– ఫైల్ క్లియరెన్స్ ఆధారంగా మంత్రులకు ర్యాంకులు ఇచ్చిన సీఎం చంద్రబాబు
– మొదటి స్థానంలో మంత్రి రామానాయుడు, చివరి స్థానాల్లో పయ్యావుల కేశవ్ , కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు
– ఒక ఫైల్‌కు 3 రోజుల సమయం తీసుకుని, ఇప్పటిదాకా 3,366 ఫైళ్లు క్లియర్ చేసిన సీఎం చంద్రబాబు
– మంత్రులు శాఖలను లైట్ తీసుకుంటున్నారా?
– పేషీల్లో సమర్ధులను తీసుకోనందుకే ఈ సమస్యనా?
– చాలామంది పేషీల్లో ‘వసూల్‌రాజా’లు?
– మంత్రులకు అంతకుమించిన పనులేం ఉంటాయి?
– శుక్రవారం సాయంత్రమే పక్క రాష్ట్రాలకు జంపయిపోతున్న కొందరు మంత్రులు?
– పనితీరులో బాబును ఆదర్శంగా తీసుకోలేరా?
(మార్తి సుబ్రహ్మణ్యం)
ఫైల్ క్లియరెన్స్ ఆధారంగా మంత్రులకు ర్యాంకుల జాబితాలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రెండో స్థానంలో, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో ఉన్నారు. వీరి తర్వాత నాలుగో స్థానంలో హోం మంత్రి అనిత, ఐదో స్థానంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చోటు దక్కించుకున్నారు. చివరి స్థానాల్లో పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు ఉన్నారు.
ఒక్కో ఫైల్ క్లియరె న్స్‌కు.. ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర 43 రోజులు తీసుకోగా, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 33 రోజులు తీసుకున్నారు. బాలవీరాంజనేయస్వామి, నారాయణ ఒకరోజు.. లోకేష్, సత్యకుమార్ యాదవ్ 2 రోజులు.. పయ్యావుల కేశవ్ 15 రోజులు, బీసీ జనార్దన్‌రెడ్డి 10 రోజులు, ఆనం రామనారాయణరెడ్డి 9 రోజులు తీసుకున్నట్లు సీఎం ఇచ్చిన ర్యాంకుల్లో వెల్లడించారు.
నిజానికి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖల్లో వాణిజ్యశాఖ ఒక్కటే కీలకం. శాసనసభ వ్యవహారాల శాఖలో పెద్దగా పనేమీ ఉండదు. కీలకమైన ఆర్ధికశాఖ వ్యవహారాల్లో కార్యదర్శి పియూష్‌కుమార్ చురుకుగానే వ్యవవహరిస్తున్నారు. కాబట్టి సెక్రటేరియేట్‌కు వచ్చి ఫైళ్లు క్లియరెన్స్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. మరి ఒక ఫైల్ క్లియరెన్స్‌కు అన్ని రోజులు ఎందుకు పడుతుందన్నదన్నదేప్రశ్న.
అలాగని కేశవ్ పార్టీ వ్యవహారాల్లో బిజీగా కూడా లేరు. సందర్భానుసారంగా తప్ప, విపక్ష ంలో ఉన్న మాదిరిగా ఇప్పుడు వైసీపీపై ఎదురుదాడి చేస్తున్న సందర్భాలేమీ లేవు. సొంత నియోజకవర్గం, హైదరాబాద్‌లోనే ఎక్కువసేపు గడుపుతున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కాగా పులివెందుల నియోజకవర్గానికి చెందిన వైసీపీ కాంట్రాక్టర్లకు వందకోట్ల రూపాయల పెండింగ్ బిల్లుల వ్యవహారంపై మీడియాలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.
ఇక కీలకమైన వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఫైళ్ల క్లియరెన్స్‌లో బద్దకం చూపిస్తున్నట్లు సీఎం ఇచ్చిన నివేదిక స్పష్టం చేస్తోంది. నిజానికి వ్యవసాయశాఖ అత్యంత కీలకం. సీజన్లతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా దృష్టి సారించినా, సమయం సరిపోని శాఖ అది. జిల్లా పార్టీ వ్యవహారాలతోపాటు.. ‘ఇతర’ వ్యవహారాల్లో చురుకుగానే ఉన్న అచ్చెన్న, శాఖాపరంగా మాత్రం పూర్తిగా వెనకబడి పోయారు.
అయితే ఆయన తన పేషీలో సమర్ధులను నియమించుకోలేదని, శాఖాపరమైన విషయాలు తప్ప, ‘మిగిలిన’ వ్యవహారాల్లో పేషీ ఉద్యోగులు బాగా చురుకుగా వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు సచివాలయవర్గాల్లో వినిపిస్తున్నాయి. తాజాగా వ్యవసాయ యంత్ర పరికరాల కాంట్రాక్టు వ్యవహారంలో ఒక కంపెనీతో డీల్ కుదర్చమంటూ ఆగ్రోస్ జీఎంపై ఒత్తిడి తీసుకురావడం, ఆ పని తాను చేయలేనంటూ సదరు జీఎం రాజమోహన్ సెలవుపై వెళ్లిపోయిన వైనం మీడియాకెక్కిన వైనం తెలిసిందే.
