Suryaa.co.in

Andhra Pradesh

నేర రాజధానిగా నెల్లూరు

– టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్యదర్శి నారా లోకేష్

రాష్ట్రానికి మూడు రాజధానులు అని చెప్పిన జగన్ రెడ్డి నాలుగో రాజధాని కూడా ఏర్పాటు చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఆ నాలుగో రాజధాని నెల్లూరు అని ఆరోపించారు. జగన్ రెడ్డి పాలనలో నెల్లూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేర రాజధానిగా మారిందని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో ఇటీవల వైసీపీ నేతల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు చేసుకున్న దళిత యువకుడు కరుణాకర్ కుటుంబాన్ని బుధవారం లోకేష్ పరామర్శించి ఓదార్చారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… మర్డర్లు, మానభంగాలు, భూ కబ్జాలు, పోలీసుల హింసకి నెల్లూరు రాజధానిగా మారిందని ఆరోపించారు. వైసీపీ నేతలు వాటాలు వేసుకొని నెల్లూరు జిల్లాని పంచేసుకున్నారని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న మర్డర్లు, అత్యాచారాలు, భూకబ్జాలు, పోలీసుల హింస వెనుక ఉన్నది వైసిపి నేతలేనని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి దళిత ద్రోహి అని, ఆయన సీఎం అయిన మొదటి రోజు నుండే దళితులపై దాడులు మొదలయ్యాయని విమర్శించారు. వైసిపి పాలనలో దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి పాలనలో దళితుల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేదన్నారు. ఓట్లేస్తే అన్ని డోర్ డెలివరీ అన్న జగన్ రెడ్డి దళితుల శవాల్ని డోర్ డెలివరీ చేస్తున్నాడని విమర్శించారు. ఎస్సి సబ్ ప్లాన్ నిధులు పక్క దారి పట్టించారని, ఎస్సి కార్పోరేషన్ ని నిర్వీర్యం చేశారని లోకేష్ ఆరోపించారు. దళితుల అభివృద్ధి కోసం ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారని ఆయన మండిపడ్డారు. వైసీపీ నేతలు దళిత మేధావులను టార్గెట్ చేసి మరీ చంపుతున్నారని, జగన్ రెడ్డి పరిపాలనలో దళితులకు ప్రశ్నించే హక్కు లేదని, హక్కుల కోసం పోరాడితే చంపేస్తారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలులో లేదని, రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉందని ఆయన చెప్పారు. దళితులను చంపిన, హింసించిన ఏ ఒక్క కేసులోనూ వైసిపి నేతలకు శిక్ష పడలేదని అన్నారు. దళితులు ఎవరైనా ప్రశ్నిస్తే పిచోళ్లనే ముద్ర వేసి వేధించి చంపేస్తున్నారని ఆరోపించారు. జగన్ రెడ్డిని ప్రైస్ ట్యాగ్ సీఎం అని లోకేష్ ఎద్దేవా చేశారు. వైసిపి నేతలు మర్డర్లు చేసినా, అత్యాచారాలు చేసినా జగన్ రెడ్డి ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేప్ కి ఇంత, మర్డర్ కి ఇంత అని రేటు ఫిక్స్ చేసారని మండిపడ్డారు.

“న్యాయం కోసం పోరాడటానికి లేదు.. నిందితుల్ని శిక్షించరు.. వారిచ్చిన డబ్బు తీసుకుని నోరు మూసుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతుంది ఇదే” అని లోకేష్ తెలిపారు. “విశాఖలో దళిత డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు పిచ్చోడనే ముద్ర వేసి చంపేశారు. తూర్పుగోదావరి జిల్లాలో దళిత యువకుడు వరప్రసాద్ అక్రమ ఇసుక రవాణాకి అడ్డుపడ్డాడని వైసిపి నేతలు, పోలీసులు కలిసి గుండు కొట్టించారు. కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యంని వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేసాడు. చీరాలలో దళిత యువకుడు కిరణ్ మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు కొట్టి చంపేసారు. తిరుపతిలో డాక్టర్ అనితా రాణి వైసిపి అక్రమాలకు సహకరించ లేదని వేధించారు.

