Suryaa.co.in

Editorial

బీసీ మహిళా నేతపై అత్యాచారం చేసినా కొరడా ఝళిపించని కాంగ్రెస్

– బీసీ మహిళా నేతపై రెడ్డి నేత అత్యాచారం చేసినా చర్యలు శూన్యం
– అత్యాచారాల్లోనూ ‘రెడ్డి కార్పెట్’ వేస్తున్నారా?
– చిన్నారెడ్డి నుంచి ఠాకూర్ వరకూ ఫిర్యాదు చేసినా స్పందన శూన్యం
– నిజనిర్థారణ కమిటీ నివేదిక ఏమయింది?
– అపాయింట్‌మెంట్ ఇవ్వని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
– విచారణ మొదలుపెట్టామన్న పంజాగుట్ట పోలీసులు
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘అన్న పార్టీలూ రెడ్లకు పగ్గాలిచ్చి చూడండి. ఆ పార్టీలను ఎలా ముందుకు తీసుకువెళతారో’నంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో వివాదమయిన నేపథ్యంలో.. సొంత పార్టీలో అదే సామాజికవర్గానికి చెందిన ఓ జిల్లా పార్టీ అధ్యక్షుడు.. ఎన్నికల ప్రచారానికొచ్చిన ఓ బీసీ మహిళా నేతపై అత్యాచారం చేసి ఇన్నాళ్లవుతున్నా, ఇప్పటివరకూ ఎలాంటి చర్య తీసుకోని వైనం విమర్శలకు దారితీస్తోంది. సదరు మహిళా నేత చివరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి నుంచి పంజగుట్ట పోలీసుల వరకూ చేస్తున్న న్యాయపోరాటం ఫలించకపోగా, అవమానాలే మిగులుతున్నాయి.

హైదరాబాద్‌కు చెందిన ఓ బీసీ మహిళా కాంగ్రెస్ నాయకురాలు (45) నారాయణపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డితో కలసి సమన్వయం చేసుకోవాలని నాయకత్వం ఆమెను ఆదేశించింది. దీన్ని అవకాశంగా తీసుకున్న శివకుమార్‌రెడ్డి, ఆమెకు వాట్సాప్ మెసేజ్‌లు పెట్టి, దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు. చివరకు ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పేంతవరకూ వెళ్లాడు. తన భార్య అనారోగ్యంతో ఉన్నందున, మూడేళ్లకు మించి బతకదని చెప్పాడు. దుబ్బాకలో ఉన్న సమయంలో మద్యం తాగివచ్చిన శివకుమార్‌రెడ్డి తన కోరిక తీర్చాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. కాళ్లా వేళ్లా పడటంతో ఆమెను అప్పటికి వదిలేశాడు.

2021 జూన్ 24న శివకుమార్‌రెడ్డి ఆమెను ట్యాంక్‌బండ్‌లోని మారియట్ హోటల్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ కూడా ఆమెను శారీరకంగా కలవాలని ఒత్తిడి చేయడటమే కాక, బలవంతంగా మెడలో పసుపుతాడు కట్టాడు. మరుసటి రోజు బేగంపేటకు తీసుకువెళ్లి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి, ఆమె అపస్మారస్థితికి వెళ్లిన తర్వాత ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. తేరుకున్న బాధితురాలితో.. తాను నీ నగ్న చిత్రాలు తీశానని, తన కోరిక తీర్చకపోతే వాటిని ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించాడు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేందుకు, ప్రయత్నించిన ప్రతి సందర్భంలో ఆమెను చంపుతానని బెదిరించాడు. తన వీడియోలు ఇవ్వాలని బ్రతిమిలాడేందుకు ఆమె చివరకు బెంగళూరు కూడా వెళ్లింది. దీనితో విసిగిపోయిన ఆమె, తనకు జరిగిన అన్యాయాన్ని పంజగుట్ట పోలీసుస్టేషన్‌లో ఓ ఫిర్యాదు చేయగా, శివకుమార్‌రెడ్డిపై ఐపిసి 417, 420, 376, 506సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అప్పటి సీఐ నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ఇదంతా మీడియాలో రావడంతో కాంగ్రెస్ నాయకత్వం ఇరుకునపడింది.

