Suryaa.co.in

Andhra Pradesh

జగన్ ది జనరంజకపాలన కాదు..జనపీడిత పాలన

– సంక్షేమ పాలన కాదు.. సంక్షోభ పాలన
– ప్రజలు బతికుండగానే వారికి నరకంచూపిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు
– జగన్ రైతులను ఆదుకుంటే, పంటవిస్తీర్ణం, దిగుబడిపెరిగినా అన్నదాతల ఆత్మహత్యల్లో రాష్ట్రం తొలిస్థానంలో ఎందుకుంది?
• 85శాతం మంది ఆధారపడే వ్యవసాయరంగం దారుణంగా దెబ్బతిన్నది.
• జగన్ రెడ్డి పాలనలో యూరియా, పొటాష్, డీఏపీ ధరలు రెండురెట్లుపెరిగితే, రైతులుపండించే పంటఉత్పత్తుల ధరలు మాత్రం నేలమీదనే ఉన్నాయి.
• 59లక్షల ఎకరాల్లో రైతులు పంటలు పండిస్తున్నారనిచెప్పిన ప్రభుత్వం, పంటలబీమా సొమ్ము చెల్లింపులు నామమాత్రంగా చేస్తూ, అన్నదాతలనోట్లో మట్టికొట్టింది.
• గతప్రభుత్వంతో పోలిస్తే, ఈ ప్రభుత్వంలో పంటదిగుబడులు 11శాతం ఎందుకు తగ్గాయి?
• పశువైద్య ఖాళీలు భర్తీచేయకుండా, గోపాలమిత్రల వ్యవస్థను నిర్వీర్యంచేసిన జగన్ రెడ్డి, మొబైల్ వెటర్నరీ వైద్యసేవతో ఎవరికి మేలుచేస్తున్నాడో చెప్పాలి?
– మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్

మరణించినవారు నరకలోకంలో నానాయాతన, దారుణాతిదారుణమైన శిక్షలు అనుభవి స్తారని చెప్పుకుంటూఉంటామని కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు బతికుండగానే నర కం చూస్తున్నారని, ఉమ్మడిఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత, ఏపీ విభజనానంతరం ఏనాడూ చూడని నరకయాతన అనుభవిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీశాసనస భ్యులు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ స్పష్టంచేశారు.మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే…

“వైసీపీప్రభుత్వానిది జనరంజకపాలన కాదు… జనపీడిత పాలన. సంక్షేమ పాలనకాదు ..సంక్షోభ పాలన. ఉమ్మడిరాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కానీ ఎప్పుడూకూడా ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు. నెలకుఒక్కసారికూడా సచివాలయం ముఖంచూడకుండా గడిపిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు. ముఖ్యమంత్రి అనేవారు ఎవరున్నా ప్రజలతో నేరుగా మమేకమై, వారిసమస్యలు, కష్టసుఖా లు తెలుసుకుంటారు. కానీ జగన్ రెడ్డి ఏనాడూ ప్రజలవైపు కన్నెత్తిచూడటానికే ఇష్టపడలే దు. ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే రాష్ట్రంలో ఇసుకసంక్షోభం సృష్టించాడు. వేలాది భవన నిర్మాణ అనుబంధరంగాల కార్మికులను రోడ్డునపడేశాడు. ప్రత్యేకహోదాతో పరిశ్రమలు వస్తా యి..యువతకు ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయని ఊదరగొట్టినజగన్మోహన్ రెడ్డి, ముఖ్యమం త్రి కాగానే తనపైఉన్నకేసుల భయంతో హోదాను తాకట్టుపెట్టేశాడు.