గత ఏడాది 60 కోట్ల యంత్రపరికరాల కాంట్రాక్టుల్లోనూ పేషీ అధికారులు చేతివాటం ప్రదర్శించారని.. వైసీపీ సర్కారు రోటోవేటర్‌ను లక్ష రూపాయల వరకూ కొనుగోలు చేస్తే, ఇప్పుడు అదే రోటేవేటర్ను 1.45 లక్షల రూపాయలకు నిర్ణయించడమే విమర్శలకు దారితీసింది. 10 లక్షల గ్యారంటీ ఉన్న కంపెనీలకు 23 కోట్లు అడ్వాన్సులు ఇవ్వడం, అనర్హత జాబితాలో ఉన్న ఒక కంపెనీని ఏకంగా ఎన్ప్యానెల్మెంట్లో చేర్చడం వంటి ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
ఆయన దగ్గర పనిచేసే వ్యక్తిగత సిబ్బంది ఒకరు ఇలాంటి వ్యవహారాల్లో చక్రం తిప్పుతున్నారని, గత సర్కారులోనూ ఆయన ఇలాగే చక్రం తిప్పారంటూ మీడియా-సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే.
ప్రతి ఐఏఎస్ అధికారికి కలెక్టర్ కావాలన్నది తొలి కల. అలాగే సీఎస్ కావాలన్నది అంతిమ లక్ష్యంగా ఉంటుంది. ప్రతి ఐపిఎస్ అధికారికి ఎస్పీ కావాలన్నది ఒక కల. డీజీపీ కావాలన్నది చివరి లక్ష్యంగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఎమ్మెల్యేకు మంత్రి కావాలన్న లక్ష్యం, ఆశ.. జాతీయ పార్టీల్లో అయితే సీఎం కావాలన్న కోరిక ఉంటుంది. అది రావడం ఎంత కష్టమో.. వచ్చిన తర్వాత దానిని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టమైన వ్యవహారం.
అంటే ఒకవైపు ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకం నిలబెట్టుకునేందుకు, శాఖాపరంగా సత్తా చాటుకుంటూనే.. మరోవైపు తనను ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలకు పనులు చేసిపెట్టడంతోపాటు నియోజకవర్గ అభివృద్ధి, జిల్లా పార్టీ బాధ్యతల్లో సక్సెస్ కావాల్సి ఉంటుంది. ఈమధ్యలో మీడియాలో వచ్చే విమర్శలు, విపక్షాలు-సొంతపార్టీ వర్గాల నుంచి వచ్చే ఆరోపణలు-ఫిర్యాదులు- కుటుంబసభ్యులపై వచ్చే ఆరోపణలను సమర్ధవంతంగా ఎదుర్కోవలసి ఉంటుంది. ఒక్కముక్కలో చెప్పాలంటే.. ఈకాలంలో మంత్రి పదవి అంటే, సవ్యసాచిలా పనిచేయాల్సిన పరిస్థితి.
అలాంటి మంత్రి పదవిని నిర్వహిస్తున్న కొందరు, ఆ పదవిని లైట్‌గా తీసుకుంటున్నారన్న విమర్శలు లేకపోలేదు. చాలామంది మంత్రులు శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్, బెంగళూరు, సింగపూర్, థాయ్‌లాండ్‌కు చెక్కేసి, మంగళవారానికి వస్తున్నారన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ హోటళ్లలో సేదదీరి ఎంజాయ్ చేస్తున్నారన్న ఆరోపణలు మీడియా-సోషల్‌మీడియాలోనూ వస్తున్నవే. ప్రధానంగా ఇద్దరు యువమంత్రులపై ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరోవైపు పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఫోన్లు చేసినా తీయని మంత్రుల సంఖ్య ఎక్కువేనంటున్నారు.
అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడుపదుల వయసులోనూ.. అటు పార్టీ-ఇటు ప్రభుత్వ కార్యకలాపాలు-పర్యటనల్లో బిజీగా ఉంటూనే, ఒక ఫైల్‌కు 3 రోజుల సమయం తీసుకుని, ఇప్పటిదాకా 3,366 ఫైళ్లు క్లియర్ చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు.
మరి ప్రభుత్వ-పార్టీ వ్యవహారాలు చక్కదిద్దే పనిలో బిజీగా ఉంటే సీఎం చంద్రబాబునాయుడే ఫైళ్లను అంత వేగంగా క్లియర్ చేస్తుంటే.. కేవలం ఒకటి-రెండు శాఖలున్న మంత్రులు మాత్రం, రోజుల తరబడి సమయం ఎందుకు తీసుకుంటున్నారన్నది ప్రశ్న. దీన్నిబట్టి కొందరు మంత్రులకు ‘ఇతర పనులే’ ముఖ్యంలా కనిపిస్తున్నట్లు స్పష్టమవుతోందని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.