Suryaa.co.in

Andhra Pradesh

అడ్డంగా దొరికిపోయి … ఎన్ని కహానీలు చెప్పినా ఏమీ ఉపయోగం లేదు…!

-హత్య చేసిన తర్వాత హంతకుడు, హత్య చేయించిన వాడితోనైతేనే మాట్లాడుతాడు
-బైజూస్ కు ఏ ప్రాతిపదికన కాంట్రాక్టు కట్టబెట్టారని చక్కగా ప్రశ్నించిన పవన్ కళ్యాణ్
-ఐదు కిలోమీటర్ల కోసం హెలికాప్టర్లో ప్రయాణించిన ముఖ్యమంత్రి మరొకరు చరిత్రలో లేరు… భవిష్యత్తులో ఉండరు
-పెత్తందారులందరినీ పక్కనే పెట్టుకొని… ఏ పెత్తందారులపై పోరాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అడ్డంగా దొరికిపోయి, ఇప్పుడు ఎన్ని కహానీలు చెప్పినా ఉపయోగం లేదు. రాబోయే రోజుల్లో సిబిఐ దాఖలు చేయనున్న చార్జిషీట్లో మరికొన్ని పేర్లు సిబిఐ చేర్చడం ఖాయం. ఇప్పుడు మొహమాటానికి కొన్ని పేర్లను పెండింగులో పెట్టారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామకృష్ణంరాజు అన్నారు.

హత్య చేసిన తర్వాత హత్య చేయించిన వాడితోనైతేనే హంతకుడు ఫోన్ మాట్లాడుతాడని, లేకపోతే అవతలి వారి ఫోన్ ఎత్తే అవకాశం కూడా ఉండదని పేర్కొన్నారు. సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… వైయస్ వివేకానంద రెడ్డి హత్య కు ముందు తర్వాత హంతకుడి గా సాక్షి దినపత్రిక నిర్ధారించిన ఎర్ర గంగిరెడ్డితో అర్ధరాత్రి ఒంటిగంట 37 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల 18 నిమిషాల వరకు పలుమార్లు వాట్సాప్ కాల్ లో వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడారు.

అవినాష్ రెడ్డి వాట్సాప్ కాల్ చేసినప్పుడు, ఎర్ర గంగిరెడ్డి వాట్సాప్ కాల్ ఆన్ లో ఉన్న దాని ఆధారంగా సిబిఐ అధికారులు, వీరిద్దరూ పలుమార్లు వాట్సప్ కాల్ లో మాట్లాడుకున్నట్లుగా నిర్ధారణకు వచ్చారు. ఇంత అడ్డంగా దొరికేసిన తర్వాత కూడా, బుకాయించడం హాస్యాస్పదంగా ఉంది. వివేకానంద రెడ్డి హత్య అనంతరం ఆయన గాయాలకు కుట్లు వేసి కట్లు కట్టి, గుండెపోటుతో మరణించినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

సాక్షి దినపత్రికలో కారుకూతలు రాసి, నారా సుర రక్త చరిత్ర అనే కథనాన్ని వండి వార్చింది . తాము రాస్తున్న రోత రాతలను ప్రజలు ఎవరు నమ్మడం లేదని తాజాగా ది వైర్ అనే వెబ్ సైట్ లోనూ ఇంగ్లీషులో తాము రాసిచ్చిన కథనాన్ని ప్రచురింపజేయించి, తిరిగి దాన్ని తెలుగులోకి తర్జుమా చేసినట్లుగా చెప్పి సాక్షి దినపత్రికలో ప్రచురించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాన్ని చేశారు.

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జూన్ 19వ తేదీన 95 పేజీల లేఖ ను సీబీఐ కి రాసినట్లుగా సాక్షి దినపత్రికలో ప్రత్యేక కథనాన్ని రాశారు. నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లుగా రెండవ భార్య షేక్ షమీం కుమారుడి పేరిట వైఎస్ వివేకానంద రెడ్డి తన ఆస్తిని మొత్తం రాసినట్లుగా, ఆ ఆస్తి పత్రాల కోసమే వైయస్ వివేకానంద రెడ్డిని ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి హత్య చేసి ఆస్తి పత్రాలను పట్టుకెళ్ళినట్లుగా పేర్కొనడం సిగ్గుచేటు.

రాజశేఖర్ రెడ్డి ఒకవేళ గంగిరెడ్డి తో హత్య చేయించాడని అనుకుందాం. మరి వైయస్ భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి , వైయస్ అవినాష్ రెడ్డిలు ఎందుకని రక్తపు మరకలను తుడిచారు?!. గంగిరెడ్డి తో హత్యకు ముందు తర్వాత అవినాష్ రెడ్డి ఎందుకని పలుమార్లు ఫోన్లో మాట్లాడారు. ఒక్క అవకాశం ఇవ్వమంటే ఇచ్చారని ప్రజలని పిచ్చివారని అనుకుంటున్నారా??. హత్యా నేరారోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తి నేను కాదు… ఎవరో హత్య చేశారని అంటే సిబిఐ అధికారులు వారిపై కేసు నమోదు చేస్తారా?

జూన్ 30వ తేదీన చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉండగా, జూన్ 19వ తేదీన అవినాష్ రెడ్డి లేఖ రాయడం వెనుక ఆంతర్యం ఏమిటి??. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే సిబిఐ విచారణ చేపట్టిందని కొంతమంది గొర్రెలను నమ్మించడానికి సాక్షి దినపత్రికలో తప్పుడు కథనాలను రాస్తూ, మభ్య పెట్టే ప్రయత్నాన్ని చేస్తున్నారు. రేపు హత్య కేసులో శిక్ష పడిన తరువాత కూడా అయ్యో పాపం అన్యాయం జరిగిపోయిందని ఆ పిచ్చి వాళ్లను నమ్మించడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు.

హత్య జరిగిన సమయంలో ఎర్ర గంగిరెడ్డి , వైయస్ వివేకానంద రెడ్డి ఇంట్లోనే ఉన్నారని సాక్షి దినపత్రిక తో సహా, వైయస్ అవినాష్ రెడ్డి కూడా నిర్ధారించారు. హత్య కు ముందు తరువాత ఎర్ర గంగిరెడ్డి, అవినాష్ రెడ్డిలు అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు అనేకసార్లు ఫోన్ లో మాట్లాడుకున్నారు. హత్య జరిగిన సమయంలో హత్య గురించి కాకుండా మరేమి మాట్లాడుకుంటారు. హత్య చేసింది వీల్లేనని స్పష్టం అయ్యింది. కాకపోతే ఇంత అడ్డంగా తాము దొరికిపోతామని వారు భావించలేదేమో. లేకపోయి ఉంటే నర్రెడ్డి సోదరులకు కూడా ఫోన్ కాల్ చేసి ఉండేవారేమో నని రఘురామకృష్ణం రాజు అన్నారు.

పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతున్న సమయం
ఎన్నికల ముందు లోటస్ పాండ్ లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ప్రతిరోజు తెల్లవారుజామునే సమావేశాలు జరిగేవని సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మా రెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం పేర్కొన్నారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య అనంతరం ఎర్ర గంగిరెడ్డి తోనే కాకుండా వైయస్ అవినాష్ రెడ్డి,మరొకరితో ఫోన్ లో మాట్లాడారు. ఈ ఫోన్ కాల్సన్నీ ఉదయం 4:30 గంటల మధ్య నుంచి, ఐదున్నర గంటల వరకు కొనసాగాయి.

తెల్లవారుజామున నాలుగు గంటల 11 నిమిషాలకు, నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు, నాలుగు గంటల 59 నిమిషాలకు, ఐదు గంటల మూడు నిమిషాలకు, ఐదు గంటల 12 నిమిషాలకు, ఐదు గంటల 13 నిమిషాలకు అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి మరొక ఫోన్ నెంబర్ కు కాల్స్ వెళ్లాయి. ఆ ఫోన్ నెంబర్ ఎవరిది?, ఎవరితో మాట్లాడారన్నది తేలాల్సి ఉంది.

లోటస్ పాండ్ ఇంట్లో సమావేశం కొనసాగుతుండగా అటెండర్ వచ్చి అమ్మగారు ( వైయస్ భారతి రెడ్డి ) పిలుస్తున్నారని చెప్పగానే జగన్మోహన్ రెడ్డి సమావేశం మధ్యలో నుంచి లేచి పైకి వెళ్లారు.. తిరిగి వచ్చిన తర్వాత చిన్నాన్న ఇక లేరని సమావేశంలో పాల్గొన్న వారితో చెప్పారు. అంటే అప్పుడు సమయం ఉదయం 5:30 గంటలు అయి ఉంటుంది. అజయ్ కల్లం సమయం చెప్పకపోయినప్పటికీ, వృద్ధాప్యాన్ని సాకుగా పెట్టుకొని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గుర్తులేదన్న , ఈ సంఘటన ఆధారంగా ఫోన్ కాల్ వచ్చిన సమయం నిర్ధారణ అవుతుందని రఘు రామకృష్ణంరాజు పేర్కొన్నారు.

రక్తస్రావంతో కరోనా వచ్చి డాక్టర్ మృతి చెందడం, సాక్షి ఆత్మహత్య గావించబడడం విడ్డూరమే
వైయస్ వివేకానంద రెడ్డి గాయాలకు కుట్లు వేసి కట్లు కట్టిన ఆసుపత్రి యజమాని కరోనా వచ్చి తలలో తీవ్ర రక్తస్రావం జరిగి మృతి చెందారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య కావించబడ్డారు. వైయస్ వివేకానంద రెడ్డి మృతి అనంతరం వైయస్ భారతి రెడ్డి ఆందోళనగా సునీత రెడ్డి ఇంటికి వెళ్లారు. తొలుత సునీత రెడ్డి నే తమ ఇంటికి రమ్మని భారతీ రెడ్డి కోరారని ఆమె చెప్పారు. ఎవరైనా పరామర్శించడానికి బాధలో ఉన్న భారీ ఇంటికే వెళ్తారు, కానీ .. కానీ వారిని తమ ఇంటికి పిలిపించుకోరు. భారతి రెడ్డి పిలిచినప్పటికీ సునీతా రెడ్డి వెళ్లేందుకు నిరాకరించడంతో, ఆమె స్వయంగా సునీత రెడ్డికి ఇంటికి వచ్చి కలిశారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి తో టచ్ లో ఉండాలని సునీత రెడ్డికి సూచించడం, ఆయన చెప్పినట్లుగా నడుచుకోవాలని భారతీ రెడ్డి పేర్కొనడం ద్వారా అనుమానం మొదలైనట్లుగా సునీత రెడ్డి తెలిపారు.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య పై తమ్ముడు మహాసేన రాజేష్ చక్కటి విశ్లేషణ చేశారు. అయితే రాజేష్ కు ఎవరు ఏ సమయంలో ఫోన్లో మాట్లాడుకున్న వివరాలు తెలిసినట్లు లేవు. ప్రతిపక్ష పార్టీలపై, పత్రికలపై ఎదురు దాడి చేస్తున్నాం… సోషల్ మీడియాలో ప్రశ్నించే వారిని తంతున్నాం… ఇంకా మనల్ని ప్రశ్నించేది ఎవరు అనుకొని బుజ్జి కన్నల్లా ( వెర్రి పప్పల్లా) అడ్డంగా దొరికేశారు. వైయస్ వివేకానంద రెడ్డి మృతి చెందినట్లు భారతి రెడ్డికి ఎవరు చెప్పారు?, భారతీ రెడ్డి అటెండర్ ద్వారా జగన్మోహన్ రెడ్డిని పిలిపించిన సమయం తెలియదని అజయ్ కల్లం చెప్పారు.

కానీ వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయినట్లుగా తెలియదని మాత్రం ఆయన చెప్పలేదు. ఉదయం 6:30 గంటలకు లోటస్ పాండ్ ఇంట్లో అజయ్ కల్లం, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు లేరనే విషయం ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి, అటెండర్ నవీన్ కుమార్ స్టేట్మెంట్ల ద్వారా స్పష్టం అవుతుంది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య అనంతరం వైయస్ అవినాష్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి తో పాటు , లోటస్ పాండ్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ప్లాన్ వికటించి క్రూరంగా చంపిన తర్వాత, రక్తపు మరకలను తూడ్చి వేయమని అక్కడి నుంచి ఆదేశాలు వచ్చి ఉండవచ్చు.

దీనితో వెంకట రెడ్డి ఒక భార్య కు చెందిన మనవలు, ముని మనవడు అవినాష్ రెడ్డి తో కలిసి రక్తపు మరకలను తుడ్చి వేసి, గాయాలకు కట్లు కట్టారు. ఫ్రీజర్ తెప్పించి శవాన్ని అందులో భద్రపరిచారు. ఇంత జరిగాక కూడా నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు వైఫ్ యాంగిల్ నుంచి విచారణ చేయడం లేదనడం విస్మయాన్ని కలిగిస్తుంది. సాక్షిలో రాస్తున్న తింగరి రాతలు చూసి నవ్వొస్తుంది. సిబిఐ కొద్దిగా మొహమాటపడి కొన్ని పేర్లను టెంపరరీగా పెండింగ్లో పెట్టింది.

కొద్ది వారాల్లో మరొక చార్జిషీట్ వేయడం, కొత్త పేర్లు తెరపైకి రావడం గ్యారెంటీ. ఇప్పటికే సుప్రీంకోర్టు కేసు డైరీ ని సమర్పించాలని ఆదేశించింది. దీనితో అన్ని వివరాలు బయటకు వస్తాయి. బాలకృష్ణ ఇంట్లో కాల్పుల సంఘటన సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో మేజ్ఞానమిటి తో వ్యవహరించారని, ఆ మేజ్ఞానమిటి మీకు లేదని ప్రశ్నించడం ద్వారా సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డంగా బుక్ చేశారని రఘు రామకృష్ణంరాజు అన్నారు .

పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానం చెప్పండి… ట్యూషన్లు అవసరం లేదు
బైజుస్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పమంటే, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆయన కు ట్యూషన్ చెబుతానని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. బొత్స సత్యనారాయణ ట్యూషన్ చెబితే, ఆయన చెప్పేది అర్థం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ మరొకరితో చేత ట్యూషన్ చెప్పించుకోవలసి వస్తుంది.

ఏ ప్రాతిపదికన వేల కోట్ల రూపాయల కాంట్రాక్టును బైజుస్ కు కట్టబెట్టారని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా చక్కగా ప్రశ్నించారు. 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబులను పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, బైజుస్ కంటెంట్ అందజేసింది. ఇప్పుడా ఆ విద్యార్థులు 9వ తరగతిలో ప్రవేశించారు. 9వ తరగతి విద్యార్థులకు కూడా బైజుస్ ఉచితంగా కంటెంట్ ను అందజేస్తుందా?

ఏడవ తరగతి నుంచి 8వ తరగతిలో ప్రవేశించిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ట్యాబులను కొని పెడుతుందా?, బైజుస్ ఉచితంగా కంటెంట్ ను అందజేస్తుందా?? అంటూ ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సరస్వతి నిలయాలను కూడా ఆదాయ మార్గాలుగా మలుచుకున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఇది పార్టీకి శ్రేయస్కరం కాదని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకు వస్తున్నానని రఘు రామకృష్ణంరాజు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న బైజుస్ కంపెనీ దివాలా అంచున ఉంది.

ఆ సంస్థలోని 50 శాతం మంది డైరెక్టర్లు రాజీనామా చేశారు. బైజుస్ లో మేజర్ ఇన్వెస్ట్మెంట్ కలిగిన సేకోవా కూడా రాజీనామా చేశారు. గత 18 నెలలుగా బ్యాలెన్స్ షీట్ చూపించకపోవడం, ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించకపోవడం, ఉద్యోగులను తీసివేయడం వంటి ఘటనలకు బైజుస్ సంస్థ పాల్పడుతుంది. ఇదే విషయమై ఇటీవల ఉద్యోగులు నిరసన కూడా తెలియజేశారు. ఎడ్యుకేషన్ కంపెనీలలో వైయస్ భారతి రెడ్డి డైరెక్టర్ అని అంటున్నారు.

ఎడ్యుకేషన్ కంపెనీ అంటే బైజుస్ కంపెనీ నా?, బైజుస్ కు పెద్దగా క్లైంట్లు లేరు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమే వారికున్న పెద్ద క్లైంట్. బైజుస్ తో ఒప్పందం ద్వారా దోచుకోవడమే తప్ప, విద్యార్థులను చదివించాలని తపన కనిపించడం లేదు. బైజుస్ తో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలలో పారదర్శకత కనిపించడం లేదు.

గతంలో విద్యాశాఖలో విధులు నిర్వహించిన సీనియర్ అధికారి రాజశేఖర్ ను కాదని, జూనియర్ మహిళా అధికారిని తీసుకువచ్చి తమ ఇష్టం వచ్చినట్లుగా ఆటలు ఆడుతున్నారు. బైజుస్ గురించి, బైజుస్ ఒప్పందం ద్వారా జరుగుతున్న అక్రమాల గురించి గతంలో నేను మాట్లాడాను. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గతంలో చంద్రబాబు నాయుడుకు కూడా మాట్లాడారు.

పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మాట్లాడటం ద్వారా ప్రజా బహుళ్యం లోకి ఎక్కువగా వెళుతుంది. పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. బైజుస్ కు వేల కోట్ల రూపాయల ఆర్డర్ ఇవ్వడం విద్యా ప్రమాణాల పెంపు కోసమా?, లేకపోతే ఆ కంపెనీని అభివృద్ధి చేయడానికి అన్నది ట్యూషన్ ద్వారా కాకుండా, శ్వేత పత్రం విడుదల చేసి ప్రకటించాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు.

కుట్ర అని తెలిసిన తర్వాత వెనక్కి తగ్గడం తప్పేమీ కాదు
రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని తెలిసిన తరువాత వెనక్కి తగ్గడం తప్పేమీ కాదు. ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా నా నియోజకవర్గంలో నన్ను అడుగుపెట్టనివ్వకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆహ్వానితుల జాబితా నుంచి నా పేరును తొలగించారు. నియోజకవర్గానికి వస్తే కేసులు పెట్టాలని చూశారు. అలాగే ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో దొంగ ఓట్లను చేర్పించడం ద్వారా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఓడించాలని కుట్ర చేస్తున్నారు.

నారా లోకేష్, అధికార పార్టీ నాయకుల ఉచ్చులో చిక్కకుండా మరొక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి. మంగళగిరి నుంచి మరొకరిని నిలబెట్టి గెలిపించాలి. ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి హెలికాప్టర్ వినియోగించిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. మహిళలు దేహా శుద్ధి చేస్తారన్న నిఘా సంస్థల నివేదిక కారణంగానే ఆయన హెలికాప్టర్లో పయనించారు.

మహిళల నుంచి రక్షణ కోసం ఇప్పటికే మహిళ పోలీసులకు శిక్షణ ఇస్తున్నారు. మహిళల నుంచి రక్షణ కోసం భారీకేడ్లు, 300 మంది మగ పోలీసులు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఉండగా తనని తాను సింహంగా అభివర్ణించుకునే మానవ సింహం హెలికాప్టర్లో ప్రయాణించడం సిగ్గుచేటు. అమరావతి అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎలర్జీ. సర్వనాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు.

ఇంద్రుడి రాజధాని అయిన అమరావతిపై రాక్షసులు దాడి చేయగా, అభినవ అమరావతిపై నేటి అసురుడు దాడి చేస్తున్నారు. అమరావతి ఆర్ 5 జోన్ లోని 50 వేల 760 గృహాలకు గాను 35 వేల గృహాలు మంగళగిరి నియోజకవర్గంలోకి వస్తాయి. మంగళగిరి నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల నుంచి తమ పార్టీ సానుభూతిపరులైన ఓటర్లను తీసుకువచ్చి దొంగ ఓట్లు చేర్పించాలన్నదే అధికార పార్టీ నాయకుల ఎత్తుగడ.

దొంగ ఓట్ల నమోదు, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్ల నిర్మూలన, కేంద్రంతో సఖ్యత గా నటిస్తూ, ఆలయ అధికారులతో ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి చేయించి రానున్న ఎన్నికలను దశలవారీగా నిర్వహించే విధంగా మా పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారి పప్పులు ఏమి ఉడకవని రఘురామకృష్ణం రాజు అన్నారు.

మా పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి
అధికార పార్టీలో నాతో అసంతృప్తి మొదలైంది. నలుగురు ఎమ్మెల్యేలతో మరింతగా ముదిరింది. ఇప్పుడు ఉభయగోదావరి జిల్లాలలో బలమైన నాయకుడిగా పేరు ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ తన మూడేళ్ల పదవీ కాలాన్ని ఉంచుకొని కూడా రాజీనామా చేస్తానని పేర్కొనడం, పార్టీలోని తీవ్ర అసంతృప్తికి నిదర్శనం. ముఖ్యమంత్రి ఎదురుగా ఎవరు కూర్చోవడానికి వీలు లేకుండా కుర్చీలు వేయడం లేదని తెలిసింది.

అవతలి వ్యక్తుల మనోభావాలను దెబ్బతీస్తే, పార్టీ సంక నాకు పోయే ప్రమాదం ఉందని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు. ఇప్పటికే మా పార్టీ నాయకులు ఎమ్మెల్యే సీట్లను ఖరారు చేసి మూడు పదుల కోట్లకు తక్కువ కాకుండా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో ఎంతమంది టికెట్లను దక్కించుకుంటారో, ఎంతమంది తమ ధనాన్ని రక్షించుకుంటారో చూడాలి. ప్రస్తుత సర్వేల ప్రకారం మా పార్టీ ఓడిపోవడం ఖాయం.
పెత్తందారులతో పోరాడుతున్నానని చెప్పే జగన్మోహన్ రెడ్డి పక్కనే పెత్తందారులైన సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు ఉన్నారు. వీళ్లను పక్కన పెట్టుకొని ఏ పెత్తందారులతో జగన్మోహన్ రెడ్డి పోరాడుతున్నారో చెప్పాలి. వీళ్ళతో కలిసి జగన్మోహన్ రెడ్డి ప్రజలను దోచుకుంటున్నారని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
ఇక చంద్రబాబు పల్లకిని మోస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను ముద్రించడం సిగ్గుచేటు. కురుక్షేత్ర యుద్ధం వంటి ఎన్నికల సంగ్రామంలో రథం లో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు ఇద్దరు ఉంటారు. సమిష్టిగా యుద్ధం చేసిన పాండవులు కౌరవులను అంతం చేసినట్లుగానే, ఎన్నికల సంగ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వారు ఓడించడం ఖాయమని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

LEAVE A RESPONSE