ్లు పగలకొట్టారు. షాపులో ఉన్న స్టాకుకు, జరిపిన అమ్మకాలకు తేడా గుర్తించిన పురందేశ్వరి ఆందోళన రాజంపేట లిక్కర్ లాబీని కలవరపెట్టింది. ఆ తర్వాత ఎందుకో మళ్లీ పురందేశ్వరి ఆ ఉద్యమం జోలికి వెళ్లలేదు. బహుశా ఇప్పటికీ ప్రభుత్వ వైన్‌షాపుల్లో.. అవే జే బ్రాండ్లు అమ్ముతున్న విషయం, ఆమెకు తెలియకపోవడమే ఆశ్చర్యం.
అసలు తొలుత ఈ జే బ్రాండ్ల దందా, వాటి వెనక జరుగుతున్న అవినీతి కుట్రను ప్రపంచానికి వెల్లడించింది నాటి వైసీపీ రెబెల్ ఎంపి రఘురామకృష్ణంరాజు. జగన్‌పై పోరాట క్రమంలో ఆయన జే బ్రాండ్ల కథను పార్లమెంటులో కూడా వినిపించారు. డిజిటల్ పేమెంట్లు లేకుండా నగదు తీసుకుని చేస్తున్న ఈ వ్యాపారంలో వస్తున్న డబ్బంతా.. తాడేపల్లి ప్యాలెస్‌కు పోతోందని సంచలన ఆరోపణలు చేశారు. దానిపై ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మద్యం తయారుచేసే కంపెనీలను బలవంతంగా స్వాధీనం చేసుకున్న జగన్ బ్యాచ్.. అప్పటి అధికారి వాసుదేవరెడ్డి సాయంతో వేలకోట్లు సంపాదిస్తోందని, అందుకే వాసుదేవరెడ్డిని ఏరికోరి తీసుకువచ్చి అక్కడ నియమించారంటూ, రఘురామరాజు చేసిన ఆరోపణలు పెను దుమారం రేపింది.
అక్కడితో ఆగని రఘురామరాజు.. చెన్నైలోని ఓ ల్యాబ్‌కు జే బ్రాండ్లను పరీక్ష కోసం పంపించారు. ఆ ల్యాబ్‌లో జే బ్రాండ్లు తాగితే వచ్చే అనర్ధాలు వెల్లడయింది. అవి ప్రాణాంతకమైన రసాయనాలతో తయారుచేస్తున్నారని, అవి తాగితే ప్రాణాలు త్వరగా పోతాయని నివేదిక ఇచ్చింది.
దానితో కలవరపడ్డ మందుబాబులు, ప్రాణభయంతో కొంతకాలం జే బ్రాండ్లు తాగడం మానేశారు. దానికి కారణం గ్రహించిన జగన్ సర్కారు.. ప్రభుత్వ షాపుల్లో దొరికే మద్యం నాణ్యమైనవేనని, వాటితో ఎలాంటి ప్రాణహాని లేదని ఒక ప్రకటన విడుదల చేసింది. జే బ్రాండ్లపై కథనాలు రాసిన మీడియాపై విరుచుకుపడింది.
అలాంటి ఆరోపణలు చేసేవారిపై.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చేసిన వాసుదేవరెడ్డి హెచ్చరికను, నాటి ఎంపి రఘురామకృష్ణంరాజు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దమ్ముంటే తనపై చర్య తీసుకోవాలని సవాల్ చేసినా, వాసుదేవరెడ్డి నుంచి జవాబు లేకపోవడం ప్రస్తావనార్హం.
రఘురామకృష్ణంరాజు ఆరోపణలను అందిపుచ్చుకున్న టీడీపీ.. జే బ్రాండ్లపై విరుచుకుపడింది. రాష్ట్ర అధ్యక్షుడు నుంచి గ్రామ అధ్యక్షుడు వరకూ, జే బ్రాండ్లతో వస్తున్న నష్టం గురించి హోరె త్తించారు. అందుకు తగినట్లే జే బ్రాండ్లు తాగిన వేలాదిమంది అనారోగ్యం పాలయ్యారు. త్వరగా మెదడు, గుండె, లివర్, శ్వాసకోశవ్యాధులతో వేలాదిమంది మంచం పట్టిన వైన ం మీడియాలో ప్రముఖంగా రావడం.. పేద ప్రజల కుటుంబాలను కలవరపరచించింది.