చిత్తూరులో జే బ్రాండ్ లిక్కర్ దందా గురించి ప్రశ్నించిన దళిత యువకుడు ఓం ప్రతాప్ ని వైసిపి నేతలు చంపేసారు. జగన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో దళిత మహిళ నాగమ్మని అత్యాచారం చేసి చంపేస్తే ఈ రోజు వరకూ కుటుంబానికి న్యాయం జరగలేదు. బకాయిలు చెల్లించమని అడిగినందుకు కానిస్టేబుల్ ప్రకాష్ పై అక్రమ కేసులు పెట్టి సర్వీస్ నుండి తొలగించారు. వైసిపి ప్రభుత్వ చెత్త నిర్ణయాలను ఎండగడుతున్న మహాసేన రాజేష్ పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. అతని కారు కూడా లాగేసుకున్నారు” అని లోకేష్ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, హత్యాకాండ గురించి వివరించారు. ఇక క్రైం క్యాపిటల్ అఫ్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో పరిస్థితులు మరీ ఘోరంగా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దళితులు, మైనార్టీలు, బీసీలు వైసిపి నేతలు, పోలీసుల చేతిలో బలైపోతున్నారని ఆరోపించారు.

కావలిలో ఎంతో భవిష్యత్తు ఉన్న దళిత యువకుడు కరుణాకర్ వైసిపి నేతల వేధింపులకు బలైపోయాడని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఖచ్చితంగా వైసిపి నేతల హత్యేనని ఆరోపించారు. ఊరిలో చెరువు లీజ్ కి తీసుకుని చేపలు పెంచుకున్న కరుణాకర్ ని చెరువులో చేపలు పట్టుకొని అమ్ముకోవడానికి వీలు లేదని వైసిపి నేతలు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డి అడ్డుకున్నారని, కరుణాకర్, అతని తల్లి వైసిపి నేతలు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డి కాళ్లుమొక్కినా వదలలేదని, కులం పేరుతో దూషించారని లోకేష్ ఆగ్రహం వెలిబుచ్చారు. మూడేళ్లుగా ఈ వేధింపులతో దాదాపు రూ.20 లక్షలు అప్పుల పాలయిన కరుణాకర్ చివరికి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. దళితుల్ని చంపేవారికి వైసిపిలో పదవులు ఇస్తారని, నిందితుల్లో ఒకరైన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబర్ అని ఆయన ఆరోపించారు. వైసిపి నేతల వేధింపుల కారణంగా కరుణాకర్ కుటుంబం ఇప్పుడు వీధిన పడిందని, కరుణాకర్ ఇద్దురు ఆడ బిడ్డలు, భార్య, తల్లికి అండ లేకుండా పోయిందని లోకేష్ చెప్పారు. కరుణాకర్ హత్య కేసులో జగదీశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డి ని అరెస్ట్ చేసి పోలీసులు చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని, ఈ కేసులో అసలు నిందితుడు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అని ఆయన ఆరోపించారు.

కరుణాకర్ ని వేధించిన జగదీశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డి ఎమ్మెల్యే బినామీలేనని, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతోనే కరుణాకర్ ని వేధించారని ఆయన ఆరోపించారు. అనేక సార్లు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గరకి వెళ్లి వేడుకున్నా కరుణాకర్ ని వదిలి పెట్టలేదని, ఎమ్మెల్యే, ఆయన బినామీ షాడో ఎమ్మెల్యే సుకుమార్ రెడ్డి కలిసి ఒక మల్టీప్లెక్స్ కట్టాలని ప్లాన్ చేసుకున్నారని, దానికి కరుణాకర్ ఇళ్ళు కూడా కావాల్సి వచ్చిందని, ఆ ఇళ్ళు లాక్కోవడానికే కరుణాకర్ ని అంతగా వేధించారని లోకేష్ వివరించారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేస్తేనే కరుణాకర్ కుటుంబానికి న్యాయం జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్యే అక్రమాలు అన్ని, ఇన్ని కావని, గ్రావెల్ దందాలో కోట్లు కొట్టేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. “ఇంకా విచిత్రం ఏంటంటే కావలి నియోజకవర్గంలో ఎవరికీ తమ ఆస్తి అమ్ముకునే హక్కు లేదంట.. ఎవరైనా అమ్మాలి అనుకుంటే తక్కువ రేటుకి ఎమ్మెల్యేకే అమ్మాలి.. లేకపోతే వేధింపులు తప్పవు” అని లోకేష్ వివరించారు. కరుణాకర్ కుటుంబానికి టిడిపి అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలో అక్రమంగా దొంగతనం కేసు పెట్టి దళితుడు నారాయణను పోలీస్ స్టేషన్ లో కొట్టి చంపేసారని, కుటుంబసభ్యులను బెదిరించి భౌతిక కాయాన్ని పూడ్చిపెట్టకుండా అడ్డుకున్న పోలీసులు వైసిపి నేతల సహాయంతో దహనం చేసేసారని ఆయన ఆరోపించారు. ఈ మర్డర్ కి వైసిపి నేతలు లక్షన్నర రేటుకట్టారని విమర్శించారు. సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలంలో ఒక ఎస్సై వేధించి, వెంటాడి ఇద్దరు మైనార్టీ సోదరులు షాజహాన్, ఉస్మాన్ లను చంపేసాడని,ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలంలో ఒక ఎస్సై గీత కార్మికుడు అన్నం చెంచయ్య, దివ్యాంగుడు తిరుపతిలను వేధించి చంపేసాడని ఆయన ఆరోపించారు. “సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం వీరంపల్లి గ్రామంలో ఒక ఎస్సై రైతుని కొట్టి చంపేశాడు.