రాష్ట్రంలో దాదాపు 85శాతం మంది వ్యవసాయరంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి రంగాన్ని సర్వనాశనంచేసి, రాష్ట్రాన్ని కోలుకోలేనివిధంగా దెబ్బతీసిన ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు. ఆయన ముఖ్యమంత్రికాగానే రూ.800లు ఉండే డీఏపీ ధర రూ. 1400లకు పెరిగింది. రూ.800లు అమ్మే పొటాష్, రూ.1100లు అయ్యింది. రూ.180లకు దొరికు యూరియాను రూ.350లు పెట్టి బ్లాక్ లోకొనాల్సిన దుస్థితి. ఎరువులధరలు, విత్తనా లు, కూలీలధరలు పెంచిన ముఖ్యమంత్రి, రైతులుపండించే ధాన్యం, ఇతర పంటఉత్పత్తుల ధరలు మాత్రంఎందుకు పెంచలేదు?

అత్యధిక రుణభారం ఉన్న అన్నదాతల జాబితాలోమన రాష్ట్రమే దేశంలో నంబర్ 1 స్థానంలోఉంది. రైతు, కౌలురైతుల ఆత్మహత్యల్లో కూడా ఏపీది దేశంలో తొలిస్థానమే. ప్రభుత్వంచెప్పినట్టుగా రూ.3వేలకోట్ల ధరలస్థిరీకరణ నిధి ఏర్పాటుచే సుంటే, రైతులు రూ.1000కి, అంతకంటే తక్కువధరకు ధాన్యం ఎందుకు తెగనమ్ము కుంటున్నారు? వ్యవసాయరంగంలో అద్భుతాలుచేస్తున్నామంటున్న ముఖ్యమంత్రి మాట లు గడపదాటడంలేదు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినకొత్తలో రైతుపండించే ప్రతిపంటను తనప్రభుత్వమే గిట్టుబాటుధరకు కొంటుదన్నాడు.

ప్రతిఎకరాకు పంటలబీమామొత్తం ప్రభుత్వ మే చెల్లిస్తుంది రైతులురూపాయి కట్టక్కర్లేదు అన్నాడు. రాష్ట్రంలో రైతులు 59.05 లక్షలఎకరాల్లో పంటలు పండిస్తున్నారని వైసీపీ ప్రభుత్వమే అసెంబ్లీలో చెప్పింది. ఎకనామిక్ సర్వే లెక్కలప్రకారం 2019ఖరీఫ్ లో 16.77లక్షల మందిరైతులకు సంబంధించి, 20.17లక్షల ఎకరాలకు పంటలబీమా చేసినట్లు, ఆమొత్తం విలువ రూ.15,275కోట్లని లెక్కలు చెప్పారు. 2020 ఖరీఫ్ నాటికి రైతులసంఖ్య 16.77 లక్షలనుంచి 30లక్షలకు పెరిగింది. కానీ 2020లో పంటబీమా విస్తీర్ణం మాత్రం 20.17లక్షల ఎకరాలనుంచి కేవలం 23లక్షల ఎకరాలకు మాత్రమే పెరిగింది.

కానీ విలువమాత్రం రూ. 15,275కోట్లనుంచి రూ. 14,600 కోట్లకు పడిపోయింది. 2019-20లో రాష్ట్రరైతాంగం 41.45లక్షలహెక్టార్లు సాగుచేస్తే, దిగుబడి 175లక్షలమెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలని ఎకనామిక్ సర్వేలో ప్రభుత్వమే చెప్పింది. 2020-21లో 43లక్షల హెక్టార్లలో సాగుజరిగితే, పంటఉత్పత్తుల దిగుబడి మాత్రం 168 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయింది. పంటవిస్తీర్ణం పెరిగి దిగుబడి తగ్గడం ఈ ప్రభుత్వ వైఫల్యంకాదా? ముఖ్యమంత్రి చేతగానితనంవల్లే రాష్ట్రవ్యవసాయరంగం సంక్షోభంలో కి నెట్టబడిందనేది వాస్తవంకాదా? గతప్రభుత్వంలోనే రైతులరుణమాఫీకి సంబంధించి జీవోలు ఇచ్చి, బాండ్లుమంజూరుచేస్తే, ఈప్రభుత్వం ఆ చెల్లింపులతో మాకేంటి సంబంధం అని బుకా యించింది.

