– హిందూ, ముస్లింలను రెచ్చగొట్టి ఓట్లు దండుకునే కుట్ర చేస్తోంది
– భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద కాంగ్రెస్ చేస్తున్న డ్రామాలే ఇందుకు నిదర్శనం
– బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు
పాతబస్తీలో భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం విషయంలో కాంగ్రెస్ పార్టీ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది. ఒకవైపు భాగ్యలక్ష్మీ ఆలయం అక్రమ కట్టడమని పేర్కొంటూ కాంగ్రెస్ మైనారిటీ మోర్చా నాయకులు అక్కడే నమాజ్ చేస్తామంటూ సంతకాల సేకరణ చేపడుతున్నారు… ఇంకోవైపు కాంగ్రెస్ నేతలు అమ్మవారి ఆలయం వద్ద పూజలు నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ నేతల రెండు నాల్కల ధోరణికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయంది. ఆ పార్టీ హైదరాబాద్ లో పూర్తిగా పట్టు కోల్పోయింది. మైనారిటీ ఓటు బ్యాంకు కోసం సంతకాల సేకరణ పేరుతో ముస్లింలను రెచ్చగొడుతున్నారు. ఇంకోవైపు భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద పూజల పేరిట హిందువులను రెచ్చగొట్టే చర్యలకు పూనుకున్నారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఇకనైనా మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పబ్బం గడుపుకునే పనిని మానుకోవాలని సూచిస్తున్నా..