తెలంగాణ ఆకాంక్షలు మిగిలే ఉన్నాయి

182

మా భూములు మాకే, మా నీళ్లు మాకే, మా వనరులు మాకే, మా ఉద్యోగాలు మాకే అంటూ సాగిన సాగిన తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవ, స్వయంపాలన ప్రధాన సూత్రాలుగా ప్రజలకు బోధించి ఎన్నో త్యాగాలతో, ఎందరో ప్రాణ త్యాగాలతో తెలంగాణ సాధించుకొని ఎనిమిదేండ్లు దాటినా తెలంగాణ ఆశలు, ఆకాంక్షలు నెరవేరలేదు. తెలంగాణ సాధించుకొని ఏమున్నది గర్వకారణం అని ప్రజలు వారి ఆక్రోశాన్ని వెళ్లగక్కే స్థితిలో తెలంగాణ సమాజం వుంది. గారడి మాటలతో జూటా వాగ్దానాలతో ప్రలోభ రాజకీయాలతో పాలన కొనసాగుతుంది.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ప్రజా సంఘాలు కెసిఆర్ విధానాలను విభేదిస్తూనే తెలంగాణ కోసం ఉద్యమించారు. లోపాయికారిగా సీమాంద్ర పారిశ్రామికవేత్తలతో కెసిఆర్ పెట్టిన సమావేశాలను కూడా అడ్డుకొని నిరసన తెలిపిన చరిత్ర మరువరానిది. అప్పటి అధికార పార్టీతో రాజీపడి ఉద్యమాన్ని నీరు గారుస్తున్న కెసిఆర్ ను గమనించిన యువత ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. యువత శవాలతో ఊరేగింపులు చేసి కూడా కేసిఆర్ లబ్ధిపొందారు. ఉద్యమ పార్టీ అని చెపుతున్న టిఆర్ఎస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం కరువైందని, పార్టీ నిర్మాణంలో సబ్బండ వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం లేదని, ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే తెలంగాణలో ఎలా ఉంటుందని, తెలంగాణ వస్తే మెజార్టీ ప్రజలైన దళిత బహుజనలుకు ఏమి మేలు జరుగుతుందో టిఆర్ఎస్ తెలపాలని మేధావులు, ఉద్యమ నాయకులు ఆనాడే ప్రశ్నించారు. ప్రజాస్వామ్య తెలంగాణ ఏర్పడతదా? సామాజిక తెలంగాణ ఏర్పడతదా? అని లేవనేత్తిన ప్రశ్నలకు తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ లాంటి వాళ్ళు అప్పటి ఉద్యమ నాయకులకు సర్ది చెప్పారు. సింగిల్ పాయింట్ తెలంగాణ కోసం, భౌగోళిక తెలంగాణ కోసం మాత్రమే పోరాడుదామని, సామాజిక తెలంగాణ, ప్రజాస్వామ్య తెలంగాణ అంశం ముందుకు తీసుకొస్తే తెలంగాణ ఉద్యమానికి నష్టం జరుగుతుందని హితువు పలికారు. తెలంగాణ సాధించాక సామాజిక తెలంగాణ గురించి ఆలోచన చేద్దామని సర్ది చెప్పిన చాలామంది మేధావులు ప్రభుత్వంలో పదవులు తీసుకొని సామాజిక తెలంగాణతో పాటు సబ్బండ వర్గాల సమస్యలను, అభివృద్ధిని వొదిలేశారు.

