– తెలుగు రాష్ట్రాల్లో పత్తా లేని ‘జాతీయ ప్రాంతీయ పార్టీలు’
– పదవులకు మాత్రం ‘జాతీయం’
– తెలంగాణ, అండమాన్ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తున్న టీడీపీ
– ఇప్పటిదాకా కర్నాటక,తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయని టీడీపీ
– తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ గెలిచిన వైసీపీ
– గ్రేటర్ ఎన్నికలకు మాత్రం దూరం
– కర్నాటకలో పోటీకి బీఆర్ఎస్,వైసీపీ, టీడీపీ దూరం
– కర్నాటక, మహారాష్ట్ర, ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తామన్న బీఆర్ఎస్
– తెలంగాణ బీఆర్ఎస్కు అధ్యక్షుడిని ప్రకటించని వైనం
– మహారాష్ట్రంలో భారీ బహిరంగసభలు
– కర్నాటక ఎన్నికల్లో పోటీ చేయకుండా చేతులెత్తేసిన బీఆర్ఎస్
– జనతాదళ్‌కు మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలుగు రాష్ట్రాలను కేంద్రంగా చేసుకుని.. ఒక్కోసారి జాతీయ రాజకీయాల్లో చక్రం తిపుతున్న, ప్రాంతీయపార్టీల పరిస్థితి విచిత్రంగా మారింది. జాతీయ స్థాయిలో ఉనికి చాటుతూ, కేంద్ర రాజకీయాల్లో తమ వంతు పాత్ర పోషిస్తున్న ప్రాంతీయ పార్టీల ఆశలు, జాతీయ స్థాయిలో ఉన్నప్పటికీ.. అడుగులు మాత్రం ప్రాంతీయంగానే ఉండిపోతున్నాయి. జాతీయ పార్టీ పేరుతో హడావిడి చేస్తున్నప్పటికీ.. ఇప్పటివరకూ అవి పక్క రాష్ట్రాలకు పాకిన సందర్భాలు లేవు. ఇప్పుడు తెలుగుదేశం, బీఆర్ఎస్, వైసీపీలది అదే పరిస్థితి.
తెలంగాణలో వరసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. రెట్టించిన ఉత్సాహంతో జాతీయ రాజకీయాల్లో, అరంగేట్రం చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చింది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేసీఆర్ భేటీలు వేశారు. బీఆర్ఎస్ పేరు ప్రకటించే సందర్భంలో ఏర్పాటుచేసిన సభకు, పలు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీ నేతలను ఆహ్వానించారు. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ భవన నిర్మాణం కూడా శరవేగంగా పూర్తవుతోంది. వెంటనే ఏపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను నియమించింది.
మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు తన పార్టీ నేతలను పంపించింది. మహారాష్ట్రపై దృష్టి సారిస్తున్న బీఆర్ఎస్.. అందులో భాగంగా తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో, మహారాష్ట్ర జిల్లాలకు చెందిన పలు పార్టీల నాయకులను పార్టీలో చేర్చుకుంటోంది. జాతీయ పార్టీ పేరుతో ఇంత చేస్తున్న బీఆర్ఎస్… తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఇప్పటిదాకా అధ్యక్షుడిని ప్రకటించకపోవడమే ఆశ్చర్యం. జాతీయ పార్టీ స్థాపించి చాలాకాలమైనప్పటికీ.. తెలంగాణ కూడా ఒక రాష్ట్రమైనందున, ఆ రాష్ట్రానికి అధ్యక్షుడినంటూ ఎవరినీ నియమించకపోవడంపై, రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
జాతీయ పార్టీతో హడావిడి చేసి, ప్రధాని మోదీకి సైతం నేరుగా సవాల్ విసురుతున్న బీఆర్ఎస్.. తన పక్కనే ఉన్న కర్నాటకలో జరుగుతున్న ఎన్నికలకు మాత్రం, దూరంగా ఉండటంపై విస్మయం వ్యక్తమవుతోంది.
తొలుత కర్నాటకలోని జనతాదళ్‌తో పొత్తు పెట్టుకుని, తెలుగువారున్న నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ప్రచారం చేశారు. తీరా ఇప్పుడు పోటీకి దూరంగా ఉండి, కుమారస్వామిని సీఎం చేసేందుకు కృషి చేస్తామన్న ప్రకటనలు వినిపిస్తున్నాయి. దక్షిణాదిలోనే, పక్కనే ఉన్న కర్నాటకలో కూడా పోటీ చేయకుండా, కేసీఆర్ జాతీయ రాజకీయాలను ఏం శాసిస్తారన్న చర్చ జరుగుతోంది.
కాగా ఇటీవల ఎన్నికల కమిషన్ బీఆర్ఎస్ విషయంలో ఇచ్చిన ఆదేశాలు, ఆ పార్టీ ఆశలపై నీళ్లు చల్లాయి. ఆ పార్టీని తెలంగాణ వరకే పరిమితం చేయడం, ఆంధ్రా వైపు బ్రేకులు వేయడంతో బీఆర్ఎస్ ఆశలు ఆవిరయ్యాయి.
ఇక తెలుగుదేశం కూడా జాతీయ పార్టీగానే భావిస్తోంది. అయితే ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీ చేయకుండా, నిమిత్తమాత్రంగా పనిచేసింది. కానీ అండమాన్‌లో మాత్రం చాలాఏళ్ల నుంచి, టీడీపీ ఉనికి-ప్రభావం కొనసాగిస్తోంది. అక్కడ ఇటీవల మున్సిపాలిటీని టీడీపీ చేజిక్కించుకుంది. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడు, ఏపీ రాష్ట్రానికి అచ్చెన్నాయుడు-తెలంగాణకు కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా జాతీయ పార్టీకి ప్రత్యేకంగా కమిటీలు కూడా వేశారు.
కానీ జాతీయ పార్టీగా చెప్పుకునే అదే టీడీపీ.. పక్కనే ఉన్న కర్నాటకలో మాత్రం పోటీ చేయకపోవడం ఆశ్చర్యం. గతంలో ఓ సందర్భంలో.. కర్నాటక, తమిళనాడు ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని, పార్టీ నాయకత్వం ప్రకటించింది. కానీ ఇప్పటివరకూ అది కార్యాచరణలో కనిపించలేదు.
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ కూడా, జాతీయ పార్టీగానే చెలామణి అవుతోంది. ఆ మేరకు టీడీపీ మాదిరిగానే, వైసీపీ కూడా జాతీయ స్థాయి పదవులు ప్రకటించింది. ఎంపి విజయసాయిరెడ్డి వైసీపీ జాతీయ ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్నారు. వైసీపీ గతంలో తెలంగాణలో కూడా పోటీ చేసి, ఎంపి-ఎమ్మెల్యేలను గెలిచింది. వారంతా టీఆర్ఎస్లోకి ఫిరాయించినప్పటికీ, వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకత్వం స్పీకర్‌కు ఫిర్యాదు చేయలేదు. అలాంటి వైసీపీ.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయలేదు.
కానీ.. గత ఏడాది కర్నాటకలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నేతలు బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. అయితే వైసీపీ జాతీయ పార్టీగా మిగిలిన వారి మాదిరిగా హడావిడి చేయనప్పటికీ.. జాతీయ స్థాయిలో లాబీయింగ్ మాత్రం ఆ స్థాయిలో చేయడం విశేషం. ఈవిధంగా జాతీయ స్థాయిలో హడివిడి చేసే ప్రాంతీయ పార్టీలు తీరు మాత్రం లోకల్‌గానే పనిచేస్తుండటం ఆశ్చర్యం.