విశ్వ విద్యాలయాల్లో కొలువులు లేక చదువులు బేజారు

రెండు తెలుగు రాష్ట్రాలలోని యూనివర్సిటీలను అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉన్నత విద్య ప్రమాణాలతో అత్యుత్తమ విద్యాబోధన కొనసాగించాల్సిన యూనివర్సిటీలు ఫ్యాకల్టీ లేమితో సతమతమవుతున్నాయి.అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయకపోవడంతో యూనివర్సిటీలలో విద్యాప్రమాణాలు దిగజారిపోయాయి. ఎంతో ఘన కీర్తి కలిగిన విశ్వవిద్యాలయాలు ఇప్పుడు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడేషన్ మరియు నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కమిటీ కి అక్రిడేషన్ కోసం వెళ్ళటం లేదు. చాల విశ్వవిద్యాలయాలు తగినంత ఫ్యాకల్టీ లేని కారణంగా విభాగాలు మూతపడి పోయాయి. రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉండే విశ్వవిద్యాలయాలలో 68 శాతం ఖాళీలు తెలంగాణాలో, 61 శాతం ఖాళీలు ఆంధ్రాలో ఉన్నట్లు తెలుస్తున్నది. కేంద్ర విశ్వవిద్యాలయలలో ఆంధ్రలో వంద శాతం ఖాళీలు తెలంగాణాలో 56 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

రెండు రాష్ట్రాలలో విశ్వవిద్యాలయాల్లో ఏడు వేల కంటే ఎక్కువ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అలాగే డిగ్రీ పిజి కళాశాలలో , అనుబంధ కళాశాలల్లో మరో నాలుగు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎనిమిది సంవత్సరాలు పూర్తి అయినా ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం, మూడు సంవత్సరాలు పూర్తి అయినా ఒక్క అధ్యాపక పోస్టు భర్తీ చేయని ఆంధ్ర ప్రభుత్వంతో నేనేమి తక్కువ కాదని కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా ఉంది. గత పాతిక ముప్ఫయేళ్ళుగా విశ్వవిద్యాలయాల పరిస్థితిని సమీక్షించకుంటే అశాంతికి, అలజడులకు, సుదీర్ఘ పోరాటాలకు ప్రధాన కారణం బోధన సిబ్బంది నియామకాలే అని గ్రహించగలం. వీసీలపై ముందు దశలో వివిధ వర్గాల వత్తిడి, నియామకాల అనంతరం రాని వాళ్ళ ఆగ్రహప్రదర్శనలతోనే సరిపోతుంది. ఎప్పుడూ ఆశావహుల్లో, అర్హతగల అభ్యర్థుల్లో పదింట ఒకరికే ఉద్యోగం లభించటం సహజమే. తక్కువ బాధ్యతలు, ఎక్కువ జీతాలు కూడా ఈ పరిస్థితిపై ఆసక్తి పెంచి రెండవ దశలో సంక్షోభ సృష్టికి కారణమవుతున్నాయి. బోధన, పరిశోధన, క్రమశిక్షణ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే అధ్యాపకులను నియమించాల్సిందే. విశ్వవిద్యాలయాలకు అద్భుతాలు సృష్టించే శక్తి ఉంది, విద్యారంగంలో అత్యంత కీలకం తరగతి బోధనేనని ఉపకులపతులు గ్రహించాలి.

విద్యార్థులపై తరగతి బోధనా విధానం తీవ్ర ప్రభావం చూపుతుంది, అధ్యాపకులు సైతం విద్యార్థులను ప్రభావితం చేసే విధంగా బోధన విధానాలు, సామర్థ్యాలు ఉన్నతీకరించుకోవాలి. విశ్వవిద్యాలయం పరీక్షల్లో అనేక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది, అలాగే వివిధ వర్శిటీల్లో అమలులోవున్న పరీక్షల విధానంపై సమగ్ర అధ్యయనం చేసి విద్యార్థులకు లాభం చేకూర్చే పద్దతిని అవలంబించుకోవాలి. విద్యా విధానంలో నాణ్యత తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి, ప్రధానంగా పాలన, ఆర్థిక వనరుల కేటాయింపు, పరిశోధన ప్రగతి, ఏపిఐ స్కోర్, పర్ఫామెన్స్ బేస్డ్ అకడమిక్ స్కోర్ వంటి కీలకాంశాలు విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో నేడు స్మశాన ప్రశాంతత నెలకొని ఉంది. ఉన్నత విద్యాధికారులు ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తూ వీటిలో సీట్లు భర్తీ అయిన తరువాత మొక్కుబడిగా అడ్మిషన్లు చేపడుతున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలలో సీట్ల భర్తీ జూన్ నెలలో ముగుస్తుంది, ఇక్కడ సెప్టెంబర్ అయినా అడ్మిషన్ ప్రక్రియ మొదలవదు. పరిస్థితి ఇలాగే ఉంటే 2030 నాటికి దేశంలో 80 శాతం ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఏర్పడతాయి. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలల్లో ఉండే ఇంజినీరింగ్ కళాశాలలు కనీసం ముప్పై శాతం సీట్లు భర్తీ కాక మూసివేశారు. డిప్లొమా విద్యలో ఇంకా దారుణంగా కేవలం 35 శాతం అడ్మిషన్లు అయినవి అంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

