– గుంటూరులో జరిగిన హర్ ఘర్ తిరంగా 3.O లో పెమ్మసాని
గుంటూరు: ‘ప్రతి ఇంట్లో మువ్వన్నెల జాతీయ జెండా రెపరెపలాడాలి. ప్రతి ఒక్కరూ దేశభక్తితో మెలగాలి’ అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవం లో భాగంగా హర్ ఘర్ తిరంగా 3.O కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆవిష్కరిస్తున్న క్రమంలో గుంటూరులోని స్థానిక కలెక్టరేట్ సబ్ పోస్ట్ ఆఫీస్ లో పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం ప్రారంభించారు.
ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని, ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి చేరేలా చూడాలని ప్రజలను ఈ సందర్భంగా పెమ్మసాని కోరారు. కార్యక్రమం అనంతరం పోస్ట్ ఆఫీస్ ప్రాంగణంలో అధికారులతో కలిసి పెమ్మసాని మొక్కలు నాటారు.
ఆ తర్వాత పోస్ట్ ఆఫీస్ అధికారులు మాట్లాడుతూ సంబంధిత అన్ని పోస్ట్ ఆఫీసుల్లో జాతీయ జెండాలను కొనుగోలు నిమిత్తం అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ ఏపీ సర్కిల్ జగదీష్ పై, చీఫ్ పోస్ట్ మాస్టర్ ఏపీ సర్కిల్ డి ఎస్ వి ఆర్ మూర్తి, గుంటూరు సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ యలమందయ్య తదితరులు పాల్గొన్నారు.