Suryaa.co.in

Andhra Pradesh

జీవీఎల్ చొరవతో కుల సంఘాలతో ఢిల్లీలో ఎన్సీబీసీ బహిరంగ విచారణ

-జీవీఎల్ చొరవతో సాకారం కానున్న తూర్పుకాపులు, కళింగ వైశ్యులు, శిష్టకరణాలు, సోంధీల కేంద్ర ఓబీసీ రిజర్వేషన్లు
– జీవీఎల్ నరసింహారావు తీవ్ర యత్నంతో ఎన్సీబీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో మహారాష్ట్ర సదన్ లో ఆయా సామాజికవర్గ ప్రతినిధులతో పబ్లిక్ హియరింగ్.
– త్వరలో పై నాలుగు కులాలను కేంద్ర OBC జాబితాలో చేర్చమని కేంద్రానికి సిఫారసు చేయనున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన NCBC
– తెలంగాణలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన 26 కులాల రిజర్వేషన్లను తొలగించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్య బట్టిన జీవీఎల్

ఈరోజు తూర్పు కాపులు, కళింగ వైశ్యులు, శిష్టకరణాలు, సోంధీలకు కేంద్ర ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేసిన తీవ్ర ప్రయత్నాలతో ఎన్సీబీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో మహారాష్ట్ర సదన్లో ఆయా సామాజిక వర్గ ప్రతినిధులతో పబ్లిక్ హియరింగ్ జరిగింది.

దాదాపు మూడు గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగగా నాలుగు బిసి కులాలకు చెందిన 150 మందికి పైగా నాలుగు సామాజిక వర్గ నాయకుల బృందానికి నాయకత్వం వహించిన బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఎన్సీబీసీ బహిరంగ విచారణలో ఆయా కులాల సామాజిక- ఆర్థిక మరియు విద్యా పరమైన వెనుకబాటుతనం గురించి వివరణాత్మక ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది.

తూర్పు కాపుల గురించి జీవీఎల్..
ఇప్పటికే ఓబీసీల కేంద్ర జాబితాలో చేర్చిన తూర్పు కాపులకు మూడు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి మాత్రమే ఈ ప్రయోజనం ఉందని, రాష్ట్ర బీసీల జాబితాలో రిజర్వేషన్ ప్రయోజనాన్ని తూర్పు కాపులకు 2008లోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వర్తింపజేయబదిందనేదనీ ఎంపీ జీవీఎల్ ఎన్సీబీసీకి తెలిపారు.
గత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేయకపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్ అంతటా నివసిస్తున్న తూర్పు కాపులకు కేంద్ర ఓబీసీ రిజర్వేషన్లు చాలా ఏళ్ల క్రితమే లభ్యమయ్యేవి అనీ జీవీఎల్ తెలిపారు.

కళింగ వైశ్యుల గురించి జీవీఎల్..
కళింగ వైశ్య కులానికి 2014లో బీసీ హోదా ఇచ్చినా ఇక్కడ కూడా ఓబీసీల కేంద్ర జాబితాలో చేర్చాలని ఎన్సీబీసీకి, కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి విజ్ఞప్తులు చేయలేదు అని జీవీఎల్ తెలిపారు.

శిష్ట కరణాలు,సోండి కులాల గురించి ఎన్సిబిసి కి జీవీఎల్ వివరణ..
2009లో దలవ సుబ్రమణ్యం కమిషన్ సిఫారసుల మేరకు శిష్ట కరణాలు, సోండి కులాలకు రాష్ట్ర బీసీ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం జరిగినప్పటికీ ఇటీవల తాను ఈ అంశాన్ని ఎన్సీబీసీ, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లే వరకు వారిని ఓబీసీల కేంద్ర జాబితాలో చేర్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేదని జివిఎల్ అన్నారు.

ఈ సుదీర్ఘ జాప్యం వల్ల ఈ కులాలకు చెందిన లక్షలాది మంది యువత తమ అభ్యున్నతి, సంక్షేమం కోసం కేంద్రం ఇచ్చే రిజర్వేషన్ ప్రయోజనాలను కోల్పోయారనే వాస్తవాన్ని జీవీఎల్ ఎత్తిచూపారు.

నేటి ఎన్సీబీసీ సమావేశంలో పై మూడు కులాలను త్వరలో ఓబీసీల్లో చేర్చనున్నట్లు ఎన్సిబిసి స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని అందువలన ఈ కులాలకు సామాజిక న్యాయం లభించనుందనిఎంపీ జీవీఎల్ నరసింహారావు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

తెలంగాణలో ఉత్తరాంధ్ర బీసీ కులాల రిజర్వేషన్ ప్రయోజనాలను నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధం అనీ ,2014లో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర బీసీ జాబితా నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన 26 కులాలను తొలగించినందుకు ఎన్సీబీసీ సమావేశంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ లో ఈ కులాలకు చెందిన 10 లక్షల మందికి పైగా నివసిస్తున్నారని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర బీసీ కులాలను తెలంగాణ రాష్ట్ర జాబితా నుంచి తొలగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన తరగతులను ప్రభావితం చేసే అన్ని ప్రధాన విధానపరమైన విషయాల్లో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఎన్సీబీసీ సంప్రదించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 328 (బి)ను స్పష్టంగా ఉల్లంఘించడమేనని ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు.

26 ఉత్తరాంధ్ర బీసీ కులాల రాజ్యాంగ హక్కులను పరిరక్షించడంలో, వాటిని తెలంగాణ రాష్ట్ర బీసీ జాబితాలో పునరుద్ధరించడంలో ఎన్సీబీసీ జోక్యం చేసుకోవాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు. రాష్ట్ర విభజన వల్ల కొన్ని కులాలు ఎందుకు నష్టపోతాయని, ఎందుకు నష్టపోవాలనీ ఎంపీ జీవీఎల్ ప్రశ్నించారు.

ఎన్సీబీసీ సమావేశానికి ముందు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వివిధ వెనుకబడిన కులాలకు చెందిన నాయకులు తమకు సామాజిక న్యాయం కోసం అలుపెరగని కృషి చేస్తున్న ఎంపీ జీవీఎల్ నరసింహారావును తమ వాణిని ఎన్సీబీసీ ముందు గట్టిగా వినిపిస్తున్నందుకు జీవీఎల్ ను ఘనంగా సన్మానించారు.

LEAVE A RESPONSE