– ఆ ఇద్దరి మధ్య అడ్డుగోడకు టెండర్
చూశారా భారతీయ జనతా పార్టీ హైడ్రామా..ఆంధ్ర రాష్ట్రంలో కనీస ఓటు బ్యాంకైనా లేని పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉండటంతో.. అక్కడి బలుపును ఇక్కడ మన రాష్ట్రంలో వాపుగా చూపిస్తూ, రాష్ట్రంలోని మూడు పార్టీలను తన చుట్టూ గిరగిరా తిప్పుకుంటోంది. పవన్ పార్టీ జనసేన మొదట్లో సొంతంగా సరైన దశదిశ లేక.. అటు కమలం పార్టీ జాతీయ స్థాయిలో అతి పెద్ద వ్యవస్థగా విరాజిల్లుతోందని, ఆ పార్టీతో ఇంతకాలం స్నేహంగా మసలుతూ వచ్చింది.అదీ గాక జనసేనాని పవన్ కళ్యాణ్ కు సాక్షాత్తు ప్రధాని మోడీ ప్రాధాన్యత ఇస్తూ రావడంలో, ఆయన బిజెపి వైపు మొగ్గు చూపుతూ వచ్చారు.
తెలుగుదేశం పార్టీ అంతకు ముందు అంటే 2014 ఎన్నికల్లో బిజెపితో జత కట్టి మొన్న 2019 ఎన్నికలకు ముందు రామ్ రామ్ చెప్పి..కారణం ఏదైనా గాని అధికారానికి దూరమై.. ఇప్పటికింకా తేరుకోని పరిస్థితుల్లో అధికార వైసిపిని ఎదుర్కోడానికి ఒక తోడు కోసం వెంపర్లాడుతూ బిజెపి ఎప్పుడు స్నేహ హస్తం అందిస్తుందా అని ఎదురు చూస్తోంది. ఇక వైసిపి సంగతి సరేసరి..ఆ పార్టీ అధినేతది కుడితిలో పడ్డ ఎలక పరిస్థితి.కేంద్రంలో అంత బలమైన ప్రభుత్వాన్ని నడుపుతున్న బిజెపికి ఎదురెళ్ళలేని సంకట స్థితిలో ఆయన ఉన్నారు.అలాగని బిజెపి ఆయనకు..ఆయన పార్టీకి పెద్ద పీట వేస్తున్న సన్నివేశమూ కనిపించడం లేదు.ఇంకోపక్క కమలం పార్టీ తన స్వరాష్ట్రంలో తనకు భీకర ప్రత్యర్ధులైన తెలుగుదేశం.. జనసేన పార్టీలతో జట్టు కడుతుంటే చూస్తూ ఊరుకోలేరు. అలాగని ఆయా పార్టీల మధ్య సయోధ్య కుదరకుందా ఆపలేరు.ముందు నుయ్యి..వెనక గొయ్యి పరిస్థితి..!
నిజానికి ఈ పరిస్థితి మొత్తం బిజెపి కల్పించినదే.రాష్ట్రంలో కనీస బలం,ఓటు బ్యాంకు లేకపోయినా , ముందే చెప్పుకున్నట్లు కేంద్రంలో ఉన్న అధికారం..జాతీయ స్థాయిలో ఉన్న పట్టు ఆధారంగా , రాష్ట్రంలో ఉన్న మూడు పార్టీలను కమలనాథులు స్తంభాలాట ఆడిస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమిటంటే.. గత కొంతకాలంగా బిజెపి నాయకులు జనసేన పార్టీ ఎటూ స్థిరపడకుండా, అటూ ఇటూ తిప్పుతున్న సంగతి అందరికీ తెలిసిందే. పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్ కు, ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా ఆయనని.. ఇతర రాజకీయవర్గాలను.. ప్రజలను ఒక రకమైన అయోమయంలో ముంచెత్తుతూ కమలనాథులు వినోదం చూస్తున్నారు.అయితే మొన్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు.. జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలవడంతోనే బిజెపిలో కలవరం పుట్టుకొచ్చింది.