ఇదీ..పోలీసుస్టేషన్ వరకూ వెళ్లిన ఓ మహిళా కాంగ్రెస్ బీసీ నేత గోడు. ఈఘటనపై అటు పోలీసులు ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. సామాజిక న్యాయం గురించి మాట్లాడే కాంగ్రెస్ నాయకత్వం కూడా, బీసీ మహిళా నేతపై అత్యాచారానికి పాల్పడ్డ రెడ్డి సామాజికవర్గ నేతపై.. ఇప్పటిదాకా పార్టీపరంగా కూడా చర్యలు తీసుకోకపోవడం మరో విచిత్రం. చివరకు బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుకోపాల్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. అయితే.. ఈ ఘటనపై నిజనిర్థారణ కమిటీ వేశానని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్‌గౌడ్ మే 12న ప్రకటించినప్పటికీ, ఆ నివేదిక ఏమయిందన్నది ఇప్పటివరకూ వెల్లడించకపోవడం మరో ఆశ్చర్యం.

కాగా కాంగ్రెస్ పార్టీలో బీసీల గురించి గళం విప్పే వి.హన్మంతరావు, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, మహేష్‌గౌడ్ వంటి సీనియర్లు కూడా ఈ ఘటనపై టీపీసీసీ నాయకత్వాన్ని నిలదీయకపోవడం మరో ఆశ్చర్యం. ‘ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి కిరణ్‌కి ఫోన్ చేసి, నాకు జరిగిన అన్యాయం గురించి వివరించి, రేవంత్‌రెడ్డిగారి అపాయింట్‌మెంట్ గురించి అడిగా. ఆధారాలన్నీ వాట్సాప్‌లో పంపించా. కానీ స్పందన లేదు. చివరకు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్‌కూ ఫిర్యాదు చేశా. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి గారికి చెప్పినా ఇప్పటిదాకా చర్యలు లేవు. మహేష్‌గౌడ్ గారికి చెబితే నాపై సానుభూతి చూపారే తప్ప, ఎలాంటి ఫలితం లేదు. నిజనిర్థారణమిటీ వేశానని ప్రెస్‌కు చెప్పారు. మరి దానిపై చర్యలేమిటో చెప్పలేదు. బహుశా నాపై అత్యాచారం చేసింది రెడ్డి సామాజికవర్గానికి చెందిన వాడయినందున, నేను బీసీని కాబట్టి ఫిర్యాదు చేసి ఏడాదయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదనుకుంటా’నని బాధితురాలయిన మహిళా కాంగ్రెస్ నేత ఆవేదన వ్యక్తం చేశారు.

తనపై అనాగరికంగా దాడి చేసి, గాయపరిచి అత్యాచారం చేసి, నా ఫోన్లు కూడా పగలకొట్టిన నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు శివకుమార్‌రె డ్డిని శిక్షించకపోతే.. కాంగ్రెస్‌లో బీసీలకు ముఖ్యంగా మహిళలకు న్యాయం జరగదని, రెడ్లకు తప్ప కాంగ్రెస్‌లో మరే వర్గానికి స్థానం ఉండదన్న విషయం నిజమవుతుందని ఆమె వ్యాఖ్యానించారు.

విచారిస్తున్నాం: పంజగుట్ట సీఐ
కాగా ఈ ఘటనపై పంజాగుట్ట ఇన్స్‌పెక్టర్ వివరణ కోరగా, ‘బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. ఆమె నుంచి కొన్ని ఆధారాలు అడిగితే కొన్ని ఇచ్చింది. దానిపై విచారణతోపాటు.. అసలు అప్పుడు ఏం జరిగిందో తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించాం. అంటే వాళ్లు వెళ్లిన హోటళ్లకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకుంటాం. మా కోణంలో మేం విచారిస్తున్నాం’ అని వివరించారు.

అందుబాటులో లేని చిన్నారెడ్డి
కాగా ఈ ఘటనపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి స్పందన కోరేందుకు అనేకసార్లు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు.

చర్యలు బడుగులపైనేనా.. రెడ్లకు వర్తించవా?
కాగా, ఇటీవల ఒక చిన్న అంశంపై దళిత నేత అద్దంకి దయాకర్‌పై చర్యలు తీసుకున్న టీపీసీసీ నాయకత్వం.. ఒక బీసీ మహిళా నేత, తనపై స్వయంగా జిల్లా పార్టీ అధ్యక్షుడే అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసి ఇన్నాళ్లవుతున్నా ఆయనపై చర్యలు తీసుకోకపోవడంపై పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. బాధితురాలు ఫిర్యాదు చేసింది రెడ్డి వర్గ నేతపై అయినందున, పీసీసీ నాయకత్వం చర్యలకు వెనుకాడుతోందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

LEAVE A RESPONSE