– వైఎస్సార్ నేతన్న నేస్తం కోసం చేనేతల ఎదురుచూపు
– సీఎం జగన్ జులైలో బటన్ నొక్కినా ఆగస్టుకూ దిక్కులేదు
– కొన్ని జిల్లాలకే మోగిన డబ్బుల బటన్
– ఐదు జిల్లాల్లో చేనేతలకు మోగని బటన్
– అందరికీ ఇస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటనలు
– చేనేతలకు ఏడాది 24వేలతో నేతన్న నేస్తం
-81 వేల చేనేత కుటుంబాలకు లబ్ధి
– నెలరోజులైనా మోగని డబ్బుల గంట
– గతంలో కరెంటు బిల్లుసాకుతో సాయం కట్
– ఇప్పుడు ఐదు జిల్లాల లబ్థిదారులకూ ఆ సాకుతో కోత కోశారా?
– నిధులు నిలిచిపోవడానికి కార ణం చెప్పని జౌళి శాఖ
– పెదవి విప్పని మంత్రి, చేనేత జౌళిశాఖ కమిషనర్
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ సీఎం జగనన్న అన్ని సంక్షేమ పథకాలకూ బటన్ నొక్కుతున్నారు. దానితో నేరుగా ఆ డబ్బులు లబ్థిదారులందరి అకౌంట్లోకి, తోసుకుంటూ పడిపోతాయి. బటన్నొక్కిన మరుక్షణమే ఠంగు ఠంగుమంటూ, సెల్ఫోన్ మెసేజ్ల ప్రవాహం పరవళ్లెత్తుతుంది. ఇదీ సహజంగా సీఎం జగనన్న నొక్కే బటన్లపై సామాన్యుల అంచనా.
ఎందుకంటే బటను నొక్కేది ఆషామాషీ వ్యక్తి కాదు. సాక్షాత్తూ సీఎం అందరి సమక్షంలో చిరునవ్వులు చిందిస్తూ, బటను నొక్కుతున్నారంటే.. ఏకకాలంలో వేలాదిమంది లబ్థిదారులకు డబ్బులు పడిపోవాలంతే. అందువల్ల సీఎం బటన్ను అనుమానించే అవకాశం ఉండదు. ఆ బటన్లో డబ్బులు ఉండవన్న అపనమ్మకం అవసరం ఉండదు.
కానీ.. గత నెలలో సీఎం నొక్కిన బటన్లో, కొందరికే డబ్బులు జమ అయ్యాయి. ఐదు జిల్లాల లబ్థిదారుల కుటుంబాలు.. ఇప్పుడు సెల్ఫోన్లలో మోగే ఆ గంట కోసం, ఆశగా ఎదురుచూస్తున్నారు. అందుకే ‘ఇంకా డబ్బులు పడలేదు నేస్తం’.. అని నేతన్నలు, వైసీపీ స్థానిక నేతలకు ఫిర్యాదు చేస్తున్నారు.
కానీ ఇటీవలి కాలంలో జగనన్న బటను నొక్కినా, అర్హులందరికీ ఒకేసారి డబ్బులు జమ కావడం లేదు. కానీ ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లో మాత్రం.. లబ్ధిదారులందరికీ ఒకేసారి బటన్లు నొక్కుతున్న ప్రచారమే
కనిపిస్తోంది. దానితో సహజంగానే లబ్థిదారుల్లో అయోమయానికి తెరలేచింది. ఒక జిల్లాలో మోగిన బటన్, మరో జిల్లాలో మోగడం లేదు. వైఎస్సార్ నేతన్న నేస్తం లబ్థిదారుల పరిస్థితి కూడా అంతే.
చేనేతల బతుకులు మార్చాలన్న లక్ష్యంతో, సీఎం జగన్ వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని 2019లో
ప్రారంభించారు. ప్రారంభంలో 84 వేలమంది లబ్ధిదారులున్న ఈ పథకంలో ఇప్పుడు 81,024 మందికి పరిమితం చేశారు. ఆ ప్రకారంగా ఒక్కో లబ్థిదారుడికి, ఏడాదికి 24 వేల రూపాయలు నేరుగా వారి ఖాతాలోనే వేస్తున్నారు.
ఆ ప్రకారంగా ఈ పథకం ద్వారా బీసీలు 90.5 శాతం, కాపులు 3.7 శాతం, మైనారిటీలు 2.6 శాతం, ఈబీసీలు 1.7 శాతం, ఎస్సీలు 0.9 శాతం, ఎస్టీలు 0.3 శాతం, బ్రాహ్మణులు 0.07 శాతం, క్రైస్తవులు 0.01 శాతం లబ్ధిపొందుతున్నారని ప్రభుత్వమే గణాంకాలు విడుదల చేసింది.
కాగా గత నెల జులై మూడవ వారంలో.. మొత్తం 194.46 కోట్లు విడుదల చేస్తూ సీఎం జగన్, వెంకటగరి వేదికగా బటన్ నొక్కారు. జులై నెల ముగిసి, ఆగస్టు వచ్చి ఇన్ని రోజులవుతున్నా, ఇంకా పూర్తి స్థాయిలో చేనేతలకు డబ్బులు పడని వైనం విమర్శలకు తెరలేపింది.
అయితే ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనల్లో మాత్రం.. 81,024 మంది లబ్థిదారుల కుటుంబాలకు 194.46 కోట్లు ఒకేసారి విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో లబ్థిదారుల సంఖ్య, ప్రభుత్వం విడుదల చేసిన మొత్తాన్ని టేబుళ్ల రూపంలో చూపించటం ప్రస్తావనార్హం.
సీఎం జగన్ బటన్ నొక్కి డబ్బులు విడుదల చేసిన తర్వాత గుంటూరు, అనంతపురం, కర్నూలు, తూర్పు గోదావరి, నెల్లూరు జిల్లాల్లోని చేనేతలకు, ఇప్పటివరకూ డబ్బులు అందకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
కొన్ని జిల్లాలకు డబ్బులు ఇచ్చి, మిగిలిన జిల్లాలకు నిలిపివేయడం ఏమిటని చేనేత సంఘాలు ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా 84 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి, తర్వాత దానిని 81 వేలమందికి కుదించారని గుర్తుచేస్తున్నారు.
గతంలో కరెంటు బిల్లులు ఎక్కువగా వచ్చాయన్న సాకుతో డబ్బులు ఇవ్వడం ఆపేసిన ప్రభుత్వం..
ఇప్పుడు తమకు కూడా అదే సాకు చూపి డబ్బులు నిలిపివేసిందా? అన్న అనుమానం లబ్ధిదారుల్లో వ్యక్తమవుతోంది. అయితే ఆ విషయాన్ని కూడా అధికారులు నిర్ధారించడం లేదని, నేతన్నలు మండిపడుతున్నారు.
అటు చేనేత జౌళి శాఖ కూడా.. అన్ని వేలమంది నేతన్నలకు డబ్బులు ఎందుకు నిలిచిపోయాయో కనీసం వివరణ కూడా ఇవ్వకపోవడం బాధ్యతారాహిత్యమని నేతన్నలు విరుచుకుపడుతున్నారు. తాజాగా చేనేత జాతీయ దినోత్సవాన్ని ఘనంగా జరిపిన ప్రభుత్వం.. కనీసం ఆరోజయినా డబ్బులు జమ చేయకపోవడం, నేతన్నలను నిరాశకు గురిచేసింది.