-కొత్త ఓటర్ల జాబితాలో కొత్త కోడళ్లు
-మునుగోడులో కొత్త కోడళ్ల తొలి ఓటు
-ఇప్పటికే మునుగోడు అల్లుళ్ల ప్రచారం
-నియోజకవర్గంలో కొత్త ఓట్లు 12 వేలు
-7 వేల దరఖాస్తుల తిరస్కరణ
-తాజా జాబితాపై అభ్యంతరాలను కొట్టేసిన హైకోర్టు
( మార్తి సుబ్రహ్మణ్యం)
మునుగోడు ఉప ఎన్నిక అనేక ఆశ్చర్యాలను ఆవిష్కరిస్తోంది. మరిన్ని విచిత్రాలకు కేంద్రమవుతోంది. ఒకవైపు మునుగోడు పొలిటికల్ అల్లుళ్లంతా, ఉప ఎన్నిక ప్రచారంలోకి దిగితే.. సరికొత్తగా కొత్త కోడళ్లు కొత్త ఓటర్ల అవతారమెత్తారు. అయితే.. కొత్త ఓటర్ల జాబితాలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ చేసిన ఫిర్యాదును , హైకోర్టు త్రోసిపుచ్చింది. దానితో ఎన్నికల సంఘం రూపొందించిన కొత్త జాబితానే ఖరారయింది.
మునుగోడు ఉప ఎన్నికలో కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం లభించింది. దానితో వేలమంది తమ ఓటు హక్కు కోసం, ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆ ప్రకారంగా.. అధికారులే స్వయంగా వారి ఇళ్ల వద్దకు వెళ్లి, స్థానికతను పరిశీలించారు. ఎప్పటినుంచి అక్కడ నివసిస్తున్నారో ఆరా తీశారు. చుట్టుపక్కల వారిని ఆరాతీశారు. ఇన్ని పరిశీలన తర్వాత, వారికి ఓటు హక్కు కల్పిస్తూ కొత్త జాబితాలో చోటు కల్పించారు.
ఆ ప్రకారంగా.. కొత్తగా పెళ్లి అయిన వారికి మునుగోడులో ఓటు హక్కు లభించింది. అందులో కొత్త కోడళ్లు కూడా ఉండటం విశేషం. ఇటీవలి కాలంలో పెళ్లిళ్లయి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కొత్త కోడళ్లు కూడా, మునుగోడులో ఓటు హక్కు కావాలని ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆ మేరకు అధికారుల పరిశీలనలో కూడా వారంతా ఓటుకు అర్హులే అని తేలడంతో, వారి అభ్యర్ధనను ఎన్నికల అధికారులు ఓకే చేసేశారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. ఏ ఒక్క కొత్త కోడలికీ ఓటు హక్కు నిరాకరించలేదట. మొత్తంగా మునుగోడులో 12 వేల కొత్త ఓటరు, ్ల తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సో.. అందులో కొత్త కోడళ్లు కూడా అత్తారింట్లో తొలిసారి ఓటు వేయబోతున్నారన్నమాట.
ఇక ఓటర్ల జాబితాపై జరుగుతున్న లొల్లికి హైకోర్టు తెరదించింది. ఆ మేరకు బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని తిరస్కరించారు? ఎన్ని ఆమోదించారన్న వివరాలు సమర్పించాలని ఈసీని ఆదేశించారు. జాబితాపై వచ్చిన ఫిర్యాదును కొట్టివేసింది. దీనితో ఈసీ ఆమోదించిన జాబితా ప్రకారమే పోలింగ్ జరగనుంది. టీఆర్‌ఎస్ పార్టీ 25 వేల మంది బోగస్ ఓటర్లను చేర్పించిందన్నది బీజేపీ ఆరోపణ. ఆ మేరకు బీజేపీ ఇన్చార్జి తరుణ్‌చుగ్, రామచంద్రరావు తదితరులతా ఈసీకి ఫిర్యాదు చేశారు.