ఎనిమిదేండ్లలో ఏడుపే మిగిలింది
ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలేవి నెరవేరక పోగా సీమాంధ్ర పాలనకన్నా అద్వాన్నంగా తయారై గడిచిన ఏడేళ్లలో దోపిడి రెట్టింపై తెలంగాణ ప్రజలకు ఏడుపే మిగిలింది. ఉద్యమ సమయంలో మేధావులు, విద్యావంతులు బోధించిన బోధనలు, కెసిఆర్ చేసిన వాగ్దానాలు ఏవి నెరవేర్చలేదు. తెలంగాణలో మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితున్ని చేస్తానని దళితుడైన ఉప ముఖ్యమంత్రి రాజయ్యను అకారణంగా తొలిగించాడు. కెజి నుండి పిజి వరకు ఉచిత విద్య అని వాగ్ధానం చేసి ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థలు మూసివేసి కెజి నుండి పిజి వరకు ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించడానికి ఏకంగా ప్రైవేట్ విశ్వ విద్యాలయాను ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకు విద్యను అందని ద్రాక్షగా మార్చారు. గత ఇదేండ్లుగా ఇంటర్ కాలేజీలు మొదలుకొని వృత్తి విద్యా, ఉన్నత విద్య కోర్సులు చదువుతున్న వారికి ఫీజ్ రీఎంబెర్స్ మెంట్ లు, విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్ లను చెల్లించకుండా పేద విద్యార్థుల భవితవ్యాన్ని నాశనం చేస్తున్నాడు. డబల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో ఉన్న గుడిసెలను పీకి పేద ప్రజలను రోడ్డున పడేసారు. మిషన్ భగీరథ పేరుతో కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని కొల్లగొట్టడమే కాకుండా నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగనని చెప్పిన కెసిఆర్ ఏకంగా ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడు. ఇంటికో ఉద్యోగం అని మాట్లాడిన కెసిఆర్ నేనెప్పుడన్నానని మాట మార్చాడు. నియామకాలకు కేటాయించాల్సిన నిధులన్ని నీళ్లకు ఖర్చు చేసి సీమాంధ్ర కాంట్రాక్టర్లకు తెలంగాణ సొమ్ము దోచి పెట్టి దోపిడిలో బాగస్థులై నిరుద్యోగులకు తీరని అన్యాయం చేసారు. నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికల వాగ్దానం చేసిన కెసిఅర్ ఆ విషయాన్ని గాలికొదిలేశాడు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న యువత నేడు ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నా కెసిఆర్ లో చలనం లేదు, స్పందన లేదు.

తెలంగాణ వస్తే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పదాలే వినపడకూడదని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను పర్మినెంట్ చేస్తానని చెప్పిన కెసిఆర్ గత 10 ఏండ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను అలానే వదిలేసాడు. దళితులకు మూడెకరాల భూమి పథకాన్ని అటుకెక్కించిన కెసిఆర్ దళిత బందుకు నిధులు ఎక్కడినుండి తెస్తాడు? ఆచరణ సాధ్యం కానీ హామీలిస్తున్నట్లు తెలంగాణ ప్రజలు గమనించారు కాబట్టే హుజురాబాద్ లో ఓడించారు. చేస్తున్న అప్పులకు జవాబుదారీతనం లేకుండా ప్రశ్నించిన వారిని సన్నాసులని, వాడోడు ఈడోడు మోపైయిండ్లని అహంకారపూరిత మాటలు మాట్లాడుతున్న కెసిఆర్ కు భవిషత్ లో సరైన జవాబు చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు. ఉద్యోగాల కల్పనను గాలికొదిలేసిన కెసిఆర్ మెజార్టీ ప్రజలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడంలో ఉద్దేశపూర్వకంగానే అశ్రద్ధ చేస్తున్నాడు. కెసిఆర్ గత ఎనిమిదేండ్లుగా ఎలాంటి ఉపాధి కల్పన లోన్లు మంజూరు చేయలేదు. ఆయా వృత్తులకు సంబంధించిన కార్పోరేషన్లకు రూపాయి కూడా విడుదల చేయలేదు.