అదే వైసీపీ ప్రభుత్వం ఎప్పుడో ఎన్టీఆర్ హాయాంలో కట్టిన ఇళ్లకుమాత్రం ఓటీఎస్ పేరుతో ప్రజల ముక్కుపిండి డబ్బు వసూలు చేసింది. 2019లో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు రైతాంగం 26లక్షలఎకరాల్లో పంటలునష్టపోతే, వారికి పరిహారంగా ప్రభుత్వమిచ్చింది కేవలం రూ.14.02కోట్లు మాత్రమే. ఆలెక్కన పంటలు నష్టపోయిన రైతులకు ఒక్కోఎకరాకు జగన్మోహన్ రెడ్డి కేవలం రూ.5నుంచి రూ.6వేలు మాత్రమే సాయం చేశాడు. ఇలాంటి అరకొరసాయంతో రైతుల జీవితాలు మార్చేశానని ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటు. రాష్ట్రంలో అధికవర్షాలు, తుఫాన్లకారణంగా ఈ ప్రభుత్వం లో 9లక్షల50వేలఎకరాల్లో రైతులు పంటనష్టపోతే, వారికి ఇప్పటికీ రూపాయి పరిహారం ఇవ్వని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే.

భూములులేక, పెట్టుబడి ఎక్కువై కౌలు రైతులు ఆత్మహత్యచేసుకుంటున్నారంటే దానికి కారణాలున్నాయి. కానీ భూమిఉండి, పెట్టుబడులు పెట్టికూడా రైతులు ఎందుకు ఈ ప్రభుత్వంలో ఎక్కువగా ఆత్మహత్యలు చేసు కుంటున్నారనే ప్రశ్నకు ముఖ్యమంత్రి ఏంసమాధానంచెబుతాడు? ఆయన చెప్పే రైతుసంక్షేమం, వారి సంతోషం అంతా పత్రికల్లో ప్రకటనల్లోనేకనిపిస్తోంది తప్ప, వాస్తవంలో కాదు. గుంటూరుజిల్లాలో 5లక్షలహెక్టార్లలో మిర్చిసాగుచేసి రైతులు తీవ్రంగా నష్టపోతే, ఈ ప్రభుత్వం ఇంతవరకు ఒక్కరైతుకి కూడా పైసాసాయంచేయలేదు. మిర్చిధర పెరిగినా, ఈ సంవత్సరం మిరపరైతులకు నష్టమే మిగిలింది.

ముఖ్యమంత్రిగొప్పలుచెప్పే రైతుభరోసా కేంద్రాలు రైతుదోపిడీకేంద్రాలుగా మారాయి.వాటిద్వారా వైసీపీనేతలు లక్షాధికారులు అయితే, రైతులుబికార్లుగా మారారు. రైతాంగంతో ముడిపడి ఉండే సాగునీటిరంగానికి ఈ ప్రభుత్వం మూడేళ్లలో చేసినఖర్చు అరకొరే. పంటలవిస్తీర్ణం పెరిగినా, దిగుబడిపెరిగినా ఈప్రభుత్వంలో సాగునీరు అందించే పరిమితి మాత్రం పెరగలేదు.

మొబైల్ వెటర్నరీ వాహనసేవలు ప్రారంభించామని గొప్పలుచెప్పుకుంటున్న ముఖ్యమంత్రి ఖాళీగా ఉన్న 200పశువైద్య ఉద్యోగాలను ఎందుకు భర్తీచేయలేదు? పశు వైద్యులు లేకుండా ఉత్తుత్తివాహనాలతో రైతులకు, పశువులకు ఒరిగేదేమిటో ముఖ్యమంత్రే సమాధానంచెప్పాలి. తనకు వచ్చే కమీషన్లకోసమే ముఖ్యమంత్రి ఆఖరికి మూగజీవాలను కూడా వ్యాపారాంశంగా మార్చాడు. టీడీపీహాయాంలో గోపాలమిత్రలు పశువైద్యులకు చేదో డుగా ఉంటూ సేవలందించేవారు. అలాంటివ్యవస్థను కూడా జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశాడు.

