-
టీటీడీ నెయ్యి కల్తీపై ఎన్డీడీబీ రిపోర్టు చెప్పింది ఇదే
-
కేవలం అనుమానాలు, ఊహాజనితమంటూ సరిపెట్టిన వైనం
-
అది కూడా ఐఎస్ఓ స్టాండర్డ్స్‌ను మాత్రమే ఉటంకించిన వైచిత్రి
-
నివేదిక మొత్తం ఐఎస్ఓ స్టాండర్డ్స్ చుట్టూనే
-
తన సొంత అభిప్రాయం చెప్పని ఎన్డీడీబీ
-
సీఎం, టీటీడీ ఈఓ ఆరోపణలు నిర్థారించని ఎన్డీడీబీ నివేదిక
-
కొన్ని అంశాలనే ప్రస్తావించిన ఎన్డీడీబీ
-
అనెగ్జర్ 1లో ఇచ్చిన అంశాలను రిపోర్టులో ప్రస్తావించని వైనం
-
ఏఆర్ డెయిరీ నెయ్యిపై అటు ఇటు కాకుండా నివేదిక ఇచ్చిన ఎన్డీబీ
-
సీఎం చంద్రబాబును ఈఓ తప్పు దోవపట్టించారా?
-
ఎలాంటి నిర్ధారణ లేకుండానే సీఎంకు సమాచారం ఇచ్చారా?
-
ఈఓ సమాచారం మేరకే బాబు నెయ్యిలో జంతుకళేబరాలున్నాయని చెప్పారా?
-
కెఎంఎఫ్ శాంపిల్స్‌ను ఎన్డిడిబీకి ఎందుకు పంపించలేదు?
-
2007లోనే కెఎంఎఫ్ శాంపిల్స్‌లో కల్తీ నీటిని తేల్చిన టీటీడీ బోర్డు
-
మరి ఏ ఆర్ డెయిరీ నెయ్యి లడ్లలో వాడారా? లేదా అని నిర్ధారించేదెవరు?
-
మళ్లీ మొదటికొచ్చిన టీటీడీ నెయ్యి కల్తీ కథ
-
అందరి చూపూ.. ‘సిట్’ వైపే
( మార్తి సుబ్రహ్మణ్యం)
ప్రపంచం లోని కోట్లాది హిందువుల దైవమయిన తిరుమల వెంకన్న కొంండపై తయారయిన లడ్డులో కల్తీ నెయ్యి ఉందంటూ వచ్చిన ఆరోపణల్లో నిజం లేదా? అందులో పందికొవ్వు గానీ, జంతువుల కళేబరం గానీ కలపలేదా? ఈ వ్యవహారంలో సీఎం చంద్రబాబునాయుడును అధికారులు తప్పుదోవపట్టించారా? టీటీడీ అధికారులను నమ్మిన బాబును అధికారులు మోసం చేశారా? కల్తీ నెయ్యిపై ఎలాంటి తుది నిర్థారణకు రాకుండానే టీటీడీ ఈఓ సీఎంకు సమాచారం ఇచ్చారా? పందికొవ్వు కలిసిందంటూ మీడియాకు చెప్పారా?.. తాజాగా ‘‘ఎన్డిబిబి కాల్ఫ్’’ ఇచ్చిన నివేదిక దానినే స్పష్టం చేస్తోంది.
టీటీడీకి ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీపై నివేదిక ఇవ్వాలంటూ టీటీడీ ఇచ్చిన శాంపిల్స్‌ను పరీక్షించిన ఎన్డీడీబీ.. అందులో ఈఓ శ్యామలరావు చెప్పినట్లు పంది కొవ్వు గానీ, సీఎం చంద్రబాబు ఆరోపించినట్లు జంతుకళేబారాలు కూడా ఉన్నట్లు
తేల్చకపోవడం ఆశ్చర్యం. ‘కలిసే అవకాశం ఉండవచ్చ’ంటూ.. ఐఎస్ఓ స్టాండర్డ్స్ భుజంపై తుపాకీ పెట్టి, ఎన్డీడీబీ కేవలం అనుమానాలు, సందేహాలతోనే తన రిపోర్టు ఇచ్చింది.
నిజంగా నెయ్యిలో పంది కొవ్వుగానీ, జంతు కళేబరాలుగానీ కలిపి ఉంటే, ప్రతిష్టాత్మక ఎన్డీడీబీ దాన్ని స్పష్టంగా పేర్కొని ఉండేది. అంతేగానీ ఏదో మొహమాటంగా .. కలసి అవకాశం ఉండవచ్చు.. కలిసేందుకు అవకాశాలు లేకపోలేదు.. ఐఎస్ఓ స్టాండర్డ్స్ ప్రకారం ఇవి ఉంటే అలా కల్తీ జరిగే అవకాశం లేకపోలేదు.. అని అటు ఇటు కాకుండా నివేదిక ఇవ్వడమే వింత. దీన్ని బట్టి.. టీటీడీ అధికారులు, అత్యుత్సాహంతోనే సీఎంకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.
ఇప్పుడు ఎన్డిడిబీ కాల్ఫ్ ఇచ్చిన నివేదిక, వాటి వివరాలు పరిశీలిస్తే.. ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలో పందికొవ్వు గానీ, జంతువుల కళేబరాలు గానీ ఉన్నట్లు స్పష్టంగా పేర్కొనకపోవడం విశేషం. అంటే దీన్నిబట్టి టీటీడీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి సీఎం చంద్రబాబునాయుడును తప్పుదోవ పట్టించారా? అన్నదే ఇప్పుడు చర్చ.
ఏఆర్ డెయిరీ టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో పంది కొవ్వు కలిపారని టీటీడీ ఈఓ శ్యామలరావు చేసిన ఆరోపణ, ప్రపంచంలోకి కోట్లాదిమంది హిందువుల మనోభావాలు గాయపరిచింది. దానిని ఎన్డిడిబీ పరీక్షకు పంపామని, అక్కడి నుంచి నివేదిక రావలసి ఉందని శ్యామలరావు మీడియాకు వెల్లడించారు.
అయితే ఆ సమయంలో ఆయన మీడియాకు ప్రశ్నలు వేసే అవకాశం ఇవ్వకపోగా… అంత ప్రాధాన్యతాపరమైన అంశం గురించి, తిరుమల కొండపై ఉన్న మీడియా ప్రతినిధులు కూడా ప్రశ్నలు వేయకపోవడం ఆశ్చర్యం. సరే ఎవరి స్థాయి వారిది! పైగా టీటీడీ అధికారులను ఎదురు ప్రశ్నలు వేసే సంప్రదాయం ఇంకా కొండపై మొదలుకాలేదు. మొహమాటానికి కారణం ‘మామూలే’!
ఇదే అంశంపై అంతకుముందు సీఎం చంద్రబాబునాయుడు సైతం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి లడ్లు తయారుచేసిన నెయ్యిలో జంతుకళేబరాలు కలిపారంటూ చేసిన వ్యాఖ్యలు, హిందూ సమాజాన్ని ఉలిక్కిపడేలా చే శాయి. ఆ తర్వాత కల్తీ నెయ్యి వ్యవహారంపై హిందూ సమాజం భగ్గుమంది. దోషులను శిక్షించాలని మాజీ సీఎం జగన్, మాజీ ఈఓ ధర్మారెడ్డి దిష్టిబొమ్మలను ప్రపంచవ్యాప్తంగా తగులబెట్టింది. ఆలయంలో జరిగిన ఈ అపచారానికి పరిహారంగా ఆలయాన్ని శుద్ధి చేసింది. తర్వాత కల్తీ నెయ్యిపై నిగ్గుతేల్చేందుకు కూటమి సర్కారు సిట్ వేసింది. ప్రస్తుతం సిట్ విచారణ జరుగుతోంది. ఇదీ టీటీడీకి ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యి కల్తీ కథ.
జగన్ జమానాలో ఏఆర్ డెయిరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేసేది. అయితే అందులో జంతు కళేబరాలు కలిశాయని, దానితోనే లడ్డు తయారుచేయడం తనను కలచివేసిందని, భక్తుల మనోభావాలతో ఆడుకోవడం బాధాకరమని స్వయంగా సీఎం చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్య, హిందూ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆ తర్వాత దానిపై దేశవ్యాప్తంగా చర్చ, మీడియాలో డి బేట్లు మొదలయ్యాయి. జాతీయ చానెళ్లు, జాతీయ పత్రికలు ఆగమేఘాలపై తమ ప్రతినిధులను తిరుపతికి పంపించాయి. దానితో కల్తీ నెయ్యిపై చర్చకు తిరుపతి కేంద్రబిందువయింది.
అప్పటి టీటీడీ బోర్డు మాజీ సభ్యులు భానుప్రకాష్‌రెడ్డి, డాక్టర్ ఓవి రమణను జాతీయ మీడియా ఇంటర్వ్యూలతో ఉక్కిరిబిక్కిరి చేశాయి. అసలు వారం రోజులపాటు జాతీయ మీడియా అక్కడే తిష్ఠ వేసింది. సరే వారిలో భానుప్రకాష్‌రెడ్డి బీజేపీ, ఓవి రమణ టీడీపీ నేతలు కాబట్టి.. సహజంగా కూటమికి కాపు కాసి, నాటి జగన్ సర్కారుపై నిప్పులు చెరిగారు. అది వేరే విషయం.
జగన్- భూమన కరుణాకర్‌రెడ్డి-ధర్మారెడ్డి అవినీతితోనే, కల్తీ నెయ్యిని లడ్లలో వాడారంటూ టీడీపీ-జనసేన-బీజేపీ నేతలు ఆరోపణాస్త్రాలు సంధించారు. హిందువుల మనోభావాలతో జగన్ చెలగాటమాడారని మండిపడ్డారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన ఈ వ్యవహారంపై స్పందించిన సీజే బెంచ్.. కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ వేయాలని ఆదేశించారు. అందులో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతోపాటు, ఎఫ్ఎస్ఎస్ఏఐని కూడా సిట్‌లో చేర్చింది.
అయితే ఎఫ్ఎస్ఎస్ఏఐ సిట్‌లో ఆలస్యంగా చేరింది. ఈ వ్యవహారంలో తాము చేయగలింది ఏమీ లేదని, మెటీరియల్‌ను పరీక్షిస్తామే తప్ప, తమది విచారణ సంస్థ కాదని ఆ సంస్థ స్పష్టం చేసింది. అయినా చివరలో ఆ సంస్థ సిట్‌లో చేరిందనుకోండి. ఆ మేరకు 30 మంది సిబ్బందితో, తిరుపతి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ కేంద్రంగా సిట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
ఈ నేపథ్యంలో టీటీడీ ఎన్డీడీబీకి చేసిన దరఖాస్తుకు స్పందించిన ‘ఎన్డీ డీబీ-కాల్ఫ్’ టీటీడీకి తన నివేదిక ఇచ్చింది. ఎన్డీడీబీ నివేదిక ప్రకారం.. ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలో పందికొవ్వు గానీ, జంతుకళేబరాలు గానీ కలవలేదని స్పష్టంగా తేల్చలేకపోయింది.
‘‘ వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ ల్యాబరేటరీ ల్యాబ్ రిఫరెన్స్ నెంబర్ ఏబీఓ 23654, మార్కెటింగ్ గోడౌన్ తిరుమల, తిరుపతి, ఆంధ్రప్రదేశ్ . తేదీ 23-07-2024 అభ్యర్ధన మేరకు తాము పరీక్షించిన నెయ్యిలో, ఐఎస్ఓ 17678: 2019, బిఐఎస్ 16326:2015 స్టాండర్స్ ప్రకారం.. సోయాబీన్, సన్‌ఫ్లవర్, ఆలివ్, గోధుమపొట్టు, కాటన్‌సీడ్, కొబ్బరి, ఫిష్ ఆయిల్, పామాలిన్, బీఫ్ కొవ్వు ఉంటే దానిలో కల్తీ జరిగినట్లు అనుమానించాల్సి ఉంటుంద’’ంటూ.. ఐఎస్ఓ జన్ల్ స్టాండర్డ్సును మాత్రమే ఎన్డీడీబీ తన నివేదికలో పేర్కొంది. అంతే తప్ప, ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలో పందికొవ్వు గానీ, జంతుకళేబరాలు గానీ కలిసిందని నివేదిక లో పేర్కొనకపోవడం విశేషం.
అయితే అనెగ్జర్-1లో ఇచ్చిన టేబుళ్లలో.. స్టాండర్డ్ వేల్యూ ఎంత ఉండాలి? ఆ నెయ్యిలో ఎంత ఉంది అని వాటి వివరాలు పేర్కొన్న నివేదిక.. అవి వేటికి సంబంధించినదన్న విషయాన్ని పేర్కొనలేదు. ఏఆర్ డెయిరీ నెయ్యిని 114 రకాల టెస్టులు చేసిన ఎన్డీడీబీ.. ఆ కొవ్వు జంతువుదా? రక్తానిదా? నెయ్యి నుంచి వస్తుందా అన్నది మాత్రం తేల్చలేదు. పైగా వాటిని ఇంటర్పిటేషన్( ఊహాజనితం)గా పేర్కొనడం విశేషం.
అంతే తప్ప.. ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలో పంది కొవ్వు, జంతుకళేబరాలు కలిపారన్నది ఎక్కడా నివేదిక ఇవ్వకపోవడమే ఆశ్చర్యం. అసలు ఎన్డీబీబీ నివేదిక ఆసాంతం.. ఐఎస్ఓ స్టాండర్డ్స్ ప్రకారం, ‘‘ఈ పదార్ధాలు కలిస్తే కల్తీ జరగవచ్చని’’ చెప్పిందే తప్ప, తన సొంత అభిప్రాయం ఎక్కడా పేర్కొనకపోవడమే ఆశ్చర్యం.
కాగా ప్రస్తుతం టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న కెఎంఎఫ్ (కర్నాటక మిల్స్ ఫెడరేషన్) నెయ్యి శాంపిల్స్‌ను మాత్రం, ఎన్డీడీబీకి పరీక్ష కోసం ఇప్పటికీ పంపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో, టిన్నుల ద్వారా నెయ్యి సరఫరా చేసిన కెఎంఎఫ్ సరఫరా చేసిన ఆరు నెయ్యి టిన్నులలో, నీటిశాతం ఎక్కువగా ఉందని బోర్డు గుర్తించింది.
దానితో ఆ సంస్థను బోర్డు వివరణ కోరిన సందర్భంలో.. తాము నీళ్లు కలపలేదని, మీ దగ్గరే కలిపి ఉండవచ్చని కెఎంఎఫ్ వాదించింది. దానితో నిజం నిగ్గుతేల్చేందుకు రంగంలోకి దిగిన బోర్డు.. కొండపైన ఉన్న నీటితోపాటు, కెఎంఎఫ్ యూనిట్ నీటిని మైసూర్‌లోని సెంట్రల్ ఫర్ టెస్టింగ్ రీసెర్చ్ సెంటర్(సీఎఫ్టిఆర్)కు పరీక్ష కోసం పంపించింది.
అక్కడ ఆ నీళ్లు కెఎంఎఫ్‌కు చెందినవేనని సీఎఫ్టిఆర్ తేల్చింది. నెయ్యిలో నీళ్లు కలపడాన్ని సీరియస్‌గా తీసుకున్న నాటి బోర్డు.. కెఎంఎఫ్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పెనాల్టీ కడతారా? బ్లాక్‌లిస్టులో పెట్టాలా? అని నోటీసులిచ్చింది. దానితో పెనాల్టీగా ఆ కంపెనీకి ఇవ్వాల్సిన బిల్లును నిలిపివేసింది. ఈ క్రమంలో ఏఆర్ డెయిరీ అనుభవాల దృష్ట్యా.. ఇప్పుడు కూడా కెఎంఎఫ్ సంస్ధనే టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నందున, ఆ కంపెనీ సరఫరా చేస్తున్న నెయ్యిని ఎన్డీడీబీకి పరీక్ష నిమిత్తం పంపించాలి కదా అన్న సందేహం.. ఇప్పటి ఈఓకు గానీ, పాలకవర్గానికి గానీ రాకపోవడమే ఆశ్చర్యం.
ఈ మొత్తం వ్యవహారం పరిశీలిస్తే.. టీటీడీ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును తప్పదోవపట్టించి, ఆయనకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఒకరకంగా ఇది విపక్షానికి ఆయుధం అందించినట్లుగానే కనిపిస్తోంది. అసలు ఎన్డీడీబీ పూర్తి స్థాయి నివేదిక రాకుండానే.. పందికొవ్వు ఉందని బాధ్యతారాహిత్యంగా చెప్పిన టీటీడీ ఈఓ ప్రకటనలో నిజం ఉందని, అటు ఎన్డీడీబీ నివేదిక కూడా ధృవీకరించకపోవడం ప్రస్తావనార్హం.
ఈ క్రమంలో కల్తీ నెయ్యిపై విచారిస్తున్న సిట్ ముందు అనేక ప్రశ్నలు నిలిచి ఉన్నాయి. అసలు ఏఆర్ డైరీ పంపించిన నెయ్యిని కొండ కిందనే నిలిపివేసిన నేపథ్యంలో, తర్వాత దానిని పైకి పంపించారా? లేదా? ఒకవేళ కొండ పైకి పంపించి ఉంటే దానిని లడ్లలో వినియోగించారా? లేదా? ఒకవేళ వినియోగించి ఉంటే, వాటిని ఎన్నిరోజులు భక్తులకు పంపిణీ చేశారు? అయోధ్యకు పంపిన ఆ లక్ష లడ్లు కూడా అందులో ఉన్నాయా అని తేల్చాల్సి ఉంది.
దానికంటే ముందు.. ఎన్డీడీబీ నివేదికను టీటీడీ పాలకవర్గం ఇప్పటిదాకా ఎందుకు బయటపెట్టలేదన్నది ప్రశ్న. ఎందుకంటే ఈ నివేదిక కోసం, ప్రపంచంలోని కోట్లాదిమంది హిందువులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కనీసం వారి సందేహాలు నివృతి చేసేందుకైనా టీటీడీ ఎన్డీడీబీ నివేదికను బయటపెట్టాల్సి ఉంది.
ఆ నివేదికలో నిజాలు తేల్చాల్సింది విచారణ సంస్థలేనా?
మరోవైపు ఇలాంటి పరీక్షల్లో పూర్తి నివేదిక ఇవ్వరని, దానిని దర్యాప్తు సంస్థలే తేల్చాలని నిపుణులు చెబుతున్నారు. ‘మీరు సుగర్ టెస్టుకు వెళ్లారనుకోండి. ల్యాబ్ మీ రక్తంలో సుగర్ శాతం ఎంతో చెబుతుంది. అంటే ఇంత ఉంటే మీకు సుగర్ ఉన్నట్లు. లేకపోతే లేనట్లు లెక్క. ఆ విషయం చెప్పాల్సింది డాక్టర్. అంటే ఇందులో కూడా కల్తీ సంగతి తేల్చాల్సింది దర్యాప్తు సంస్ధమాత్రమే’నని ఓ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యాఖ్యానించారు. ఆ ప్రకారంగా వాటిని సిట్ తేల్చాల్సి ఉంది.
జవహర్‌రెడ్డి.. ధర్మారెడ్డి.. సుబ్బారెడ్డి.. భూమనను సిట్ విచారిస్తుందా?
కల్తీ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్న సిట్.. కల్తీ మరకను నిగ్గు తేల్చేందుకు జగన్ జమానాలో ఈఓలుగా పనిచేసిన జవహర్‌రెడ్డి, ధర్మారెడ్డి, టీటీడీ చైర్మన్లుగా పనిచే సిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డిని పిలిపిస్తారా? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. భూమన-సుబ్బారెడ్డి హయాంలోనే ఈ ఒప్పందాలు జరిగిన క్రమంలో, వారిని పిలిపించి విచారిస్తేనే అసలు నిజాలు వెలుగుచూస్తాయంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ , టీటీడీలో గత ఐదేళ్ల నుంచీ నిర్విఘ్నంగా కొనసాగుతున్న అధికారులను కూడా విచారించాల్సి ఉంది.
సారథి, ప్రశాంతిరెడ్డినీ విచారిస్తారా?
కాగా జగన్ జమానాలో టీటీడీ బోర్డు మెంబర్లుగా కొనసాగడంతోపాటు.. పర్చేజింగ్ కమిటీలోనూ కొనసాగిన నేటి టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, మంత్రి పార్ధసారథిని కూడా సిట్ విచారిస్తుందా? అన్న చర్చ జరుగుతోంది. అప్పుడు నెయ్యి కొనుగోళ్లు ఏ పద్ధతి ప్రకారం, ఏ ప్రాతిపదికన కొనుగోలు చేశారన్న విషయాలను వారిద్దరు చెబితే.. సిట్ విచారణలో మరిన్ని కొత్త అంశాలు తెరపైకి వచ్చే అవకాశాలున్నాయంటున్నారు.