రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఫొటోలను కాగితం ప్లేట్లపై ముద్రించి ఉండటాన్ని చూసి ప్రశ్నించిన గోపాలపురం ఎస్సీ యువకులపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసులు నమోదు చేయడం సరికాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కాగితం ప్లేట్లపై అంబేద్కర్ ఫొటోలను చూసి నిరసన వ్యక్తం చేసిన 18 మంది ఎస్సీ యువకులపై నేరపూరిత కుట్రను ఆపాదిస్తూ కేసు నమోదు చేయడం ద్వారా సమస్యను మరింత తీవ్రతరం చేశారని ఆయన విమర్శించారు.
ఇలాంటి సున్నితమైన వ్యవహారాల్లో పోలీసు అధికారులు సామరస్య ధోరణితో వ్యవహరించాలని పవన్ అన్నారు. ప్రజల మధ్య దూరం పెరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులతో పాటు అన్ని పార్టీలపైనా ఉందని చెప్పారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు స్థానికంగా అన్ని పార్టీలు, అన్ని వర్గాలు ఒక తాటిపైకి వచ్చి శాంతి కమిటీలు వేసుకుని సుహృద్భావ పరిస్థితులు నెలకొనేలా చర్చించుకోవాలని సూచించారు.