విశ్వవిద్యాలయాలకు మరింత స్వేచ్ఛను అందించినప్పుడే ఉన్నత విద్య, పరిశోధన రంగంలో నాణ్యత మెరుగుపడుతుంది అలాగే దేశీయ విశ్వవిద్యాలయాలలో విద్య పరిశోధన రంగంలో అంతర్జాతీయ విద్య సంస్థలతో పోటీ పడాలంటే రీసెర్చు గ్రాంట్లు, మైనర్, మేజర్ ప్రాజెక్టులు రూపకల్పన చేయాలి. ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో సెంటర్ ఆఫ్ పొటెన్షియల్ ఎక్సెలెన్స్ ఉన్న విభాగాలు ఒక్కటీ లేదు. దేశంలో ఉన్నత విద్య రంగానికి కేటాయిస్తున్న నిధులు ఇతర అన్ని రంగాల కంటే అత్యల్పంగా ఉంది. దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో ఉన్నత విద్యారంగానికి కేటాయించే నిధులను పెంచడంతోపాటు వివిధ మార్పులకు అవకాశం కల్పించాలి . విశ్వవిద్యాలయాలు గుర్తింపులు ఇవ్వడాన్ని రద్దు చేసి, పరీక్షావిధానంలో సమూల మార్పులు తీసుకువచ్చినప్పుడే విద్యా రంగంలో నాణ్యతతో కూడిన ప్రమాణాలు మెరుగుపడతాయి. విద్యారంగానికి దశాబ్దం క్రితం వరకు ఎంతో ప్రాధాన్యం ఉండేది, విశ్వవిద్యాలయాలు సమాజ ఉన్నతికి దోహదపడే విధంగా ఉండాలి. పాఠ్యప్రణాళిక రూపకల్పన, సిలబస్ నిర్ణయించడంలో, అమలులోకి తీసుకొని రావడంలో అధ్యాపకుడి పాత్ర ప్రధానంగా ఉండి, జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని, విలువలను పెంచేదిగా విద్య ప్రణాళిక ఉండాలి. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది అధ్యాపకులు లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వీటిలో నాణ్యత ప్రమాణాలు పరిశీలించడానికి ప్రైవేటు కన్సల్టెన్సీలు ఉన్నాయి. లోపం ఎక్కడుందో గ్రహించకుండా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు.

విద్యార్థిని కేంద్రీకృతం చేసుకొనే పద్ధతి ఈనాడు అవసరము, ఓపన్‌బేస్ ఎడ్యుకేషన్ విధానాన్ని విస్తృతపరిస్తే విద్యార్థి విజ్ఞాన స్థాయి మెరుగుపడుతుంది. సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది, అలాగే కోర్ ఇంజినీరింగ్ బ్రాంచీలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొత్తగా ప్రవేశ పెడుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లార్న్ఇంగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సెక్యూరిటీ అంశాలు అధ్యాపకులు బోధించడానికి అకడమిక్ స్టాఫ్ కాలేజీలు లేవు, అధ్యాపకులకు వీటిపై నైపుణ్యత పెంపొందించుకొని బోధిస్తే ఉత్తమ ఫలితాలు రాబట్టవచ్చు. పరిశోధన ప్రాజెక్టులు కొన్ని మధ్యలోనే ఆగిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి, వాటికి కారణం నిధులు నిలిపివేయడం లేదా తగ్గించడం జరుగుతున్నది, కాబట్టి ప్రాజెక్టు హక్కులను పరిరక్షించుకొని వీలైతే లైసెంగ్ విధానాన్ని ప్రకటించాలి. విద్యార్థులకు సానుకూల దృక్పథం, లక్ష్య సాధన, పర్సనాలిటీ డెవలప్మెంట్ భావ ప్రకటన నైపుణ్యాలు మెరుగు పడడానికి అలాగే పరిశోధన పత్రాలు ప్రచురించడానికి డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేసి లాంగ్వేజ్ ల్యాబ్ ని పునరుద్ధరించాలి. స్కిల్ డెవలప్మెంట్, అకడమిక్ డెవలప్మెంట్, పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే స్టడీ సర్కిల్స్ పునరుద్ధరించాలి. విద్యరంగంలో నాణ్యత సమస్యలు ద్వారా ఉన్నత విద్యను అభ్యసించిన అభ్యర్థులు 80 శాతం మందికిపైగా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు, ఇందుకు విద్యార్థుల్లో సరిపడా నైపుణ్యం లేకపోవడమే ప్రధాన కారణం. విశ్వవిద్యాలయ ఉపకులపతులు, ఉన్నత విద్యా అధికారులు యుద్ధ ప్రాతిపదికన నియామకాలు చేపడితే విశ్వవిద్యాలయాలు మనుగడ ఉంటుంది, లేకపోతే నైపుణ్యం లేని, నీచమైన విద్యను భావితరాలకు అందచేసిన వారమవుతాము.

డాక్టర్ యం.సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక

Leave a Reply