ఢిల్లీ : తిహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ పై… తాజాగా మరో పెద్ద పిడుగు. ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నుంచి సుమారు రూ. 134 కోట్ల మేర నిధులను స్వీకరించారని కేజ్రీవాల్ పై ఫిర్యాదు అందిందని, దానిపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)తో దర్యాప్తు చేయించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వి.కె.సక్సేనా లేఖ రాశారు.
ఈ ఫిర్యాదును వరల్డ్ హిందూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ జాతీయ కార్యదర్శి ఆషూ మోంగియా చేసినట్లు లేఖలో ఎల్జీ పేర్కొన్నారు. దీనితో కేజ్రీవాల్ పై ఎన్ఐఏ అధికారులు కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు మంగళవారం పరిశీలించనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
1993లో ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్లలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన కేసులో దోషి… దేవేంద్ర సింగ్ భుల్లార్ ను విడుదల చేసేందుకు కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీ భారీగా నిధులను తీసుకుందన్నది ఈ ఫిర్యాదులో ప్రధాన ఆరోపణ. భుల్లార్ కు 2021 ఆగస్టు 25న టాడా కోర్టు మరణశిక్ష విధించింది. తర్వాత సుప్రీంకోర్టు ఆ శిక్షను జీవితఖైదుగా మార్చింది. 2023 డిసెంబరులో భుల్లార్ ముందస్తు విడుదలపై ఢిల్లీ ప్రభుత్వ శిక్షా సమీక్ష బోర్డు సమావేశమైంది. ముందస్తు విడుదలకు భుల్లార్ అనర్హుడని తేల్చింది.
ఫిర్యాదులో భాగంగా ఓ వీడియో కూడా ఎల్జీకి అందింది. ఇందులో న్యూయార్క్ లోని రిచ్‌మండ్ హిల్స్ గురుద్వారాలో ఖలిస్థాన్ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ చేసిన ప్రసంగం కూడా ఉంది. 2014-22 మధ్య కాలంలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్… ఖలిస్థాన్ సంస్థల నుంచి 16 మిలియన్ డాలర్లు ( సుమారు రూ.134 కోట్లు) నిధులు అందుకుందని ఆ ప్రసంగంలో పన్నూ ఆరోపించారు. ఆప్ మాజీ నేత మునీశ్ కుమార్ రైజాదా ‘ఎక్స్’లో పెట్టిన చిత్రాలనూ లేఖలో వి.కె.సక్సేనా ప్రస్తావించారు. 2014లో రిచ్‌మండ్ గురుద్వారాలో ఖలిస్థాన్ నాయకులతో కేజ్రీవాల్ సమావేశమైన చిత్రాలను రైజాదా పోస్టు చేశారు.