ఆర్ టి సి కార్మికుల ఉసురు తీసిన కెసిఆర్ ఏకంగా కార్మిక సంఘాలనే లేకుండా చేశారు. విద్యా వాలంటరీలను, మిషన్ భగీరథ ఉద్యోగస్తులను తొలిగించి రోడ్డున పడేసాడు. 70 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలిగించి వారిని రోడ్డున పడేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఉద్యమ సమయంలో ప్రతి ఆత్మ బలిదానాన్ని రాజకీయ మైలేజీకి వాడుకున్న కెసిఆర్ నేడు నిరుద్యోగ బలిదానాలపై కనీసంగా స్పందించకపోవడాన్ని తెలంగాణ సమాజం తీవ్రంగా భావించింది. ఎస్టీలకు 10 శాతం, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అని చెప్పి వాళ్ళ ఓట్లతో గద్దెనెక్కిన కెసిఆర్ ఆ ముచ్చటే మరిచారు. ప్రభుత్వ వైద్య రంగంలో నియామకాలను ప్రకటనలకే పరిమితం చేసిన కెసిఆర్ ప్రేవేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన ఆరోగ్య శ్రీ బిల్లులను చెల్లించకుండా ప్రజారోగ్య వ్యవస్థను గతముకన్నా క్షీణింపజేయడంతో వైద్యం అందని పేదలు ప్రాణాలు వొదులుతున్నారు.

మద్యం అమ్మకాలను పెంచి ప్రజల ధనాన్ని లూటీ చేసినంత శ్రద్ధ విద్య, వైద్య రంగాలపై పెట్టకపోవడాన్ని కూడా ప్రజలు గమనించారు. సీమాంధ్ర కాంట్రాక్టర్లకు ముందస్తు చెల్లింపులు చేస్తూ తెలంగాణ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో స్థానిక కాంట్రాక్టర్లు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు బంధు పేరుతో సంపన్న రైతులకు మేలు చేస్తూ సన్న చిన్నకారు రైతులను, కౌలు రైతులకు తీరని అన్యాయం చేయడంతో గతముకన్నా రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. కమీషన్ల కోసం భారీ ప్రాజెక్టులు కట్టించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి భవిషత్ కు ఉపయోగపడే విలువైన భూములను అమ్మడమే కాకుండా సామర్థ్యం గల చారిత్రక కట్టడాలను, సెక్రెటరియేట్ లను కూల్చి ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కెసిఆర్ మోసాలు చాంతాడంత అవుతాయి.

మొత్తంగా రాష్ట్రం అప్పుల పాలవడమే కాకుండా రాష్ట్ర ప్రజల ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఒకనాడు నక్సలైట్ల మద్దతుతో ఎన్నికల్లో గెలిచిన కెసిఆర్ నక్సలైట్ల ఎజెండే నా ఎజెండా అని చెప్పి తెలంగాణ రాగానే నక్సలైట్ ఉద్యమాన్ని తీవ్రంగా అణచివేశారు. శృతి, సాగర్ లను పట్టుకొని కాల్చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం నేటికి ఎన్కౌంటర్లతో పాలన కొనసాగిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో ప్రజా సంఘాల, సామాజిక సంఘాల శక్తిని చూసిన కెసిఆర్ గద్దెనిక్కన తర్వాత ఆయా సంఘాలను నిలువునా చీల్చి చీలిక వర్గాలకు పదవులు కట్టబెట్టాడు. తెలంగాణలో నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి పోరాటం చేసిన త్యాగాల చరిత్ర కలిగిన కమ్యూనిస్టు పార్టీల ముఖ్య నాయకులను కూడా టిఆర్ఎస్ లోకి లాక్కొని బలహీనపరిచారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను అదిరించి, బెదిరించి తన పార్టీలో కలుపుకున్న కెసిఆర్ మొత్తంగా ప్రజల పక్షాన ఎవరు లేకుండా చేసి తన దోపిడి, నిరంకుశ పాలనను నిరాటంకంగా కొనసాగిస్తున్నాడు. ఉద్యమ సమయం నుండి నేటి వరకు ఎన్నికల్లో డబ్బు వెదజల్లడం, ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలను కొనుగోలు చేసి రాజకీయంగా గెలుస్తున్న కెసిఆర్ కు తెలంగాణ ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నారు.

తుది దశ తెలంగాణ పోరాటం కన్నా ముందునుండే తెలంగాణ లో భూస్వాములు, దొరలు, జాగీదార్ల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు జరిగాయి. ఆనాటి సాయుధపోరాటం నుండి నేటి నక్సలైట్ల పోరాటంలో ఎందరో అమరులయ్యారు. తెలంగాణ సాధనలో వీరి త్యాగాలు కూడా ప్రధాన భూమిక పోషిస్తాయి. ఒక దశలో అధికార కాంగ్రెస్ ను గ్రామాల్లోకి రానివ్వకుండా కట్టడి చేసి తెలంగాణ ఉద్యమానికి, టిఆర్ఎస్ గెలుపుకు నక్సలైట్లు అండగా నిలిచారు. నక్సలైట్లతో చర్చలు జరుపుతామని చెప్పిన కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తు పెట్టుకున్న టిఆర్ఎస్ కేంద్రంలో, రాష్టంలో మంత్రి పదవులు కూడ అనుభవించింది. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ చర్చల పేరుతో నక్సలైట్లను నమ్మించి నయవంచన చేసి ఎందరినో బూటకపు ఎంకౌంటర్లలో కాల్చి చంపింది. అలా ఎందరో త్యాగాలు చేస్తే ఏర్పడ్డ తెలంగాణలో నేడు పాలన ఫామ్ హౌస్ కు పరిమితమై ప్రజలు అల్లకల్లోలమవుతున్నారు.

తెలంగాణ ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించిన పాలకులు మాత్రం గద్దెనిక్కింది గుత్తా నేటి వరకు దోపిడి రాజకీయాల్లో మునిగి, సంపద పోగు చేసుకోవడమే ప్రధాన ఎజెండాగా పాలన కొనసాగిస్తున్నారు. ప్రజల పక్షాన నిలబడి కలబడే వాళ్ళు ఉండకూడదని ఉద్యమాలను అణచివేశారు. ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతులు ఉండకూడదని ప్రతిపక్షాలను కొన్నారు. ప్రజా సంఘాలను, కుల సంఘాలను చీల్చారు. ప్రజల ఓట్ల కోసం ప్రలోభ పెట్టే పథకాలను పెట్టి రాజకీయాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఉద్యమ సమయంలో, తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో వాగ్దానాలు చేసిన కెసిఅర్ ప్రభుత్వం వాటన్నిటినీ మరచిపోయింది. ఉద్యమ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీగా మారి ఫక్తు కుటిల రాజకీయాలు చేసుకుంటూ ప్రజల యోగ క్షేమాలు, విద్య, వైద్యం, ఉద్యోగ ఉపాధి మరిచారు. ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాలతో మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు.

ఉద్యోగాలు రాకుండానే నిరుద్యోగుల వయసు అయిపోయింది. రైతుల మరణాలు ఆగడంలేదు. చేనేతల వలసలు, ఆత్మహత్యలు ఆగలేదు. స్వయం పాలన అంటే అది కెసిఅర్ కుటుంబానికే పరిమితమైంది. ఆత్మగౌరవం కూడా ఉన్నోళ్లకు పరిమితమైంది. మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా ఆత్మగౌరవం లేకుండా పోయింది. మొదటినుండి తెలంగాణ కోసం పనిచేసిన వారికి అసలే ఆత్మగౌరవం లేకుండా పోయింది. విద్య అంటే అది సామాన్యునికి అందుబాటులో లేకుండా పోయింది. వైద్యం అందక కుప్పలు కుప్పలుగా చచ్చిపోతూ తెలంగాణ ఒక శవాల గడ్డ గా మారి స్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన కోసం ప్రభుత్వ ప్రణాళికలు శూన్యం. తెలంగాణ పాలకులకు ఎప్పుడు ఎన్నికల ధ్యాసతోనే జీవిస్తూ ఏ ఎన్నికల్లో ఎలా గెలవాలి, గెలిచిన ఇతర పార్టీల నాయకులను ఎట్లా కొనాలనే ధ్యాసలోనే నిత్యం మునిగితేలుతున్నారు.