తెలుగుదేశం,జనసేన కలిసిపోతే తాము ఇంతకాలంగా ఆడుతున్న ఆటకు తెరపడిపోయినట్టేనని భావించిన కమలం పార్టీలో కలవరం మొదలైంది. అఫ్కోర్స్..ఆ రెండు పార్టీలు కలిసినా, వాటితో చెయ్యి కలిపై అవకాశం బిజెపికి ఉంటుంది.కాని అప్పుడు కమలం పార్టీకి పొత్తులను శాసించే పరిస్థితి ఉండదు.అదీగాక టిడిపితో చెలిమి చేసే విషయంలో ఇంక ఎంతమాత్రం బెట్టు ప్రదర్శించే అవకాశం బిజెపికి ఉండదు.అయితే చెలిమి..లేదంటే కటీఫ్…!పవన్..బాబు కలిసిపోతే ఇక బిజెపి కూడా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తప్పదు..ఎన్నికల చివరి నిముషం వరకు ఇప్పుడు చేస్తున్నట్టు మూడు పార్టీలను వెనక తిప్పుకునే ఆటకు తెర దించాల్సిందే..!
ఇదంతా గ్రహించిన కమలనాథులు ఇప్పుడు కొత్త ఆటకు తెర ఎత్తారు. బాబు..పవన్ కలిసిపోతారేమో అనే వాతావరణం ఏర్పడడంతోనే, కమలనాథులకు ఒక్కసారిగా పవన్ మీద ప్రేమ పుట్టుకొచ్చేసింది. ఉత్తర క్షణంలోనే జనసేనతోనే తమ మైత్రి..బాబుతో కలిసేది లేదు..పవన్ కళ్యాణ్ కు రూట్ మ్యాప్..వంటి స్టేట్మెంట్లు చకాచకా వచ్చేస్తున్నాయి..ఇదంతా పవన్ మీద ప్రేమ కాదు.ఆయన బాబుతో జత కట్టకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నమే. అంతే కాదు..పవన్..బాబు కలిస్తే ఇక 2024 ఎన్నికలకు సంబంధించి పొత్తులపై క్లారిటీ ఇంచుమించు వచ్చేసినట్టే..నిజానికి టిడిపి.. జనసేన..ఈ రెండు పార్టీలే వైసిపికి నిఖార్సయిన ప్రత్యర్ధ పక్షాలు.. బిజెపి ఇప్పటికైతే న్యూట్రల్ అనడానికి కూడా లేని మిత్రపక్షం వైసిపికి.. అలాంటి పరిస్థితుల్లో బాబు..పవన్ కలిస్తే ఇక బిజెపి ఎటు ఉన్నా ఒకటే.. ఆ పార్టీ అప్పుడు వైసిపితో జత కట్టినా పవన్..బాబులకు వచ్చిన నష్టం..జగన్ పార్టీకి జరిగిపోయే మేలు ఉండదు.కాకపోతే జగన్మోహన రెడ్డికి వ్యక్తిగతంగా ప్రయోజనం ఉండవచ్చు.
ఇకపోతే వైసిపితో బిజెపి కలిస్తే, కమ్యూనిస్టులు ఇక జగన్ వైపు చూసే ప్రశ్నే ఉండదు.అప్పుడు ఎర్ర పార్టీలు కూడా టిడిపి.. జనసేన కూటమితో చెయ్యి కలిపే అవకాశం ఉండవచ్చు. రాష్ట్రంలో ఇప్పటికీ కొంత పటిష్టమైన వ్యవస్థ..ఎంతో కొంత ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్ సైతం ఈ కూటమితోనే చెయ్యి కలిపే అవకాశం ఉంటుంది..! వీటన్నిటిపై ఇప్పటికిప్పుడు స్పష్టత కనిపించకపోయినా, ఇలా జరగడానికే ఛాన్స్ ఎక్కువ. ఏది ఏమైనా మొన్న విజయవాడలో బాబు..పవన్ కలయిక, కొత్త రాజకీయ పరిణామాలకు
తెర ఎత్తినట్టే..ఆ ఇద్దరి భేటీ ఇటు కేంద్రరాష్ట్రాల్లో అధికార పార్టీలకు కలవరం పుట్టించిందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..ఆ ఇద్దరూ కలవకుండా చెయ్యడానికి బిజెపి అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇవి మరింత ఉధృతం అయ్యేలోగానే చెలిమిపై బాబు..పవన్ ఒక నిర్ణయానికి వస్తే రాష్ట్రంలో 2024పై స్పష్టత వచ్చేసినట్టే..మొదటగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ నిలకడగా వ్యవహరించాల్సి ఉంటుంది..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
జర్నలిస్ట్
9948546286