-కార్పొరేట్ దోస్తుల 12 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిండు
-ఎల్ఐసి ల ఉన్నయి పేదల పైసలు.. అదానికి దోచిపెట్టినవ్
-పెట్రోల్,డీజిల్,గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి పేదోల్ల పొట్ట గొడుతున్నవ్
-దేశంలో అసలు దొంగ ప్రధాని మోడీ నే
-మోడీ అహంకారీ..ఎమర్జెన్సీ రోజుల కంటే హేయమైన చర్యలు
-కేసిఆర్ మోడీ అవినీతిని ప్రశ్నిస్తున్నడు…అందుకే ఆయన బిడ్డ కవితమ్మను కేసుల పేరుతో వేధిస్తున్నరు
-రేపు నామీద కూడా కేసులు పెడ్తరు..భయ పడేది లేదు
-రాహుల్ గాంధీ మోడీ అవినీతిని ప్రశ్నిస్తే…. ఎంపీ పదవి నుంచి డిస్ క్వాలిఫై చేశారు
-కాంగ్రెస్ సన్నాసులు అది మాట్లాడక…మా మీద ఒర్లుతున్నరు
-పెద్దాయన డి.ఎస్ కు జాతి రత్నాల్లాంటి ఇద్దరు కొడుకులు ఉన్నరు
-ఆయన పరిస్థితి ఏ తండ్రికి కూడా రావొద్దు
-అర్వింద్ కు పసుపు రైతుల ఉసురు తగిలింది..ఇంకా తగులుతుంది
-ఆయన వల్ల బాండ్ పేపర్ వాల్యూ పోయింది..రైతులు,ప్రజల్లో ఆయన వాల్యూ కూడా పోయింది
-తెలంగాణ రాష్ట్ర చరిత్రలో 90 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిoది కేసీఆర్ ప్రభుత్వమే
-గ్రూప్ వన్ లీకేజీ దురదృష్ట కరమే…. కానీ రేవంత్ రెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తున్నడు
-బండి సంజయ్,రేవంత్ రెడ్డికి నెత్తా…కత్తా..? ఏదిపడితే అది మాట్లాడుడే
-కెటిఆర్ మీద చిల్లర మల్లర మాటలు మాట్లాడితే సహించేది లేదు
– మోర్తాడ్ మండల బిఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల క్లస్టర్ 2 గ్రామాల బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం మంగళవారం నాడు జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు, పార్టీ జిల్లా ఇంఛార్జి మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్నాపెద్ద తేడా లేకుండా కుటుంబ సమేతంగా అందరు ఆత్మీయ సమ్మేళనానికి రావడం పట్ల మంత్రి వేముల సంతోషం వ్యక్తం చేశారు. సమావేశ ప్రాంగణంలో కలియ తిరుగుతూ..సమ్మేళనానికి వచ్చిన వారు మంచి చెడులు అడుగుతూ ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. మంత్రితో పలువురు కుటుంబ సభ్యులు ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు.
మంత్రి ఓపిగ్గా సుమారు 200 మంది కుటుంబాలతో ఫోటోలు దిగి వారిలో నూతనోత్తేజాన్ని నింపారు. మంత్రి వేముల కలుపుగోలుతనంతో సమ్మేళన ప్రాంగణమంతా పండుగ వాతావరణంలో కోలాహలంగా కన్పించింది. పలువురు బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు తమ నాయకుడు వేముల.. బాల్కొండ నియోజకవర్గంలో, మోర్తాడ్ ప్రాంతంలోని గ్రామాల్లో చేసిన అభివృద్ధిని ఈ సమ్మేళనం వేదికగా వివరించారు. తమకు అన్ని విధాల అండగా నిలిచే ఇట్లాంటి నాయకున్ని వదులుకునే ప్రసక్తే లేదని వారి మాటల్లో స్పష్టం చేశారు. ఈ సందర్బంగా జిల్లా పార్టీ ఇంఛార్జి మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్.. అధినేత కేసీఆర్ పంపిన సందేశాన్ని బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు చదివి వినిపించారు.
అనంతరం బి ఆర్ ఎస్ శ్రేణులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు…
రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మంత్రి కేటీఆర్ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు. ప్రతి దానిపై అబద్దాలు ఆడుతూ బురద జల్లుతున్నారు. బండి సంజయ్, అరవింద్ ఎమ్మెల్సీ కవిత పై లేని పోనీ ఆరోపణలు చేస్తున్నారు. కవితకు సంబంధం లేని కేసులో ఇరికించి ఆమెను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. దేశంలో అసలు దొంగ ప్రధాని నరేంద్ర మోడీ. దేశంలో బడా కంపెనీలు లోన్లు తీసుకుంటాయి. అలా తీదుకున్న వారి రూ. 12 లక్షల కోట్లు మాఫీ చేశాడు మోడీ. కేసీఆర్ ఎందుకు మాఫీ చేశావని అడిగితే కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని మోర్తాడ్ మండల కేంద్రంలో జరిగిన బిఆరెస్ ఆత్మీయ సమ్మేళనంలో అన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. మోడీ ఫ్రెండ్ ఆదాని, ఒకప్పుడు అతని ఆస్తి 50 వేల కోట్లు. ఇప్పుడు 12 లక్షల కోట్లు. ఎల్ ఐ సి కి 60 వేల కోట్లు నష్టం వచ్చిoది. ఈ డబ్బులు మోడీ అదాని కంపెనీలో పెట్టాడు. ఎల్ ఐ సి, బ్యాంకు నష్టపోతే ప్రజలు నష్టపోయినట్లే…. ఇది అన్యాయాన్ని కేసీఆర్ అడిగితే కవితపై కేసుల్లో ఇరికిస్తున్నారు. లక్షా 50 వేల కోట్లు కాజేసిన అదానిపై చర్యలు తీసుకోరేందుకు అని ప్రశ్నించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. పేపర్ లీక్ విషయంలో అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు మంత్రి వేముల. నరేంద్ర మోడీ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని అన్నారు. ఎమర్జెన్సీ రోజుల కంటే హేయమైన చర్యలు చేపడుతున్నారని అన్నారు.