ముఖ్యమంత్రి ఇటీవలప్రారంభించిన మొబైల్ వెటర్నరీ వైద్యసేవల విభాగంలో కేంద్రం వాటా 60శాతం ఉంటే, రాష్ట్రవాటా కేవలం 40శాతం మాత్రమే. మొబైల్ వెటర్నరీ వైద్యసేవల నిమిత్తం, ప్రభుత్వం 175 అంబులెన్సులు కొన్నట్లు చెప్పింది. ఈ పథకం ఏపీలోనే కొత్తగా పుట్టుకొచ్చినట్లు కబుర్లుచెప్పారు. కానీ తమిళనాడు, కర్ణాటక, ఇతరరాష్ట్రాల్లో దాదాపు 5ఏళ్ల క్రితమే మొబైల్ వెటర్నరీ వాహనసేవల పథకం అమల్లోఉంది. మొబైల్ వెటర్నరీ వాహనసేవ లకోసం ఈ ప్రభుత్వం కొన్న 175 అంబులెన్స్ లను ఎంతధరకు కొన్నదో సమాధానంచెప్పాలి ?

వాటి నిర్వహణ, సిబ్బంది జీతభత్యాల సంగతి, ఇతరత్రా వ్యవహారాలపై జగన్మోహన్ రెడ్డి తక్షణమే శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్ చేస్తున్నాం. మొబైల్ వెటర్నరీ వాహనాల ద్వారా పశువులకు అందించే దాణా సరఫరా కాంట్రాక్ట్ నికూడా జగన్మోహన్ రెడ్డి తన మనిషి అయిన శివబిరామిరెడ్డికిచెందిన ఫర్టైల్ గ్రీన్ కంపెనీకి అప్పగించాడు. సదరుకంపెనీ మెట్రిక్ టన్ను నాసిరకంపశువులదాణాని రూ.16వేలకుకొంటోంది. మరోరూ.4వేలు పెడితే నాణ్యమై న మేలురకమైన పశువుల దాణా అందించే కంపెనీలు రాష్ట్రంలో చాలాఉన్నాయి. కానీ టీఎం ఆర్ పశువుల దాణానే పాడిరైతులుకొనాలంటూ ప్రభుత్వం వారిని వేధిస్తోంది.

పశువుల దాణాకొనుకోళ్ల వ్యవహారంలో దాదాపు రూ.40కోట్లప్రజలసొమ్ముని జగన్మోహన్ రెడ్డి రామిరెడ్డికి చెందిన ఫర్టైల్ గ్రీన్ కంపెనీకి దోచిపెడుతున్నాడు. అలానే రైతుభరోసా కేంద్రాల్లో తనపార్టీ ఎమ్మెల్యేకి చెందిన వల్లభ పశువులదాణాను మాత్రమే అమ్ముతున్నారు. ఈ విధంగా మూగజీవాలను అడ్డంపెట్టుకొని కూడా ముఖ్యమంత్రి తనపార్టీవారికి, తనకులం వారికి దోచిపెడుతున్నాడు. పశువైద్యఖాళీలు భర్తీచేయకుండా, కాంపౌండర్లను నియమించ కుండా, గోపాలమిత్రల సేవలు అందుబాటులోలేకుండా మొబైల్ వెటర్నరీ వాహనాలు దేనికి పనికొస్తాయో, పాడిరైతులకు ఎలాంటిసేవలు అందిస్తారో చెప్పాలి.

22మంది ఎంపీలున్నా జగన్ రెడ్డి రాష్ట్రానికి సాధించింది శూన్యమే. ప్రత్యేకహోదాతెస్తాను, యువతను ఉద్యోగాలతో ఉద్ధరిస్తాను అన్నవ్యక్తి మూడేళ్లలో ఏంచేశాడు? కేంద్రప్రభుత్వం అడిగితేనే వైసీపీ అన్ని బిల్లులకు మద్ధతిస్తోందా? రాష్ట్రపతిఎన్నికైనా, మరోటైనా ఢిల్లీలో వైసీపీఏం చేస్తుందో ప్రజలకు బాగాతెలుసు.”

LEAVE A RESPONSE