Suryaa.co.in

నటరాజు
Devotional

నటరాజు

పరమశివుని స్వరూపము అనేకరకములయిన మూర్తులుగా గోచరిస్తూ ఉంటుంది. పరమ శివునికి అరువది నాలుగు మూర్తులు ఉన్నాయి. శివుని స్వరూపమేమి అని అడిగితే శివలింగం అనే సమాధానం వస్తుంది.
సాధారణంగా శివాలయములలో లింగ స్వరూపమే ఉంటుంది.సాకారంగా పరమశివుడికి, పార్వతీదేవికి మూర్తి ఉన్నది. ఈ అరువది నాలుగులో ఒక భాగమును ‘ఘోర స్వరూపములు’ అంటారు. ఇవి శిక్షించడానికి వస్తాయి.రెండవది ‘అఘోరస్వరూపములు’ మంగళప్రదంగా ఉంటాయి. అటువంటి మూర్తిని చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది.
ప్రపంచంలో ఎన్ని రకములయిన విద్యలు ఉన్నాయో, ఎన్ని కళలు ఉన్నాయో అంతమంది కూడా తమ తమ కళలను ప్రదర్శన ప్రారంభం చేసే ముందు నమస్కరించవలసిన లోకంలోని మూర్తిని ఆనంద తాండవమూర్తి అంటారు. ‘నటరాజు’ అని పిలుస్తుంటాం. శైవాగమము దానిని ‘ఆనంద తాండవ మూర్తి’ అని పిలుస్తుంది.ఆ తాండవం చెయ్యడంలో గొప్ప రహస్యములు కొన్ని ఉంటాయి.
ఆనంద తాండవం చేసిన పరమశివుడు ఎవరు ఉన్నారో ఆయనలో నుంచే సమస్త శాస్త్రములు ఉద్భవించాయి.ఆయనలో నుంచే సమస్తమయిన కళలు వచ్చాయి.ఒక్క శంకరుడు చేసిన తాండవంలోంచి 650 రకములైన నాట్యములు పుట్టాయి.ఇప్పటికీ ఈ కర్మభూమిలో బ్రతికినవి 108 రకముల నాట్యములు.కూచిపూడి, ఒడిస్సీ, భరతనాట్యము ఇవన్నీ ఆనంద తాండవ మూర్తి అయిన శంకరుని దగ్గరనుంచే వచ్చాయి.
ఈ ఆనంద తాండవ మూర్తి చాలా గమ్మత్తుగా ఉంటుంది.ఈ చిత్రమును గీయడం లేదా నిలబెట్టడం చాలా కష్టం.చేతులు కట్టుకుని ఆయన నాట్యమును నలుగురు మాత్రమే చూస్తారు.అందులో ఒకడు నందీశ్వరుడు, రెండవ వాడు భృంగి, మూడవ వాడు పతంజలి, నాల్గవ వాడు వ్యాఘ్రపాదుడు.ప్రదోషవేళలో జరిగే ఈ తాండవం జరుగుతు ఉంటుంది. స్వరూపంలో సమస్త లయకారకమై ఉంటుంది.ఈ తాండవం ప్రదోషవేళలో జరుగుతూంటుంది.ఆయన నాట్యము చేత ఈ లోకమునకు రాజయ్యాడు. అందుకే ‘నటరాజు’ అని పిలుస్తుంటాము.
ఆయన చేసే నాట్యం మామూలు నాట్యం కాదు. అది తెలుసుకుంటే చిదంబరంలో కనకసభ దగ్గరకు వెళ్లి పెద్ద ఆనంద మూర్తిని చూడవచ్చు. అక్కడ ఆ మూర్తిని చూడగానే ప్రణిపాతం చేసి సాష్టాంగనమస్కారం చేస్తారు. అఘోర స్వరూపముల యందు చాలా గొప్ప స్వరూపములలో ఆనందమూర్తి స్వరూపం ఒకటి.
ఆనంద తాండవం చూసే స్థాయి పొందిన వాళ్ళలో మొదటి వాడు నందీశ్వరుడు.ఆయన అయ్యవారికి చాలా గొప్ప భక్తుడు. రెండవ వాడు భృంగి.మూడవవాడు పతంజలి. ఆదిశేషుని అవతారము.అందుకని ఆయన తల మనుష్యుడిగా ఉంటుంది.మిగిలిన శరీరం పాముగా ఉంటుంది.వ్యాఘ్రపాదుడికి తలకాయ మనుష్యుడిది ఉంటుంది. కింద పాదములు అవీ పెద్దపులివి ఉంటాయి. ఈ నలుగురు నిలబడి తాండవం చూస్తూంటారు.
ముప్పది మూడు కోట్లమంది దేవతలు అక్కడే ఉంటారు.బ్రహ్మ, శ్రీమహావిష్ణువు మద్దెల వాయిస్తూ ఉంటారు.పతంజలి తప్ప మిగిలిన దేవతలు ఎవరికి తోచిన వాద్య విశేషమును వారు వాయిస్తూంటారు. ఢమరుకం కదలిక చేత ఇన్ని రకములయిన సృష్టి ప్రారంభం అయింది. ఆయన చేతిలో ఉన్న ఢమరుకం కారణముగా ఈయన సృష్టికర్త అయ్యాడు. పరమేశ్వరుని సృష్టి కదలిక వలన కొత్తగా కొన్ని ప్రాణులు లోకంలోకి వచ్చాయి.ఈ లోకంలోకి కొత్తగా ప్రాణులు రావడము అనే సమస్త కదలికలకు ఢమరుక సంకేతం.ఇవన్నీ జరుగుతున్నాయి అనడానికి ఆయన కదలికే కారణము.