అసలే ఎక్కువ ధరకు అమ్ముతున్న జే బ్రాండ్లు, కుటుంబాలను కూడా మింగేస్తున్నాయంటూ మహిళలు కన్నెర్ర చేశారు. నిజానికి అంతకుముందు బాబు సర్కారులో.. లిక్కర్, చీప్ లిక్కరు ధరలు సామాన్యుడికి అందుబాటులోనే ఉండేవి. దానితో రోజువారీ సంపాదనపై ఆధారపడే వారు, తమ ఆదాయాన్ని కొంత మద్యానికి కేటాయించి, మిగిలి డబ్బును ఇంట్లో ఇచ్చేవారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైన్ షాపులు రద్దు చేసి, ఎక్కువ ధరలతో ప్రభుత్వ మద్యం దుకాణాల సంస్కృతికి తెరలేపారు. దానితో పేదవాడి సంపాదన మొత్తం జేబ్రాండ్ల ముఠా జేబుల్లోకి వెళ్లేది.
జే గ్యాంగ్ తయారుచేసిన జే బ్రాండ్ల అమ్మకాలతో, వేలకోట్లకు పడగలెత్తారన్న విమర్శలతోపాటు… నేరుగా నగదు అమ్మకాల ద్వారా వచ్చే డబ్బు, నేరుగా తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. క్వార్టర్ బాటిల్ చొప్పున, కమిషన్ ఠంచనుగా ప్యాలెస్‌కు చేరేందంటున్నారు.
‘ దేశం మొత్తం మీద మోదీగారి డిజిటల్ విప్లవం విజయవంతంగా నడుస్తుంటే, మా ఏపీలో గవర్నమెంటు లిక్కర్‌షాపుల్లో మాత్రం, నగదు అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ డబ్బు నేరుగా మా ప్రభుత్వంలో ఉన్న వారికే వెళుతోంది. ఆ డబ్బు ఎక్కడికి వెళుతోందో ఈడీ విచారణ జరపాలి. ఈ అమ్మకాలతోపాటు, ప్రాణాంతకమైన లిక్కరును పరీక్షించి, వాటిని నిషేధించాలని’ నాటి ఎంపి రఘురామకృష్ణంరాజు లోక్‌సభలో గళమెత్తారు. దానితో ఒక బృందాన్ని రాష్ట్రానికి పరిశీలనకు పంపగా.. వారిని కూడా నాటి జగన్ సర్కారు మేనేజ్ చేసి, అనుకూల నివేదికలు ఇప్పించుకుందన్న ఆరోపణలు వెలువడిన విషయం తెలిసిందే.
కాగా కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినా.. ఇంకా జే బ్రాండ్ల అమ్మకాల కొనసాగుతున్న వైనంపై, వివిధ వర్గాల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతపెద్దవారినైనా మేనేజ్‌చేసే పవర్‌ఫుల్ రాజంపేట లిక్కర్-శాండ్-మైన్ లాబీ కూటమి.. అధికారులను కూడా మేనేజ్ చేసి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ప్రకారంగా కొత్త లిక్కర్ పాలసీ వచ్చే వరకూ.. అంటే సెప్టెంబర్ వరకూ జే బ్రాండ్లనే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మరో ఆరునెలల వరకూ ఏపీలో మందుబాబులకు, జగన్ బ్రాండ్లే దిక్కయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే, మరోనెలలకు సరిపడా స్టాకును డిస్టలరీలు, బేవరేజస్ కార్పొరేషన్‌కు సమకూర్చినట్లు చెబుతున్నారు. ఆ స్టాకు అయిపోయిన తర్వాత, ప్రభుత్వం తీసుకునే నిర్ణయం బట్టి ప్రీమియం బ్రాండ్లు అందుబాటులోకి అవకాశం ఉంది.
ఇప్పటికే దానికి సంబంధించి ‘రాజంపేట లాబీ’.. తన పైరవీ కసరత్తును ముమ్మరం చేసి, కాగల కార్యం తీర్చే గంధర్వుల ద్వారా.. ‘అట్నుంచి నరుక్కువచ్చే’ ప్రయత్నం చేస్తోందని అటు కూటమి నేతల్లోనూ అనుమానాలు వ్యక్తమవుతోంది. ఏదేమైనా.. అధికారం మారి నెలరోజులవుతున్నా ఇంకా జగన్ బ్రాండ్లే జనంలో ఉండటంపై ప్రధానంగా కూటమి కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
మరోవైపు జగన్ బ్రాండ్లు తాగుతున్న మందుబాబులపై ధరల భారం కూడా ఇంకా కొనసాగడం అసంతృప్తికి గురిచేస్తోంది. ఎన్నికల ముందు మద్యం ధరలు తగ్గించి, నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకువస్తామని కూటమి హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకూ జగన్ పెంచిన ధరలు గూడా తగ్గించ కపోవడంపై మందుబాబులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
1 COMMENTS