దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ జీ 2023 మే 30న 9 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ఇప్పటి వరకూ ఈ పదవిలో ఉన్న ప్రముఖుల ప్రత్యేకతల గురించి రాజకీయ పండితులు ప్రస్తావిస్తున్నారు. భారతదేశంలో అత్యంత శక్తిమంతమైన కార్యనిర్వాహక అధికారం ఉన్న ప్రధాని పదవిని 1947 ఆగస్ట్ 15 నుంచి ఇప్పటి వరకూ 15 మంది నాయకులు చేపట్టారు.
ఈ పదిహేను మందిలో ఒకరైన కాంగ్రెస్ నేత గుల్జారీలాల్ నందా దేశ తొలి ప్రధాని పండిత జవహర్లాల్ నెహ్రూ, మరో కాంగ్రెస్ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ మరణానంతరం 13 రోజులు చొప్పున రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాంగ్రెస్ పార్టీ కొత్త పార్లమెంటరీ పార్టీ నేతను ఎన్నుకునే వరకూ ఆయన ప్రధాని పదవిలో ఇలా దాదాపు రెండేసి వారాల చొప్పున రెండుసార్లు ఉన్నారు.
భారత రాజ్యాంగంలో ‘తాత్కాలిక ప్రధాని’ అనే పదవి లేకున్నా నందా జీ ని రాజకీయ పరిశీలకులు, పాత్రికేయులు తాత్కాలిక ప్రధాని అనే ప్రస్తావిస్తారు. నందాను ప్రధాని పదవి చేపట్టిన వారి జాబితా నుంచి తొలగించి చూస్తే–మొత్తం 14 మందిని ఈ ఉన్నత పదవి వరించిందని భావించాలి. అనేక పార్టీలకు చెందిన ఈ పద్నాలుగు మందిలో ఆరుగురు–జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాధీ, పి.వి.నరసింహారావు, డా.మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. మిగిలిన ఎనిమిది మందిలో ఆరుగురు వరుసగా (మొరార్జీదేశాయి, చరణ్ సింగ్, వి.పి.సింగ్, చంద్రశేఖర్, హెచ్.డి.దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్) జనతా అనే పేరుతో ఉన్న జనతా పార్టీ, జనతా–ఎస్, జనతాదళ్, సమాజ్ వాదీ జనతా (ఎస్) అనే పార్టీకు చెందిన నేతలు. పేరుకు కాంగ్రెసేతర ప్రధానులేగాని ఈ ఆరుగురూ కాంగ్రెస్ మూలాలున్న నేతలే!
భారత తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా చరిత్రకెక్కిన తొలి గుజరాతీ ప్రధాని మొరార్జీదేశాయి వాస్తవానికి తన రాజకీయ జీవితంలో అత్యధిక కాలం కాంగ్రెస్ పార్టీలోనే గడిపారు. మొరార్జీ రాజీనామా తర్వాత ప్రధాని పీఠమెక్కిన చరణ్ సింగ్ రాజకీయాలు కూడా సుదీర్ఘకాలంలో కాంగ్రెస్ తో ముడిపడి ఉన్నాయి. వీపీ సింగ్ తర్వాత ప్రధాని అయిన మరో ఉత్తర్ ప్రదేశ్ నేత చంద్రశేఖర్ కూడా తొలుత ప్రజా సోషలిస్టు పార్టీ(పీఎస్పీ)తో రాజకీయ జీవితం ప్రారంభించినా 1964 నుంచి 1975 వరకూ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యునిగానే కొనసాగారు.
వయసులో చంద్రశేఖర్ కన్నా చిన్నవాడైన వీపీ సింగ్ కాంగ్రెస్ తరఫున ప్రధానులు ఇందిర, రాజీవ్ గాంధీ కేబినెట్లలో మంత్రిగా పనిచేయడమేగాక యూపీ కాంగ్రెస్ సీఎంగా కూడా పనిచేశారు. 1996–98 మధ్య కేంద్రంలో రెండేళ్లు జనతాదళ్ నేతలుగా సంకీర్ణ ప్రభుత్వాలకు ప్రధాని హోదాలో నాయకత్వం వహించిన దేవెగౌడ, గుజ్రాల్ కూడా కాంగ్రెస్ పార్టీలో 1960లు, 70ల్లో కొనసాగిన నాయకులే.
ఇలా తాజా పరిభాషలో ‘జనతా పరివార్’ తరఫున ఇలా ఆరుగురు తక్కువ కాలం ప్రధాని పదవిలో కొనసాగారు. మళ్లీ ప్రస్తుత బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ విషయానికి వస్తే–కాంగ్రెసేతర పార్టీ ప్రధానిగా అత్యధిక కాలం (ఆరేళ్ల 64 రోజులు) పదవిలో కొనసాగిన అటల్ బిహారీ వాజపేయి రికార్డును మోదీ జీ 2021లో అధిగమించిన విషయం తెలిసిందే. ఈ మే 30న దేశ ప్రధానిగా 9 ఏళ్లు పూర్తిచేసుకుని వచ్చే ఏడాది మే నెలాఖరుకు పది సంవత్సరాలు కొనసాగిన ప్రదాన మంత్రిగా మన్మోహన్ సింగ్ జీ రికార్డును సమం చేస్తారు.
దేశంలో ఇప్పటి వరకూ ఆరుగురు కాంగ్రెస్ ప్రధానులు, మరో ఆరుగురు కాంగ్రెస్ నేపథ్యం ఉన్న కాంగ్రెసేతర పార్టీల ప్రధానమంత్రులు ఉంటే, అసలు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని కాంగ్రెసేతర ప్రధానులు బీజేపీ నేతలైన అటల్ బిహారీ వాజపేయి, నరేంద్ర మోదీలు మాత్రమేననేది పైన చెప్పిన రాజకీయ పండితుల అభిప్రాయం.