సర్వేపల్లి నియోజకవర్గం జి.వి పాలెం గ్రామంలో వైసిపి నాయకుడు దళితుడు పెంచలయ్యని హత్య చేసాడు. ఈ కేసులో పోలీసులు కనీసం 302 సెక్షన్ పెట్టలేదు. సర్వేపల్లి నియోజకవర్గం నాయుడు పాలెంలో వైసిపి కార్యకర్త వేధింపులు తట్టుకోలేక బీసీ యువతి చల్లా అరుణ ఆత్మహత్య చేసుకుంది. ఆత్మకూరు నియోజకవర్గం మినగల్లు గ్రామస్తుడు వెంగయ్యపై వైసిపి నేతలు దాడి చేసి హత్య చేసారు” అని ఆయన ఆరోపించారు.

టిడిపి నాయకులు నేషనల్ ఎస్సి కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి పోరాడటంతోనే ఆ కుటుంబాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. పరిహారం, పెన్షన్, ఉద్యోగం, ఇంటి స్థలం, పిల్లల చదువుకు సాయం ఇలా అన్ని మన నాయకులు పోరాడిన తరువాతే బాధితుల కుటుంబాలకు వచ్చాయని ఆయన తెలిపారు. నెల్లూరులో టిడిపి కార్యకర్త సునీత, వాసిరెడ్డి కృష్ణారావు దంపతులను అత్యంత దారుణంగా హత్య చేసారని, సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలంలో 14 ఏళ్ల బాలికపై వైసిపి కార్యకర్త నాగరాజు యాసిడ్ పోసి గొంతు కోసాడని ఆయన ఆరోపించారు. నెల్లూరు క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా మారడానికి ప్రధాన కారణం ఇక్కడ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కండీషనల్ బెయిల్ కాకాణి అరాచకాలు అన్ని ఇన్ని కావని, ఆయనకి ప్రాణం విలువ తెలియదు.. మంత్రి అయిన మూడో రోజునే ఆయన అపార్ట్మెంట్ లో ఒక ముస్లిం యువకుడు చనిపోతే 3 లక్షల రేటు కట్టాడని ఆరోపించారు.

ఆయన అక్రమాలకు సహకరించి, ప్రజల్ని వేధించే పోలీసులను కాపాడటంతో పాటు కావాల్సిన చోట పోస్టింగులు ఇప్పిస్తున్నాడని ఆయన విమర్శించారు. నెల్లూరులో ఏడుగురు రైతులకు చెందిన 4 ఎకరాల 70 సెంట్ల భూమిని కాకాణి కబ్జా చేసారని, ఆరుగురు రిటైర్డ్ ఉద్యోగస్తులకు చెందిన ప్లాట్స్ ని కబ్జా చేశాడని ఆరోపించారు. ఫోర్జరీ సంతకాల కేసు, కల్తీ మద్యం కేసులకు కాకాణి బ్రాండ్ అంబాసిడర్ అని మండిపడ్డారు. ప్రభగిరి పట్నం మైనింగ్ అంతా కాకాణి ఆధ్వర్యంలోనే నడుస్తుందన్నారు.

ఎన్నికల ముందు రాయి లేస్తే శవం లేస్తుంది అన్న కాకాణి ఇప్పుడు కొండనే లేపేసాడని, కొండని మింగిన అనకొండ కాకాణి అని ఆయన ఆరోపించారు. దళితులపై దాడులు ఆపకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చెయ్యాలని, దళితులను హత్య చేసిన వైసిపి నేతల్ని కఠినంగా శిక్షించాలని లోకేష్ డిమాండ్ చేశారు. త్వరలోనే నెల్లూరు జిల్లాలో నాయకులంతా బాధిత కుటుంబాలను పరామర్శించడానికి పాదయాత్ర చేస్తారని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే అధికారులకు శిక్ష తప్పదన్నారు. ఇండియన్ పీనల్ కోడ్ అమలు చెయ్యండి…జగన్ పీనల్ కోడ్ అమలు చేస్తే ఇబ్బందులు తప్పవని లోకేష్ పోలీసులను హెచ్చరించారు.

LEAVE A RESPONSE