ఆయన వచ్చాడంటేనే తగవు…
అది సత్యాకృష్ణుల
మధ్యే కానీ..
బలరామకృష్ణులే అవనీ..
కృష్ణార్జునులే అయినా..
నిప్పు రాజేస్తే సెగ మొదలే..
అయితే ప్రతి రణం వెనక
ఓ లోకోత్తర కారణం..
తంటా వెంట ఒక పంట..
కయ్యం సద్దుమణిగినాక కళ్యాణం..
అదే నారద పురాణం..!
కలహభోజుడు..
ఇదీ బిరుదు
నారదుడు వచ్చి వెళ్ళాక
గొడవ జరక్కపోవడం అరుదు..
ఇక్కడి కబుర్లు అక్కడ..
అక్కడి మాటలు ఇక్కడ..
ఏదైనా మంచికే..
చివరకు దుర్మార్గం కథ కంచికే..!
చేతిలో మహతి..
శ్రీహరి శరణాగతి..
నిరంతర నారాయణ నామపారాయణ..
మెడలో మాల..
తలకు ముడి..
కాళ్లకు పావుకోళ్లు..
కాషాయ వస్త్రాలు..
బుర్ర నిండా శాస్త్రాలు…
మాటల అస్త్రాలు..
చూపుల శస్త్రాలు..
విష్ణువుకు ఇష్టుడు..
బ్రహ్మకు బేటా..
ఇదీ నారదుడి బయోడేటా..
ఇవన్నీ ఇంకెవరికీ రావే..
ఆయన మాత్రం అచ్చం కాంతారావే..!
ఈ నారదుడే వ్యాసుడి చేత రాయించినాడు భారతం..
వాల్మీకికి ప్రబోధించినాడు
శ్రీరాముని చరితం..
అన్నమయ్యకు చూపిస్తే సరైన దారి..
గలగలా కీర్తనల గోదారి..!
నారదుని పాత్ర లేనిదే
రక్తి కట్టదు ఏ పురాణం..
హిట్టు కొట్టదు
పౌరాణిక చిత్రం..
రావణుడి కోపానికి..
సత్యభామ విలాపానికి..
కిట్టయ్య సల్లాపానికి..
నరనారాయణ రణానికి..
రామాంజనేయ యుద్ధానికి
కృష్ణాంజనేయ సమరానికి..
మంచోళ్లు ఏ ఇద్దరి మధ్య
యుద్ధం జరిగినా
అక్కడ ఆనందంగా
నారదయ్య సిద్ధమే..
పేరుకే తంపులు..
చెడుకే తలవంపులు..!
సినిమాల్లో నారదుడు చేసేది కామెడీ..
ఆయన కథ పేరడీ..
మాటల గారడీ..
గొడవలకు రెడీ..
నిజానికి నారదుల వారు
శ్రీహరికి ఫ్రాక్సీ..
ఆయన గుండెల్లో
ఈయన ప్లెక్సీ..
ఆ రెండు పాత్రలే
ఏ కధలోనైనా కీ..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286