నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్, ఆగస్టు 22: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హామితో నిర్మల్ మాస్టర్ ప్లాన్ పై రైతులు తమ దీక్ష విరమించారు. ఆర్డీవో కార్యాలయం ముందు రైతుల దీక్ష శిబిరాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. మాస్టర్ ప్లాన్ పై మంత్రి ఎలాంటి ఆందోళన చెందవద్దు. ఇది డ్రాప్ట్ నోటిఫికేషన్ మాత్రమే. ఇది ఫైనల్ మాస్టర్ ప్లాన్ కాదని ప్రజలు గ్రహించాలి.
ప్రజల అభ్యంతరాలను, సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వం. మాది రైతు సంక్షేమ ప్రభుత్వం. ప్రజలకు, రైతులకు వ్యతిరేఖంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోదు. ప్రతిపక్షాల నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. వారి మాటలు నమ్మి మీరు మోసపోవద్దు.
గతంలో చెప్పాం. ఇప్పుడు కూడా చెప్పుతున్నాం. ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా చూస్తాం అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దీక్ష చేస్తున్న రైతులకు వివరించారు. దీంతో మంత్రి హామి మేరకు దీక్షను విరమిస్తున్నట్లు రైతులు ప్రకటించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. రాజకీయాలకు అతీతంగా దీక్ష చేస్తున్నామని, మంత్రి హామితో తాము దీక్ష విరమించామని రైతులు తెలిపారు.
అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ…… తాను 260 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేసిటన్లు పత్రికల్లో వచ్చాయి. నిరాధార ఆరోపణలు చేయడం కాదు. నాకు ఎక్కడ భూమి ఉందో ప్రతిపక్ష నాయకులు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. లేదంటే ఆరోపణలు చేసిన వారు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి. నిజాయితీగా ఉన్నాము కాబట్టే మూడు దశాబ్ధాలకు పైగా ప్రజలు మమ్మల్ని ఆదిరిస్తున్నారని పేర్కొన్నారు.