బుద్ధిజీవుల చేతిలో తెలంగాణ భవిషత్
ఓ బుద్ధి జీవులారా, విద్యార్థి యోధులారా అమరులు కలలుగన్న తెలంగాణ కోసం మరో పోరాటాన్ని విజయవంతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. త్యాగధనులు కోరుకున్న తెలంగాణ కోసం బుద్ధి జీవులు, మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థి యోధులు రానున్న రోజుల్లో కీలకపాత్ర పోషించాల్సి వుంది. గత వంద ఏండ్లుగా తెలంగాణలో జరిగిన ఎన్నో విముక్తి పోరాటాల్లో మేధావులు, విద్యార్థి నాయకులు, కవులు, కళాకారులు కీలకపాత్ర వహించిన చరిత్ర గుర్తు చేసుకోవాలి. మేధావుల బోధనతో పీడిత ప్రజల విముక్తి కోసం పి.డి.ఎస్.యు నుండి మొదలుకొని ఆర్ ఎస్ యు వరకు ఎన్నో విద్యార్థి సంఘాలు ఉద్యమించాయి. నీలం రామచంద్రయ్య, జార్జిరెడ్డి, పులి అంజన్న, రంగవల్లి, జంపాల చంద్రశేఖర్, శేషగిరిరావు, కృష్ణారెడ్డి, పటేల్ సుధాకర్ రెడ్డి లాంటి ఎందరో విద్యార్థి నాయకులు ప్రాణ త్యాగాలు చేశారు. మారోజు వీరన్న లాంటి ఎందరో నాయకులు నూతన విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లారు. మరెందరో విద్యార్థి నాయకులు దేశ రాజకీయాలను ప్రభావితం చేసి నూతన విప్లవ పంథాతో పీడిత ప్రజల కోసం ప్రాణాలు అర్పించారు. నిజాం నిరంకుషాన్ని, దొరల పెత్తనాన్ని ఎదిరించి పోరాటం చేసి నిజాం ను గద్దె దించిన చరిత్ర తెలంగాణ బుద్ధిజీవులకు ఉంది.

