– తెలంగాణలో కమలవికాసం కష్టమేనా?
– ప్రత్యర్ధి పార్టీల పోటీని తట్టుకునే అభ్యర్ధులే కష్టం
– కాంగ్రెస్‌లో పెరిగిన కదనోత్సాహం
– బీజేపీ రెడ్డినేతలు కాంగ్రెస్‌లోకి
– బీజేపీని అర్ధం చేసుకోవడంలో కొత్త నేతలు విఫమవుతున్నారా?
– కొత్త నేతలను అర్ధం చేసుకోవడంలో బీజేపీ విఫలమవుతోందా?
– వలస నేతలను హామీలిచ్చే స్థాయి నేతలేరీ?
– పదవులపై హామీలిస్తేనే వస్తామంటున్న వలస నేతలు
– ఆ హామీ ఇచ్చే స్థాయిలేని తెలంగాణ బీజేపీ నాయకత్వం
– బీఆర్ఎస్తో దోస్తీ ఉందన్న భావనే బీజేపీలో చేరడానికి అడ్డంకులు
– కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలే తప్ప చర్యలు తీసుకోని వైఖరిపై అనుమానాలు
-అసలు ఫిరాయింపుల ప్రోత్సాహానికి కమిటీ ఏమిటి?
– కమలంలో గతంలో లేని కొత్త సంప్రదాయం
– చేరికలు చతికిలపడేందుకు కారణాలు కోకొల్లలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
కొద్దికాలం క్రితం వరకూ తెలంగాణ కమలంలో కనిపించిన చేరికల ఉత్సాహం.. ఇప్పుడు భూతద్దం వేసి వెతికినా కనిపించడం లేదు. పైగా కోటి ఆశలతో ఇతర పార్టీల నుంచి చేరిన అగ్రనేతలు, వచ్చినంత
వేగంగా వెనక్కివెళ్లిపోవడం, కొత్తవారు చేరే అవకాశాలు సమీప భవిష్యత్తులో కనిపించకపోవడంతో, చేరికల ప్రక్రియ చతికిలపడినట్టయింది. కర్నాటకలో కాంగ్రెస్ ఘనవిజయం దానికితోడయి, బీజేపీలో చేరే వారి ఆలోచనలకు బ్రేకులు వేసింది. చేరికలు లేకపోగా.. ఉన్న అగ్రనేతలు కూడా పక్కచూపులు చూసే పరిస్థితి గమనిస్తే.. తెలంగాణలో కమలవికాసం కష్టమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీలో చేరాలని భావించిన మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మనసుమార్చుకుని, కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయించుకోవడం బీజేపీ ఆశలపై నీళ్లుచల్లినట్టయింది. వారిద్దరితో బీజేపీ అగ్రనేతలు మంతనాలు సాగించినప్పటికీ, వారికి సరైన హామీలు ఇవ్వడంలో వారు విఫలమయినట్లు సమాచారం. దానితో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగి, కోమటిరెడ్డి, మల్లు రవి వంటి అగ్రనేతల కలసి వారితో చర్చలు నిర్వహించడం.. కాంగ్రెస్‌లో చేరేందుకు వారిద్దరూ అంగీకరించడం చకాచకా జరిగిపోయాయి. దానితో నోరెళ్లబెట్టడం బీజేపీ వంతయింది.
నిజానికి బీజేపీది విచిత్రమైన రాజకీయ విధానం. దానిని కొత్త వారు అర్ధం చేసుకోవడం కష్టం. అదే సమయంలో వారిని అర్ధం చేసుకోవడంలో , అటు బీజేపీ నాయకత్వం కూడా విఫలమవుతోంది. ఈ సైద్ధాంతిక ఘర్షణలో చివరాఖరకు, బీజేపీనే నష్టపోతున్న పరిస్థితి. అయినా కూడా పార్టీ తన విధానం, నేతల పట్ల తన వైఖరి మార్చుకోకపోవడమే ఆశ్చర్యం.
