పురపాలక శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్
ఆంధ్రప్రదేశ్‌లో స్థిరాస్తి రంగం కొత్తపుంతలు తొక్కుతోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. క్రెడాయ్ వారు విజయవాడ నగరంలో అక్టోబరు 1, 2 తేదీలలో ఏర్పాటు చేసిన 8వ ప్రాపర్టీ షో ఆఖరి రోజైన ఆదివారం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జరిగిన ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో స్థిరాస్తి రంగాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ ఇక్కడికి వచ్చిన స్థిరాస్తి వ్యాపారులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనుకునే వారికి ఒక చక్కటి వేదికను ఏర్పాటు చేసిన క్రెడాయ్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. స్థిరాస్తి అమ్మకందారులకు కొనుగోలుదారులకు ఇటువంటి బృహత్తర వేదికలు ఏర్పాటు చేయటం ముదావహం అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకు ఆకర్షణీయమైన ప్లాట్లు, స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకునే ప్రణాళికలతో వచ్చి క్రెడాయ్ ప్రాపర్టీ షోలో 150కి పైగా డెవలపర్లు తమ స్టాళ్లను ఏర్పాటు చేయటం శుభపరిణామం అన్నారు.
ప్రజలకు లాభసాటిని కలిగించే విధంగా స్థిరాస్తి రంగం అభివృద్ధి చెందాలని ఆకాంక్ష. ప్రజల జీవన ప్రమాణాలకు అనుగుణంగా అత్యుత్తమ ప్రమాణాలతో చక్కటి గృహాలు ఏర్పాటు చేసుకునేందుకు అనువుగా ప్రణాళికలు రచిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో స్థిరాస్తి రంగం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకు ఆశాజనకమైన ధరల్లో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో ప్లాట్లు, గృహాలు, గ్రూపు హౌస్‌లను ఈ ప్రాపర్టీ షో ద్వారా అందుబాటులోనికి తీసుకురావటం కొనుగోలుదారులకు క్రెడాయ్ వారు కల్పిస్తున్న గొప్ప సదావకాశమన్నారు. సొంతింటి కలను నెరవేర్చుకోవాలనే వారికి క్రెడాయ్ ప్రాపర్టీ షోలో గృహ అలంకరణ, గృహ నిర్మాణానికి అవసరమైన ముడి సరుకు సరఫరా చేయు స్టాళ్లు కూడా ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.
అన్ని వర్గాల ప్రజలు నివాసయోగ్యంగా ఉండే భవనాలు, అపార్టుమెంట్లను సిద్ధంచేసి వాటిని ఈ ప్రాపర్టీ షో ద్వారా ప్రజలకు పరిచయం చేయటంతో పాటు బ్యాంకుల నుంచి రుణ సదుపాయాలతో పాటు స్థిరాస్తి పొందేందుకు సులభతరమైన మార్గాలను అందుబాటులోనికి తీసుకురావటం నిజంగా శుభతరుణం. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ఉన్న గూడు లేకుండా ఉన్న ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చాలనే మహత్తర లక్ష్యంతో రాష్ట్రంలో “పేదలందరికీ ఇళ్లు” పథకం ద్వారా అందమైన ఇళ్లను కట్టి ఇవ్వటం జరిగింది.
అదేవిధంగా మధ్య తరగతి ఆదాయ సమూహాలు కూడా సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి జగనన్న స్మార్ట్ టౌన్షిప్‌లకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజవర్గాలలో మార్కెట్ ధర మీద 20 శాతం తగ్గింపు ధరలలో ఈ టౌన్షిప్లలో ప్లాట్లు అందుబాటులోనికి తీసుకువస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏపీ సీఆర్డీఏ) విజయవాడ పాయకాపురం, ఇబ్రహీపట్నం ట్రక్కు టెర్మినల్, నవులూరులోని అమరావతి టౌన్షిప్, తెనాలిలోని చెంచుపేట టౌన్షిప్లలో 18 లాట్లో 424 ప్లాట్లును ఈ ప్రాపర్టీ షోలో ప్రజల ముందుకు తీసుకువచ్చింది. ఈ ప్రాపర్టీ షో ప్రజలందరికీ మేలు చేకూర్చే విధంగా ఉంటుంది. ఇలాంటి ప్రాపర్టీ షోల ద్వారా రాష్ట్రంలో స్థిరాస్తి రంగం కొత్తపుంతలు తొక్కుతుందన్నారు. అనంతరం మంత్రివర్యులు క్రెడాయ్ ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వేర్లు , విజయవాడ తుర్పు నియొజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్ , స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా డీజీఎం కె.రంగరాజన్, క్రెడాయ్ విజయవాడ అధ్యక్షులు కె.రాజేంద్ర, కార్యదర్శి కె.రమేష్ అంకినీడు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.రమణరావు, క్రెడాయ్ ప్రాపర్టీ షో నిర్వాహకులు దాసరి రాంబాబు, కోశాధికారి వరదా శ్రీధర్, ఆర్వీ స్వామి, తుమ్మల వంశీ కృష్ణ , బోయపాటి చందు, కె.వి.రవి కుమార్, కె.తేజేశ్వరరావు,మరియు మేనేజింగ్ కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.