నరేంద్ర మోడీ పాలనలో రూపాయి విలువ పతనమైంది. సిలిండర్ ధర రూ. 400 నుంచి రూ.1200 పెరిగింది. పప్పు, అప్పుల ధరలు పెరిగిపోయాయి. డీజిల్ ధర రూ. 40 నుంచి రూ. 100 అయ్యింది. దీంతో ట్రాన్స్ పోర్ట్ ధర పెరిగి నిత్యావసర సరుకుల మీద ప్రభావం చూపుతోంది. సామాన్యుల మీద ధరలు పెరగడం పెను భారంగా మారింది. దీనంతటికి కారణం ప్రధాని మోడీ. తెలంగాణలో ఓ వైపు కేసీఆర్ పేద ప్రజల సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే…. నరేంద్ర మోడీ ధరలు పెంచి సామాన్యులను లూటీ చేస్తున్నారని అన్నారు మంత్రి. ప్రపంచంలో అత్యంత అవినీతి పరుడు నరేంద్ర మోడీ. బడా బాబుల కంపెనీలకు రుణాలు మాఫీ చేసి పేదల డబ్బులు దోచుకుంటున్నారు. ఆ డబ్బులతో ఎమ్మెల్యేలను కొంటున్నారు. అలా తెలంగాణలో 4 గురు ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసి దొరికి పోయారు. వాళ్ళ అవినీతి గురించి మాట్లాడితే…. కేసులు పెడుతున్నారు. రాహుల్ గాంధీ మీద అనవసరంగా… కేసులు పెట్టారు. లలిత్ మోడీ, నీరవ్ మోడీ ఇలా 6 గురు మోడీలు డబ్బులు కాజేసి విదేశాల్లో తలదాచుకున్నారు. రాహుల్ గాంధీ అన్న మాట ఏంటంటే మోడీ పేరుతో ఉన్న గుజరాత్ కు చెందిన 6 గురు అని అంటేనే ఆయన్ను ఎంపీ గా డిస్ క్వాలిఫై చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఇలాంటి సంఘటన జరగలేదు.
ఎమర్జెన్సీ కంటే చాలా అన్యాయం జరుగుతోంది. దర్యాప్తు సంస్థలు వాళ్ళ గుప్పిట్లో ఉన్నాయి. దీన్ని ప్రజలు గమనించాలి. బాల్కొండ నియోజక వర్గ ప్రజల ఆశిష్షులతోనే ఇవాళ నేను ఇలా ఉన్నాను. కేసీఆర్ తో నాకున్న సాన్నిహిత్యం వల్ల ఆయన దయతో బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గ్రామాల్లో కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతోంది. దొన్పాల్ అనే గ్రామంలో 300 ఇల్లు ఉంటే 316 మందికి పెన్షన్లు, రైతు బంధు కింద 375 మందికి రైతు బంధు ఇలా ఏ చిన్న గ్రామాన్ని వదలకుండా కేసీఆర్ సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. ప్రజలు అండగా ఉండాలని అడిగే హక్కు కేసీఆర్ కు ఒక్కడికే ఉంది.
పెద్దాయన డి.ఎస్ పరిస్థితి ఏ తండ్రికి రావొద్దు
అభివృద్ధి చూసి ఓర్వలేక ఎంపీ అరవింద్ లేనిపోని మాటలు మాట్లాడుతున్నాడు. నీ ఇంట్లోనే రెండు పార్టీలు ఉన్నాయి. పెద్ద కొడుకు, చిన్న కొడుకు రాజకీయాలు అనారోగ్యంగా ఉన్న తండ్రిని ఇబ్బంది పెడుతున్నారు. డీఎస్ కాంగ్రెస్ లో చేరలేదని భార్య ఒక వైపు లేఖ రాసింది. కాంగ్రెస్ లో చేరాడని పెద్ద కొడుకు, చేరలేదని చిన్న కొడుకు. 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండు పేపర్ రాసిచ్చి 5 ఏళ్ల వుతున్నా…. పసుపు బోర్డు లేదు. బాండు పేపర్ విలువను కూడా తగ్గించాడు అరవింద్. ఎంపీగా అరవింద్ జిల్లాకు ఏం చేశాడు అని అడిగితే…. సమాధానం చెప్పకుండా బూతులు తిడుతున్నాడు. ఎంపీ అరవింద్ వల్ల ఇంట్లో తల్లి దండ్రులకు మనశ్శాంతి లేదు. పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు చేసిన అభివృద్ధి లేదని అన్నారు.కచ్చితంగా పసుపు రైతుల ఉసురు తగిలిందన్నారు మంత్రి వేముల.
ఆత్మీయ సమ్మేళనంలో మహిళల ఆనందం
మంత్రి వేముల పాల్గొన్న మహిళా సమ్మేళనంలో మోర్తాడ్ మండలంలోని 10 గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. కొందరు మహిళలు మాట్లాడుతూ తమ గ్రామంలో జరిగిన అభివృద్ధి బాగుందని తమకు సంక్షేమ పథకాలు సంతోషాన్నిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో డా.మధు శేఖర్,రైతు నాయకులు కోటపాటి నర్సింహ నాయుడు, మోర్తాడ్ మండల పార్టీ శ్రేణులు,మండల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.