Suryaa.co.in

Andhra Pradesh

మహిళా సంక్షేమ పథకాలపై జాతీయ మహిళా కమిషన్‌ ఆసక్తి

– విశాఖలో విజయవంతంగా ముగిసిన మహిళా కమిషన్ల జాతీయ స్థాయి సమావేశాలు

మహిళల సంక్షేమం, భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలు.. అమలుతీరుపై జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖాశర్మ ఆసక్తి కనబరిచారు. జాతీయ మహిళా కమిషన్, ఏపీ మహిళా కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి సమావేశాలు వైజాగ్ లో విజయవంతంగా ముగిశాయి. ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆధ్యక్షతన రెండు రోజులపాటు కొనసాగిన సమావేశాలకు దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల నుంచి మహిళా కమిషన్ చైర్ పర్సన్లు, కమిషన్ సభ్యులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తన ప్రసంగంతో సమావేశాన్ని ప్రారంభించి.. ఇక్కడ అమలవుతున్న మహిళా సంక్షేమ పథకాలు, భద్రత, రక్షణ, మహిళా సాధికారత దశలను వివరించారు. ప్రధానంగా ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు లక్షలాది ఇళ్లపట్టాల పంపిణీ, రేషన్ కార్డులు, పెన్షన్ల పెంపు, అమ్మ వడి, చేయూత, చేదోడు, విద్యాదీవెన, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌.. ఇలా అనేక సంక్షేమ పథకాలతో మహిళా లబ్ధిదారులు ఆదాయం పెంచుకోవడంలో ఒక మెట్టు ఎదిగినట్టు వాసిరెడ్డి పద్మ రాష్ర్ట కమిషన్ నివేదికను రేఖాశర్మ దృష్టికి తెచ్చారు.

అదేవిధంగా పటిష్టమైన రక్షణ వ్యవస్థగా ‘దిశ’ యాప్ పనిచేస్తుందని… లక్షలాదిగా యాప్ డౌన్లోడ్ చేయడంతో మహిళలు, బాలికల భద్రతకు ప్రభుత్వం ఒక భరోసానివ్వడం ఉత్తమమైన పరిపాలనా సంస్కరణగా వాసిరెడ్డి పద్మ వివరించగా… అన్ని రాష్ట్రాల ప్రతినిధులు ఆసక్తిగా రాసుకున్నారు. ఏపీ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాలలో జరగని కార్యక్రమాలు ఇక్కడ చురుకుగా నిర్వహించేందుకు ప్రభుత్వ కృషి ఉందని వాసిరెడ్డి పద్మ చెప్పారు.

కోవిడ్ పరిస్థితులలో మహిళలను ఆదుకునేందుకు కమిషన్ చేపట్టిన కార్యక్రమాలను… పనిప్రాంతాల్లో ఫిర్యాదులు కమిటీల ఏర్పాటు, లైగింపుల వేధింపుల నివారణకు ‘సబల’ సదస్సులు, ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకంగా ఒక వాట్సప్ నెంబర్ విడుదల చేసిన సంగతిని ప్రస్తావించారు. ఏపీలో అన్ని వివాహ రిజిస్ట్రేషన్లను తప్పనిసరి చేయడం ద్వారా ఎన్నారై (ప్రవాస భారతీయ) భర్తల మోసాలకు చెక్‌ పెట్టవచ్చునని చెప్పారు. ఎన్నారై వివాహ మోసాలకు సంబంధించి దేశవ్యాప్తంగా 5,858 కేసులు తమ వద్ద పెండింగ్‌లో ఉన్నట్టు వివరించారు.

పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని రేఖాశర్మ ఆందోళన వ్యక్తంచేశారు. విదేశీ సంబంధాల విషయంలో పూర్తి వివరాలు ముందుగానే తెలుసుకునేలా యువతులను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతో మూడు నెలలకోమారు వివిధ రాష్ట్రాల్లో జాతీయ మహిళా కమిషన్ నేతృత్వంలో చైర్ పర్సన్ లు, సభ్యుల ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తామని రేఖాశర్మ వెల్లడించారు.

రెండు రోజుల సమావేశాల అనంతరం ఆయా రాష్ట్రాల చైర్ పర్సన్ లు, సభ్యులు వైజాగ్ ప్రాంతంలో సమీప పర్యాటక, ఆధ్యాత్మిక స్థలాలను సందర్శించి చరిత్ర విషయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చేతులమీదుగా అక్కడకు విచ్చేసిన ప్రతీ ఒక్కరిని సంప్రదాయ లాంఛనాలతో కమిషన్ తరఫున ఘనంగా సత్కరించారు. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, త్రిపుర, ఒరిస్సా, నాగాలాండ్, ఉత్తర ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల మహిళా కమిషన్ ల చైర్ పర్సన్ లు, సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE