-ఒక్క టికెట్ తెగని ‘వ్యూహం’
– ఒక్కరూ అడ్వాన్స్ బుకింగ్ చేసుకోని దుస్థితి
– ప్లీజ్.. వైసీపీ వాళ్లయినా ఒక్క టికెట్ కొనండి
– ఎంపీ రఘురామరారాజీ వ్యంగ్యాస్త్రం
– వ్యూహం లేక చతికిలపడ్డ ‘వ్యూహం’
– ఫాఫం.. వర్మ
(మార్తి సుబ్రహ్మణ్యం)
రాంగోపాల్‌వర్మ.. ఇది పరిచయం అవసరం లేని పేరు. ఓడ్కా ప్రియులకే కాదు. చైన్లు లాగే బ్యాచ్‌లకు ఆయనంటే మహా ఇష్టం. సినిమాలు ఫట్టయినా వర్మకు కావలసింది పబ్లిసిటీ మాత్రమే. వైసీపీ ప్రాయోజిక సొమ్ముతో తీశారని ప్రచారంలో ఉన్న ‘వ్యూహం’ విడుదల కోసం, పాపం నిర్మాత బోలెడు ఖర్చు చేసినట్లున్నారు. తొలుత అవరోధాలు ఎదురైనప్పటికీ, చివరాఖరకు కోర్టు సెన్సార్‌బోర్డుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది.
దానితో వర్మ అండ్‌కో ఆనందానికి అవధుల్లేవు. ఎన్నికల్లో ఈ సినిమా ఉపయోగపడుతుందని, ఈ సినిమా చూసినవారంతా టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేసి, జగనన్నకు జై కొట్టాలన్నది వర్మ ‘వ్యూహం’. ఆ మేరకు జగన్‌ను రియల్ హీరోగా చూపాలన్నది ‘రీల్’ ఆరాటం. కోరిక వరకూ బాగానే ఉంది. కానీ సినిమా విడుదల ముందే అసలు సినిమా కష్టాలు మొదలయ్యాయట.
‘వ్యూహం’ సినిమాకు ఇప్పటికే బోలెడంత ఉచిత ప్రచారం వచ్చేసింది కాబట్టి, ఇక రిలీజయితే థియేటర్లు ఇసుకేస్తే రాలనంత మంది జనం వచ్చేస్తారని భావించారు. కానీ విధి వక్రించినట్లుంది. వర్మకు కర్మ ఎదురయింది. ఆదివారం ఐమ్యాక్స్ థియేటర్‌లో మార్నింగ్‌షోకు ఒక్కటంటే ఒక్క అడ్వాన్స్ టికెట్ కూడా తెగలేదట. రాత్రి వరకూ ఆన్‌లైన్ అడ్వాన్స్ బుకింగ్ చార్ట్ చూస్తే, పైనుంచి కిందవరకూ అన్ని వరసలూ ఖాళీగా వెక్కిరిస్తూ కనిపిస్తున్నాయి. పాపం దానితో వ్యూహం సినిమా నిర్మాతకు కాఫీ టీ చిల్లర ఖర్చులు కూడా దక్కేలా లేదు.
దీనిపై నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజు తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రం సంధించారు. ‘పాపం రాంగోపాల్‌వర్మ తీసిన వ్యూహం సినిమా ఐమ్యాక్స్‌లో మార్నింగ్‌షోకు ఒక్కరు కూడా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోలేదట. ప్లీజ్.. వైసీపీ అభిమానులు కనీసం ఒక్క టికెట్టయినా కొనండి. రీల్ విలన్‌ను రియల్ హీరోగా చేసే ప్రయత్నాన్ని ప్రజలు తిరస్కరించారు’’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే సినిమాకు వచ్చిన వారికి తాగినన్ని కూల్‌డ్రింక్స్, తిన్నంత స్నాక్స్ ఇస్తామని చెబితే జనం వస్తారని కొందరు సెటైర్లు వేస్తున్నారు. మరికొంతమంది మహిళలకు టికెట్ కొంటే చీరజాకెట్ ఉచితంగా ఇస్తామని ప్రకటిస్తే హాలు ఫ్లులవుతుందని మరికొందరి సలహా.కోట్లు తగలేసి, జగనన్నను హీరోగా చూపేందుకు వర్మ వేసిన సినిమా ‘వ్యూహం’.. ముందస్తుగా అట్టర్‌ఫ్లాప్ అవడం విషాదమేనన్నది సినీజీవుల ఉవాచ.