Suryaa.co.in

Telangana

ఓయూలో జాతీయ సెమినార్

-పాల్గొన్న ప్రశాంత్ భూషణ్, సిహెచ్ హనుమంతరావు, బోయినపల్లి వినోద్ కుమార్, ఆనందకుమార్

ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలోని ప్రొఫెసర్ జి రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆడిటోరియంలో ” సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ డెమోక్రసీ ” అనే అంశంపై శనివారం జాతీయస్థాయి సెమినార్ జరిగింది.

ఈ జాతీయ సెమినార్లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, ప్రముఖ ఆర్థికవేత్త సిహెచ్ హనుమంతరావు , న్యూఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్, సెంట్రల్ యూనివర్సిటీల టీచర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఆనంద్ కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని అన్నారు. దేశంలో అత్యున్నత వ్యవస్థలైన ఈ డి, సి బి ఐ, ఎలక్షన్ కమిషన్, జ్యూడిషియల్ , మీడియా స్వయం ప్రతిపత్తిని కోల్పోతున్నాయని ప్రశాంత్ భూషణ్ అన్నారు. పాలకులు ఒంటెద్దు పోకడలతో స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంటున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందని ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ప్రజలు మరింత చైతన్యవంతులై ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
కండ్లు పెట్టి చూడాలని, చెవులు పెట్టి వినాలని, గొంతెత్తి మాట్లాడాలని, సదస్సులు నిర్వహించి ప్రజలను కదిలించాలని సామాజికవేత్తలను ప్రశాంత్ భూషన్ కోరారు.

ఉద్యోగాలను సాధించడం నిరుద్యోగుల హక్కు అని, ఉద్యోగాలు ఇప్పించడం, ఉపాధి కల్పించడం ప్రభుత్వాల బాధ్యతని ప్రశాంత్ భూషణ్ అన్నారు. ఈ బాధ్యతల నుంచి ప్రభుత్వాలు తప్పించుకుంటున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన అత్యంత ప్రమాదకరంగా మారిందని ప్రశాంత్ భూషణ్ అన్నారు. మోడీ తన పాలనను ప్రజాస్వామ్యానికి భిన్నంగా సాగిస్తున్నారని అన్నారు. గౌతం అదానినీ ప్రధాని మోడీ పెంచి పోషిస్తున్నారని ఆయన అన్నారు. బ్యాంకులో నుంచి రెండున్నర లక్షల కోట్ల రూపాయల రుణాలను అదాని తీసుకున్నారని, ఒకవేళ అధాని వ్యాపారాలు దెబ్బతింటే దేశ ఆర్థిక పరిస్థితి చిన్నా భిన్నం అవుతుందని ప్రశాంత్ భూషణ్ ఆందోళన వ్యక్తం చేశారు.

రాజకీయ పార్టీలకు అందే విరాలాల్లో.. 70% శాతం విరాళాలు ఒక్క బీజేపీకే దక్కుతున్నాయని, మిగతా 30% విరాళాలు మిగిలిన 20 రాజకీయ పార్టీలకు వెళ్తున్నాయని ప్రశాంత్ భూషణ్ వివరించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ప్రజల ఉపాధి అవకాశాలను ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తుందని అన్నారు. ప్రజలు చైతన్యవంతులై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని అందుకు ప్రజలు సమాయత్తం కావాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE