– జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు..సమాధానాలు తెలియక పోతున్నాం
– ఇలాగైతే జిల్లాలు ప్రజలు ఉద్యమిస్తారు
– ఇది సీరియస్ అశం
– శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి
హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా రంగారెడ్డి జిల్లాలోని భూములను అమ్ముతున్నారు తప్ప జిల్లా అభివృద్ధికి నిధులు అందించడం లేదని శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.
శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అధ్యక్షతన సాగిన ప్రత్యేక ప్రస్తావన లలో ఆయన ఈ విషయం ప్రస్తావించారు. నాడు ఎన్టీ రామారావు మొదలు చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, ఇలా ముఖ్యమంత్రి ఎవరైనా రంగారెడ్డి జిల్లాలోని చాలా భూములను వేలాది కోట్లకు అమ్మి సంక్షేమ కార్యక్రమాలను అమలు పరిచేందుకు సదరు నిధులను వినియోగించారని చెప్పారు.
ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల కోసం, ప్రభుత్వాన్ని నిర్వహించడం కోసం రంగారెడ్డి జిల్లా భూములను అమ్మిన జిల్లాకు మాత్రం అందవలసిన స్థాయిలో నిధులు అంద లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన తనను, తమలాంటి నాయకులను ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆయన వివరించారు.
ప్రభుత్వం ప్రభుత్వం విలువైన రంగారెడ్డి జిల్లా అమ్ముకుంటున్న సందర్భంలో జిల్లా అభివృద్ధికి 20% లేదా 30% ఎంత ఇస్తారో పేర్కొని ఆ నిధులను జిల్లా అభివృద్ధికి వినియోగించేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాకు చెందిన భూములను కూడా అమ్మారని ఎకరాకు 150 కోట్ల పై మాటే పలికాయని ఇలా అమ్ముతున్న నిధులలో జిల్లాకు వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారని, నాయకులను ప్రశ్నిస్తున్నారని, తాము సమాధానం చెప్పలేక పోతున్నామని ఆయన పేర్కొన్నారు. ఇలాగైతే భవిష్యత్తులో జిల్లాలో ప్రజలు తిరగబడి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నాయని మహేందర్ రెడ్డి వెల్లడించారు.
కనీసం ఈ ప్రభుత్వమైనా రంగారెడ్డి జిల్లాలో అమ్ముతున్న భూముల ద్వారా వచ్చిన డబ్బులలో జిల్లా అభివృద్ధి కోసం కనీసం 40% కేటాయించాలని శాసన మండలి ద్వారా ప్రభుత్వాన్ని కోరుకున్నట్లు మహేందర్ రెడ్డి చెప్పారు.