పీడిత, తాడిత ప్రజల విముక్తికోసం ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాదించుకున్న బుద్ధిజీవుల, విద్యార్థి యోధులు సీమాంద్ర పాలనలో పాడుకున్న పాటలే తిరిగి పాడుకోవాల్సిన దుర్మార్గ పాలనలో కొనసాగడం సిగ్గుచేటు. ఓ అమరవీరులారా! విద్యార్థి యోధులారా! మా యుద్ధ వీరులారా! ఓ పొద్దుపొడుపులారా! మీరు కలలుగన్న తెలంగాణ వెలవెల బోతుంది. ఆశలన్నీ అడి ఆశలై వలపోతే మిగిలిందని పాడుకునే పాడు పాలన నేడు తెలంగాణలో కొనసాగుతుంది. స్వయం పాలనలోనే ఆత్మగౌరవంతో పాటు అభివృద్జి జరుగుతుందని ఆశించి అణగారిన ప్రజల బతుకుల విముక్తి కోసం విద్యార్థి, యువత ప్రాణాలను తృణప్రాయంగా చేసి సాధించిన రాష్ట్రంలో నేడు సీమాంద్ర పాలనకన్నా ఎక్కువ దోపిడీ, అణచివేత కొనసాగుతుంది. ప్రశ్నించే గొంతులను, ఉద్యమకారులను, మేధావులను తీవ్రంగా నిర్బంధించి నిరంకుశ పాలన కొనసాగుతుంది. పెద్ద చదువుల కోసం పట్నం బాట పట్టిన ఎందరో విద్యావంతులు మేధావుల బోధనలతో ప్రజల కష్టాలను చూసి పోరాట బాటలో నడిచి త్యాగాలు చేసి, బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాధిస్తే అధికారం కొంతమందికి, పదవులు కొంతమందికి రాగా ఉద్యమ ద్రోహులు, దోపిడీ దొంగలు మంత్రులైనారు. గోతులు తవ్వే నక్కలన్నీ ఒక్కటై సీమాంధ్ర పెట్టుబడిదారులతో కుమ్ముక్కై తెలంగాణను దోచుకుంటున్నారు. నియామకాలకు పెట్టాల్సిన నిధులన్నీ నీళ్ల పేరున సీమాంధ్ర కాంట్రార్లకు దోచిపెడుతున్నారు. ఇంటికొక ఉద్యోగమని చెప్పిన హామీలన్నీ నీటి మూటలయ్యాయి. రాష్ట్రం వస్తే యువతకు ఉద్యోగాలొస్తాయని బలిదానాలు చేసుకున్న యువత నేడు రాష్ట్రం వచ్చాక కూడా ఉద్యోగాల కోసం బలిదానాలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గిట్టుబాటు ధర లేక అప్పులపాలవుతున్న సన్న, చిన్నకారు రైతులు ప్రాణాలు వొదులుతున్నారు. త్యాగధనుల కుటుంబాలకు దుఃఖం, పోరాటయోదులకు కేసులు మిగలగా కెసిఆర్ కుటుంబానికి మాత్రం కొలువులు వచ్చాయని తెలంగాణ ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నా చలించని పాలన నశించాలాని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.

తెలంగాణలో దోపిడి, నిరంకుశ పాలన పరాకాష్టకు చేరిన సందర్భంలో మేధావులు, బుద్ధిజీవులు, కవులు, కళాకారులు, విద్యార్థులు కీలకపాత్ర వహించాల్సిన అవసరం చాలా ఉంది. త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో రోజురోజుకు పెచ్చుమీరుతున్న నిరంకుశ పాలనను కట్టడి చేయాల్సిన అవసరాన్ని బుద్ధిజీవులు గుర్తించాలి. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేయడం, ఓటర్లకు డబ్బులు ఇవ్వడం, ఎన్నికల ముందు రైతు రుణ మాఫీ లాంటి హామీలు ఇవ్వడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడు నాంది పలుకగా, చంద్రబాబు శిష్ష్యుడిగా శిక్షణ పొందిన కెసిఅర్ ఎన్నికల్లో డబ్బులు వెదజళ్లడం ద్వారా గెలుపొందుతామని ఇప్పటివరకు నోట్ల రాజకీయాలు చేస్తూ వస్తున్నాడు. తెలంగాణ వచ్చిన తరువాత జరిగిన రెండు సాధారణ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున డబ్బు వెదజల్లి గెలుస్తూ వస్తుంది. అంతేకాక ప్రజల పక్షాన నిలబడి కలబడే ప్రజా సంఘాలను చీల్చడం, నిర్బంధించడంతో పాటు ప్రతిపక్ష నాయకులను అదిరించి, బెదిరించి కొనుగోలు చేయడం ద్వారా తనకు ఎదురులేని రాజకీయ వ్యవస్థను నిర్మించుకుని ఫామ్ హౌస్ నుండి పాలన కొనసాగిస్తున్న కెసిఆర్ కు బుద్ధి చెప్పాల్సిన అవరముంది. తీవ్రవాద రాజకీయాలకు తెగబడ్డ కెసిఆర్ ను కట్టడి చేయకుంటే రానున్న రోజుల్లో ప్రజలంతా ప్రజాస్వామ్య బానిసత్వంలోకి నెట్టబడుతారు. రాజనీతిజ్ఞులు, బుద్ధిజీవులు పుష్కలంగా ఉన్న మన దేశంలో రాజనీతిజ్ఞులు రాజకీయాల వైపు రాకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ప్రభుత్వాల బలం ఎప్పుడూ ప్రజల అజ్ఞానంలో వుంటుంది. అందుకే ప్రజల్లో నిజమైన జ్ఞానాన్ని ఇవి వ్యతిరేకిస్తాయి. ఈ సత్యాన్ని బుద్ధిజీవులు గుర్తించాల్సిన సమయమిదే. ప్రజల్లో అజ్ఞానాన్ని వ్యాప్తి చేస్తూ, పథకాలతో ప్రలోభాలకు గురిచేస్తూ, ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి అభివృద్ధి మరచిన ప్రభుత్వాలను అలాగే వదలి వేయడం అత్యంత హానికరం.

