Suryaa.co.in

Andhra Pradesh

ఇన్ని అవమానాలు ఎప్పుడూ ఎదుర్కోలేదు: అచ్చెన్నాయుడు

– అసెంబ్లీలో టీడీపీ సభ్యులను అవమానాలకు గురి చేస్తున్నారు
– చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులను కూడా అవమానిస్తున్నారు
– మైక్ ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్లమన్న అచ్చెన్న

వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. గత మూడేళ్లుగా అసెంబ్లీలో టీడీపీ సభ్యులను వైసీపీ సభ్యులు అవమానాలకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు, ఆయన కుటుంబసభ్యులను కూడా అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఇన్ని అవమానాలు ఎప్పుడూ ఎదుర్కోలేదని అన్నారు. విపక్ష సభ్యులు మాట్లాడేందుకు మైక్ కూడా ఇవ్వరని అసహనం వ్యక్తం చేశారు.

గత మూడేళ్లుగా సభ సజావుగా జరగడం లేదని అచ్చెన్నాయుడు అన్నారు. తమ కర్తవ్య బాధ్యతలను నెరవేర్చడానికి సభకు హాజరవుతున్నామని తెలిపారు. 30 అంశాలను సిద్ధం చేసుకుని అసెంబ్లీకి వెళ్తున్నామని చెప్పారు. సభలో మైక్ ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్లబోమని తెలిపారు. స్పీకర్ తమ్మినేని హుందాగా వ్యవహరించాలని చెప్పారు.

శాసనసభ గౌరవాన్ని వైసీపీ సభ్యులు మంటగలుపుతున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీని కౌరవసభగా మార్చారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం బయట చేసే ప్రకటనలకు, సభ లోపల వ్యవహరించే తీరుకు పొంతన ఉండదని అన్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం వెళ్లడం లేదు. టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్తున్నారు.

LEAVE A RESPONSE