ఈశ్వరుని కదలికకు నర్తనమని పేరు. ఇదే ఆనంద తాండవము. ఆనంద తాండవ మూర్తి చేతిలో కుడివైపు ఢమరుకం ఉంటుంది.ఎడమచేతి వైపు అగ్నిహోత్రం ఉంటుంది. ప్రపంచంలోని అన్ని వస్తువులు చివరకు భస్మమే అయిపోతాయి.ఈ విషయం లోపల బాగా నాటినట్లయితే వ్యక్తి తప్పుడు పనులు చేయడు.ఏది కాలంలో వచ్చిందో అది కాలమునందు ఉండదు అని అర్థం అయితే నడవడి యందు మార్పు వచ్చేస్తుంది.నటరాజస్వామిని పరిశీలించినట్లయితే ఆయన కుడికాలి క్రింద ఒక రాక్షసుడు ఉన్నాడు.ఈయన కాలుకింద పడుకుని తల ఎత్తి నవ్వుతూ ఉంటాడు ఏడవడు.మాయను గెలవడమే కుడికాలి కింద రాక్షసుని తొక్కి పట్టడం.ఎడమ కాలు బ్రాహ్మీ స్థితిని సూచిస్తుంది.
కుడికాలు మాయను తొక్కితే పైకి లేచేది ఎడమకాలు.అందుకే ఆనంద తాండవ మూర్తి ఎడమకాలు పైకి లేచి ఉంటుంది.ఊర్ధ్వముఖ చలనము చేసి ఈశ్వరుడిని తెలుసుకునే ప్రయత్నం చేసి బ్రాహ్మీభూతుడవై ధ్యానము చేసి ధ్యానమునందు ఆనందమును పొంది ‘నేనుగా ఉండడం’ నీవు నేర్చుకో. ‘నీవు నేనై ఉన్నానని’ తెలుసుకో.దానికి ధ్యానం అవసరం. ఇది చెప్పడానికి ఎడమచెయ్యి పైకి లేచిన ఎడమ పాదమును చూపిస్తుంది.కుడి చేయి అభయముద్ర పట్టింది.
శివుడు చాలా తేలికయిన వాటిని పుచ్చుకుని పెద్ద శుభ ఫలితములను ఇస్తాడు.ఇది చెప్పడానికే ఆయన అభయముద్రను ప్రదర్శించాడు. పాపమును హరిస్తానని చెప్పాడు. హరించినప్పుడు ఉపాసకుడు క్రమంగా పెరుగుతాడు. పెరిగి ‘శివ’ – అంటే మంగళమును చేరతాడు.ఈ ‘శివ’ నుండి ఆనందతాండవమూర్తిలోనికి లయమయి ఆనందంగా మారిపోవాలి.అలా మారిపోతుంటే ఆయన దిగంబరుడుగా వచ్చాడు.అంటే శరీర భ్రాంతి లేకపోవడమును ఆనందం అంటారు.ఆత్మస్వరూపి అయిన ఆనందతాండవమూర్తియందు సాధకుడు కలిసిపోయి ఆనంద తాండవ మూర్తి అయిపోతాడు.ఆయనకి మరల చావడం అనేది ఉండదు.ఇదే ఆఖరి చావు.
శివుని విశేషములను వేటినీ సామాన్యముగా తీసుకొనుటకు ఉండదు.కేవలం ఒక నటరాజ స్వామి వారి మూర్తిని పెట్టుకుని అష్టోత్తరం, సహస్రం చేస్తాను అంటే ఈ తత్త్వము ఆవిష్కరింపబడదు.ఇలా చూడాలన్న కోరిక పుట్టడమే చాలా కష్టం.కోరిక పుట్టినా అది నిలబడడం చాలా కష్టం.ఎందుకు అంటే కింద కుడికాలిక్రింద నవ్వుతూ ఒకడు బ్రతికే ఉంటాడు.వాడు ఎప్పుడు లేచి పట్టేసుకుంటాడో తెలియదు.
ఎప్పుడయినా మాయ మళ్ళీ పట్టేస్తుంది.మళ్ళీ కూపంలోకి పడిపోతాడు.ఉదాహరణకు రావణాసురుడు శంకరుని ప్రార్థన చేశాడు.తనకు ఎటువంటి శంకరుని చూడాలని ఉన్నదో వివరిస్తూ స్తోత్రం చేశాడు “జటాటవీ గలజ్జల’ అని. ఇంత స్తోత్రం చేసిన రావణాసురుడు అలా నిలబడ లేకపోయాడు. పరమేశ్వరుని తనతో లంకకు రమ్మన్నాడు.ఏమయిపోయింది ఈ స్తోత్రం? అంతలో మాయ కమ్మింది.అడగడం కాదు. అడిగినవాడు నిలబడడం కూడా చాలా కష్టం.
నిలబడడానికి శివానుగ్రహం ఉండి తీరాలి.శివానుగ్రహం కలిగితే ఆయనే నడిపిస్తాడు. ఆనందతాండవమూర్తి అనుగ్రహం మనకు కలిగి మనుష్యజన్మ ప్రయోజనం నెరవేరేటట్లుగా నిర్హేతుక కృపాకటాక్షవీక్షణముల చేత ఈశ్వరానుగ్రహం ప్రసరింపబడాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థన చేయాలి.
సేకరణ : హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్

LEAVE A RESPONSE