ఒకప్పుడు కార్యకర్తల ఇళ్లలో భోజనాలు చేసి, బస్సులో వెళ్లిన సంఘ నేతలు.. ఇప్పుడు విమానాల్లో తిరుగుతూ, స్టార్హూటళ్లలో బస చేసేంత స్థాయిలో అప్డేట్ అయ్యారు. ఇప్పుడు ఏ సంఘ్ నేత కూడా సామాన్య జీవితం గడపడం లేదు. అంతా ఆధునిక జీవితమే అనుభవిస్తున్నారన్న విమర్శ లేకపోలేదు. చాలామంది సంఘ్ అగ్రనేతలు పెద్ద ఎత్తున భూములు కొని, సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారన్న ప్రచారం కూడా లేకపోలేదు. కానీ వారంతా ..పార్టీ మాత్రం అప్డేట్ కావాలని కోరుకోకపోవడమే, విచిత్రంగా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా చేసిన వారితోపాటు.. వివిధ పార్టీల్లో కీలకపాత్ర పోషించి, దశాబ్దాల పాటు చక్రం తిప్పిన అగ్రనేత లు బీజేపీలో ఎక్కువ అంచనాలతో చేరుతున్నారు. తాము విడిచి వచ్చిన పార్టీలో మాదిరిగానే.. బీజేపీలో కూడా తమకు ప్రాధాన్యం కావాలని కోరుకుంటున్నారు.
కానీ పార్టీలో చేరిన తర్వాత వారి ఆశలు.. నెరవేరే సూచనలు కనిపించకపోవడంతో, తిరిగి వెనక్కి వెళ్లిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. కొత్తగా బీజేపీలో చేరాలనుకునే నేతలు, తమకు కీలకమైన పదవులు ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వానికి షరతులు పెడుతున్నారు. తమతో వచ్చిన వారికీ పదవులు ఇవ్వాలని కోరుతున్నారు.
అయితే కొత్తగా చేరాలనుకున్న డిమాండ్లకు సంబంధించి, నిర్దిష్ట హామీ ఇచ్చే అధికారం రాష్ట్ర నాయకత్వానికి లేకపోవడం, మరో పెద్ద మైనస్ పాయింట్‌గా చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సంఘటనా మంత్రి, కేంద్రమంత్రి, రాష్ట్ర ఇన్చార్జిలకు ఎలాంటి అధికారాలు లేకపోవడంతో.. వలస నేతలకు వారు ఎలాంటి హామీ ఇవ్వలేకపోతున్నారు.
‘‘ముందు పార్టీలో చేరి పనిచేయండి. తర్వాత చూద్దాం. మా పార్టీలో హామీలు ఉండవు. పనిచేస్తూ పోవడమే. అవకాశం వచ్చినప్పుడు చేద్దాం. ముందు మీరైతే మీ నియోజకవర్గాల్లోకి వెళ్లి పనిచేసి మీ సమర్ధత నిరూపించుకోండి’’ అన్న హితబోధలు, కొత్తగా చేరాలనుకునే వారికి తరచూ వినిపిస్తుంటాయి.
దానితో ఏ దిక్కూ లేని వారు తప్పక బీజేపీలో చేరుతుండగా.. స్థానికంగా బలం, ఇమేజ్ ఉన్న నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వారికి హామీలివ్వడమే దానికి కారణం.
దానితో బీజేపీ రాష్ట్ర నాయకత్వం నుంచి సరైన హామీ లేక, ఢిల్లీలో జాతీయ నేతలతో పరిచయం లేక అనివార్య పరిస్థితిలో, చాలామంది కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన సీనియర్లు విశ్లేషిస్తున్నారు. పైగా ఇతర పార్టీల్లో ఒక వెలుగు వెలిగిన వారు, బీజేపీలో అనామకుల్లా మారిన వైనం కూడా చర్చనీయాంశంగా మారింది.
టీడీపీలో కీలకనేతగా ఉన్న నాగం జనార్దన్‌రెడ్డికి, పార్టీ ఆఫీసులో ప్రెస్మీట్లు పెట్టుకోవడానికి కూడా అనుమతి లేని పరిస్థితిలో, ఆయన ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టుకోవలసిన దుస్థితి ఏర్పడింది.
మంత్రులుగా పనిచేసిన మోత్కుపల్లి, పెద్దిరెడ్డి, ఎమ్లెల్యే ఎమ్మెల్సీలుగా పనిచేసిన స్వామిగౌడ్, భిక్షమయ్యగౌడ్, దాసోజు శ్రవణ్ వంటి వారంతా వెనక్కి వెళ్లిపోవడానికి కారణం.. వారికి సరైన గౌరవం
లభించకపోవడమేనని బీజేపీ నేతలు చెబుతున్నారు.
రాష్ట్ర-జాతీయ స్థాయిలో పనిచేసిన సీనియర్లు, పదవులు ఆశించడం సహజం. కానీ బీజేపీలో అటు పార్టీ పదవులు గానీ, ఇటు నామినేటెడ్ పదవులు గానీ ఇవ్వకపోవడంపై అసంతృప్తి నెలకొంది. రాష్ట్ర అధ్యక్షుడు-సంఘటనా మంత్రి, రాష్ట్ర ఇన్చార్జి భేటీ అయి.. జిల్లాల నుంచి పార్టీ నేతల పేర్లు తీసుకుని, వారికి కేంద్ర నామినేటెడ్ పదవులు సిఫార్సు చేయడంలో విఫలమయ్యారన్న విమర్శలు కూడా లేకపోలేదు. అసలు ఆ ముగ్గురి మధ్యనే సమన్వయం లేదన్న విమర్శలున్నాయి, రాష్ట్రానికి ముగ్గురు ఇన్చార్జిలు ఉన్నప్పటికీ, చేరికలు ఎందుకు చతికిలపడుతున్నాయో అర్ధం కావడం లేదని, తొలి నుంచీ పనిచేస్తున్న బీజేపీ నాయకులు వాపోతున్నారు.
అయితే కొత్త వారిని అర్ధం చేసుకోవడంతోపాటు, ఆధునిక రాజకీయాలకు బీజేపీ నాయకత్వం దూరంగా ఉండటం కూడా, చేరికలు ఆగిపోవడానికి ప్రధాన కారణమని కొత్తగా చేరిన వారు విశ్లేషిస్తున్నారు. పాతకాల మనస్తత్వం, ఈ కాలానికి తగినట్లు అప్డేట్ కాని ఆరెస్సెస్ నేతలు.. ప్రాంతీయ పార్టీలకు సమానంగా బీజేపీని నడిపించడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు లేకపోలేదు.
‘రాజకీయ నేతలెవరూ స్వార్ధం లేకుండా పార్టీల్లో చేరరు. ఏదో ఆశించే చేరతారు. కానీ బీజేపీ మాత్రం తాను అందరికీ భిన్నం అనుకుంటుంది. రాజకీయాల్లో ఉంటూ రాజకీయాలు చేయాలి కదా? సంఘ్ వాళ్లు దయతలిస్తేనే పదవులు వస్తాయి. వాళ్లు మమ్మల్ని రోజూ శీలపరీక్ష చేస్తారు. ఎంతకాలం దానిని భరించాలి? ఎంతకాలం మా విశ్వసనీయత నిరూపించుకోవాలి? అవతల పార్టీలో రాజకీయ
అవకాశాలున్నప్పుడు చేరకుండా, ఏమీ చేయని బీజేపీలో ఉండి లాభం ఏమిటన్న ప్రశ్న సగటు రాజకీయ నేతలకు వస్తుంది కదా? పోనీ చేరిన వారికి ఏమైనా గౌరవం ఇచ్చి, బాధ్యతలు అప్పగిస్తారా అంటే అదీ లేదు. అలాంటప్పుడు బీజేపీలో తొలి నుంచీ ఉన్నవాళ్లు తప్ప, కొత్తగా వచ్చిన వారు మనుగడ సాగించలేర’ని ఓ నేత తన అనుభవాన్ని వెల్లడించారు.
కొత్తగా చేరిన వారిని.. బీజేపీలో సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతున్న వారు, తమంతట తామే వెళ్లిపోయేలా చేస్తారన్న విమర్శలకు, పార్టీ నాయకత్వం ఇప్పటివరకూ తెరదించకపోవడం మరో ఆశ్చర్యం. ఆరెస్సెస్ కూడా బీజేపీలో తొలి నుంచి పనిచేస్తున్న వారికే సిఫార్సు చేస్తుందన్న చర్చ జరుగుతోంది. స్థానిక రాజకీయాలపై ఆర్ఎస్ఎస్కు అవగాహన ఉండదని, అలాంటి వారి చేతుల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న తమలాంటి వారి భవిష్యత్తు పణంగా పెట్టకతప్పని పరిస్థితి ఉందని బీజేపీలో చేరిన ఇతర పార్టీ నేతలవు వాపోతున్నారు.
నిజానికి టీఆర్ఎస్లో ఒక వెలుగు వెలిగిన, మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్థాయి నేతలెవరూ బీజేపీలో
లేరు. కులబలం-ధనబలంలో ఆయన స్థాయిని అందుకునే బీజేపీ నేతలెవరూ లేరు. అయినా అంత పెద్ద నేత కూడా, పదవుల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్ ఇస్తామన్న హామీని, ఇప్పటిదాకా నెరవేర్చలేదన్నది ఆయన అనుచరుల వాదన.
ఆయనకు చేరికల కమిటీ చైర్మన్ పదదవి ఇచ్చినా, ఆయన ప్రమేయం లేకుండానే బీజేపీ సీనియర్లు వారిని అధ్యక్షుడి వద్దకు తీసుకున్న వైనంపై, ఈటల స్వయంగా హోంమంత్రి అమిత్‌షాకు కోర్‌కమిటీ
భేటీలోనే ఫిర్యాదు చేశారు. ఆ సందర్భంగా అమిత్‌షా మాజీ ఎంపి జితేందర్‌రెడ్డిని మందలించినట్లు సమాచారం. ఒకదశలో తాను చేరికల కమిటీ చైర్మన్ పదవి నుంచి వైదొలుగుతానని ఈటల హోంమంత్రికి చెబితే, వద్దని వారించిన పరిస్థితి.
అసలు పార్టీలో చేరికల కమిటీ అనేది లేదని, కానీ ఇప్పుడు కొత్తగా దానికి ఆ పేరు పెట్టడం వల్ల.. బీజేపీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్న విమర్శలు ఎదుర్కోవలసి వస్తోందని, సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీతి-నిబద్ధత-చిత్థశుద్ధి-స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తామనే తాము.. ఏకంగా చేరి ల కమిటీ పేరు పెట్టి, ఇతర పార్టీల నుంచి నేతలను తీసుకోవడమే జోకని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ సర్కారుపై పత్రికా ప్రకటనలు, గంభీరమైన ఆరోపణలు, భావోద్వేగాలతో ఆకట్టుకోవడం తప్ప.. రాజకీయంగా బీఆర్ఎస్పై బీజేపీ నిజమైన యుద్ధం చేయడం లేదన్న భావన క్షేత్రస్థాయిలో స్థిరపడింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను, కార్మికశాఖ అక్రమాల్లో కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎప్పటినుంచో బెదిరిస్తున్నారు.
కానీ వాటి ఆధారలు ఇప్పటిదాకా, కేంద్ర ఏజెన్సీలకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈలోగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. సీఎం కేసీఆర్ కుటుంబంపై, కేంద్ర ఏజెన్సీలకు ఫిర్యాదు చేశారు. గతంలో మోదీని-బీజేపీని తిట్టిపోసిన కేసీఆర్.. ఇప్పుడు యుటర్ను తీసుకుని కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారు. దానితో బీజేపీ-బీఆర్ఎస్ తెరవెనుక దోస్తీ చేస్తున్నాయన్న అనుమానాలకు కారణమయింది. ఇది కూడా ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరికలు నిలిచిపోవడానికి ఒక కారణమంటున్నారు.
కేవలం మీడియా హైప్, భావోద్వేగ ప్రకటనలు తప్ప క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే ఆలోచన బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి లేదన్న అంచనాకు ఆ పార్టీలో చేరిన కొత్త నేతలు వచ్చినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో 25 నుంచి 30 నియోజకవర్గాల్లో తప్ప, మిగిలిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్-బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చే స్థాయి అభ్యర్ధులు లేరన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మిగిలిన నియోజకవర్గాల్లో కార్పొరేటర్-కౌన్సిలర్-జడ్పీటీసీ స్థాయి నేతలే పోటీకి ఉన్నారని ఓ నేత అసలు విషయం వెల్లడించారు. ఇవన్నీ చేరికలు చతికిల పడేందుకు ప్రధాన కారణాలని ఆ నేత విశ్లేషించారు.