ఇంతటి ఉద్యమ చరిత్ర కలిగిన తెలంగాణ లో రాజ్యాంగ బద్దంగా ఎన్నో చిక్కులను ఛేదించి తెలంగాణ సాధించుకున్న ప్రజలకు నేడు కెసిఆర్ రాజ్యాన్ని కూల్చడం పెద్ద విషయమేమి కాదు. వందలాది మంది మేధావులు, ప్రగతిశీల అభ్యుదయ వాదులు ఈటలకు మద్దతు పలికి ప్రజాస్వామిక తెలంగాణ స్థాపనలో భాగమవడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలకపాత్ర పోషించిన యోధులు సర్ధార్ సర్వాయి పాపన్న, కొమరం భీమ్, సోయం గంగులు చాకలి ఐలమ్మ, షేక్ బందగి, బత్తిని మొగిలయ్య గౌడ్, దొడ్డి కొమురయ్య, నల్ల నర్సింహులు, యాదగిరి, టాను నాయక్, ఈశ్వరిబాయి, సదా లక్ష్మి, బెల్లి లలిత, బి.ఎన్ రెడ్డి, మారోజు వీరన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ మద్దికాయల ఓంకార్, కేశవరావు జాధవ్, కె.జి. సత్యమూర్తి, కొల్లూరి చిరంజీవి, బి.ఎస్ వెంకట్రావు, అరిగె రామస్వామి, దర్గ్యా నాయక్, ప్రొఫెసర్ జయశంకర్, బియ్యాల జనార్దన్, బుర్ర రాములు, శ్రీకాంత చారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదన్న, భూపతి కృష్ణమూర్తి, సంగంరెడ్డి సత్యనారాయణ, ఆమోస్, కాళోజి, తిప్పని సిద్ధులు, నలిగింటి చంద్రమౌళి, పురుషోత్తమ రావుల లాంటి వారసులుగా తెలంగాణ ప్రజలు బరిగీసి కొట్లాడి ప్రజాస్వామిక తెలంగాణను సాధించుకోవడానికి సిద్ధమవ్వాలి.

ఎవరో వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా… అన్నట్లు చిత్తశుద్ధి, అంకితభావం కలిగి ప్రజల పట్ల సేవా దృక్పధంగలవారు, నిజాయితిగల ఉద్యమకారులు, యువకులు, విద్యావంతులు, బుద్ధి జీవులు, రాజనీతిజ్ఞులు త్యాగధనులు యుద్ధానికి సిద్ధం కావాల్సిన చారిత్రక సందర్భం. ఉద్యమ సంస్కారం కలిగిన ప్రజలు ఆనాడు కెసిఆర్ ను విశ్వశించడం తప్పుకాదు. రాష్ట్రంలో నేడు నెలకొన్న ప్రమాదపు పాలనను నివారించాల్సిన గురుతర బాధ్యత కూడా తెలంగాణ సమాజంపైనుంది. పాలనలో ప్రజాస్వామిక సంస్కరణ కోసం ప్రజాస్వామిక వర్గాల నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు బలపరచి బరిగీసి కొట్లాడాల్సిన నేటి అవసరాన్ని గుర్తుంచాలి.

– సాయిని నరేందర్
సామాజిక విశ్లేషకులు
9701916091