Suryaa.co.in

Editorial Sports

వరల్డ్‌కప్ సాధించిన తెలంగాణ క్రికెట్ కోచ్‌కు కితాబేదీ?

– అండర్-19 వరల్డ్‌కప్ క్రికెట్ కోచ్ హర్షకు దక్కని సర్కారు ప్రశంస
– వైస్ కెప్టెన్ రషీద్‌ను పిలిపించిన ఆంధ్రా సీఎం జగన్
– 10 లక్షల బహుమతి, ఇంటి స్థలం ప్రకటించిన ఏపీ సర్కార్
– తెలంగాణ కుర్రాడికి దొరకని సీఎం అపాయింట్‌మెంట్
– క్రీడాశాఖ మంత్రి పిలుపూ కరవే
– క్రీడాసంఘాల అసంతృప్తి
( మార్తి సుబ్రహ్మణ్యం)

దండిగా ప్రతిభ ఉన్న క్రీడాకారులకు పాలకుల ప్రోత్సాహం లభిస్తే వారు ఆ ఉత్సాహంతో మరింత రాణిస్తారు. మరిన్ని పతకాలు సాధిస్తారు. వారు పుట్టిన గడ్డ కూడా గర్విస్తుంది. అందుకే ఏ క్రీడాకారుడు అద్భుతాలు సృష్టించినా, సహజంగా ఆయా ప్రభుత్వాలు వారిని పిలిచి సత్కరిస్తుంటాయి. నజరానాలు ప్రకటిస్తుంటాయి. వారు సాధించిన విజయాల ప్రాధాన్యం బట్టి, స్వయంగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులే వారిని పిలిచి కితాబు ఇస్తుంటారు. కానీ అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచకప్, ఆసియాకప్‌ను ఇండియాకు తెచ్చిపెట్టేందుకు కృషి చేసిన ఓ క్రికెట్ కోచ్‌ను తెలంగాణ సర్కారు విస్మరించటం క్రీడాసంఘాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఇటీవల జరిగిన అండర్ 19- వరల్డ్ క్రికెట్‌కప్ , ఆసియాకప్ పోటీల్లో భారత్ ప్రత్యర్ధి దేశాలను మట్టికరిపించి, క్రికెట్ ఆడే దేశాలలో మీసం మెలేసింది. ఇటీవలి కాలంలో క్రికెట్ రంగంలో, మన దేశం సాధించిన అతిపెద్ద విజయం ఇదే. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ రెండు వరల్డ్‌కప్‌లకు కండిషనింగ్
harsha కోచ్‌గా వ్యవహరించి, జట్టును విజయబాటలో నడిపించింది స్వయంగా హైదరాబాద్ కుర్రాడు ఏ.హర్ష. సికింద్రాబాద్ బోయిన్‌పల్లికి చెందిన ఈ కుర్రాడి సారథ్యంలోనే ఇండియా కుర్రాళ్లు కప్ సాధించారు.

కప్ సాధించిన జట్టు వైస్ కెప్టెన్, గుంటూరు కుర్రాడయిన రషీద్‌ను ఏపీ సీఎం జగన్ పిలిపించి అభినందించారు. క్రీడాశాఖ మంత్రి, జిల్లా మంత్రులు ఆ కుర్రాడిని వెంటపెట్టుకుని సీఎం వద్దకు
cm-jagan-rasheed తీసుకువెళ్లారు. రషీద్ ప్రతిభకు ముచ్చటపడ్డ జగన్, ఆ కుర్రాడిని అభినందించడంతోపాటు 10 లక్షల రూపాయల నగదు బహుమతి, గుంటూరులో నివాస స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

అయితే.. ఇన్ని విజయాలకు సారథ్యం వహించిన హైదరాబాద్ కోచ్ హర్షను మాత్రం ఇప్పటిదాకా ఎవరూ పట్టించుకోకపోవడం విచారకరమని క్రీడాసంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి జగన్ కంటే ముందే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి.. కోచ్ హర్షను అభినందిస్తారని భావించామని,

harsha1 అయితే ఇప్పటివరకూ హైదరాబాద్ కోచ్‌ను ఎవరూ పట్టించుకోకపోవడం దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు. కనీసం క్రీడాశాఖ మంత్రి నుంచి ఫోన్‌లో ప్రశంసలు కూడా దక్కకపోవడం ప్రస్తావనార్హం.

అయితే కోచ్ హర్ష మాత్రం వీటిని పట్టించుకోకుండా, బెంగళూరులో జరిగే బీసీసీఐ క్యాంపునకు వెళ్లినట్లు క్రీడాసంఘాలు చెబుతున్నాయి. రెండు ప్రతిష్టాత్మక ప్రపంచ్‌కప్‌లు సాధించిన ఓ కోచ్ ప్రతిభను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలన్న కనీస స్పృహ కూడా హైదరాబాద్ జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులకు లేకపోవడం విచారకరం.

LEAVE A RESPONSE