Suryaa.co.in

Telangana

టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదు

– తెరాస, బీజేపీ ఇద్దరూ స్నేహితులే
– టీఆర్ఎస్‌ను బీజేపీ రిమోట్‌తో నడిపిస్తోంది
– తేల్చివేసిన రాహుల్

తెరాస తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారాన్ని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఖండించారు. టీఆర్‌ఎస్‌‌తో పొత్తు ఉండదని ఆయన తేల్చిచెప్పారు. రైతు సంఘర్షణ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏ ఒక్కరి వల్ల రాలేదని తెలిపారు. గత 8 ఏళ్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను వంచించిందన్నారు. తెలంగాణ ఏర్పాటు వల్ల ఒక్క కుటుంబానికే మేలు జరిగిందని తెలిపారు. యువకుల కలతోనే తెలంగాణ ఏర్పాటు చేశామని తెలిపారు.

ప్రజల పోరాటం వెనుక కాంగ్రెస్ ఉందన్నారు. పార్టీకి నష్టం జరిగినా తెలంగాణకు న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ అధినేత సోనియా ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం కాక.. ఓ రాజులా సీఎం కేసీఆర్‌ పరిపాలిస్తున్నారని తప్పుబట్టారు. సీఎం ప్రజల మాట వింటాడు.. రాజు తన మనసులో ఏముందో అమలుచేస్తాడని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల సమయంలో రెండు వాగ్ధానాలు ఇచ్చి అమలు చేశామని గుర్తుచేశారు. ఛత్తీస్‌గఢ్‌లో రైతుల అభిప్రాయానికి పెద్దపీట వేశామని రాహుల్ చెప్పారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించారు. వరంగల్ డిక్లరేషన్‌ ప్రకటన కాదు.. కాంగ్రెస్‌ పార్టీ గ్యారంటీ అని స్పష్టం చేశారు. డిక్లరేషన్‌ అమలు కాంగ్రెస్‌ పార్టీ బాధ్యత అని చెప్పారు. టీఆర్‌ఎస్‌, బీజేపీలతో లోపాయికారిగా పనిచేసేవాళ్లు తమకవసరం లేదని తేల్చిచెప్పారు. టీఆర్ఎస్‌ని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలను మోసం చేసినవాళ్లను ఊరికి వదలబోమని రాహుల్ హెచ్చరించారు.

కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ సీరియస్ వార్నింగ్‌ ఇచ్చారు. ప్రజలకు ఎవరు దగ్గరగా ఉంటారో వారికే టికెట్‌ ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ విధానాలు, సిద్ధాంతాలు విమర్శించేవారిని ఎంత పెద్దవారైనా సహించమని హెచ్చరించారు. తెరాస, బీజేపీ ఇద్దరూ స్నేహితులేనని విమర్శించారు. పార్లమెంట్‌లో ఒకరికొకరు సహకరించుకుంటున్నారని, తెలంగాణలో టీఆర్ఎస్‌ను బీజేపీ రిమోట్‌తో నడిపిస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు.

LEAVE A RESPONSE