– మంత్రి కొండపల్లి సంఘటనపై బాలకోటయ్య వ్యాఖ్య
అమరావతి: ప్రజా రాజధాని అమరావతి ఉద్యమంలో ఏ ఒక్క రైతు కానీ, రైతు మహిళ కానీ, బహుజన ఉద్యమ కారులు కానీ, వైసీపీ నాయకులకు, నాటి మంత్రులకు తలవంచలేదని, ఎదిరించి పోరాడతామని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు.
మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ కాళ్ళు పట్టుకున్నారన్న వార్తల నేపథ్యంలో.. 1631 రోజుల రాజధాని ఉద్యమంలో రైతులు కానీ, ఉద్యమ నాయకులు కానీ వెన్నెముకతో పోరాడారే కానీ, వెన్ను వంచి సలాం చేయలేదని చెప్పారు.
2024 ఎన్నికల కురుక్షేత్రంలో పాండవులు గెలిచారను కున్నాం కానీ, ఉత్తర కుమారులు కూడా వారిలో ఉన్నారని అనుకోలేదని చెప్పారు. ఇటీవల నూజివీడు సంఘటనలోనూ మాజీ మంత్రి జోగి రమేష్ తో కలిసి తెలుగు దేశం పార్టీ నాయకులు ఊరేగింపు నిర్వహించటం కూడా బాధాకరం అన్నారు . కనీసం తెలుగు దేశం పార్టీ క్రమశిక్షణా సంఘం నోటీసులు కూడా ఇవ్వకపోవటాన్ని తెలుగు దేశం పార్టీ శ్రేణులే జీర్ణించుకోలేక పోతున్నారన్నారు.
ఇప్పటికే వైసీపీ నుంచి నాయకులు బారులు తీరి కూటమిలోని మూడు పార్టీల వైపు రావటాన్ని ఏదో ఘన విజయంగా చెప్పుకోవటం కూడా అవకాశవాద రాజకీయాలుగానే భావిస్తున్నారని, దీనిని సరిదిద్దు కోవాల్సిన అవసరం చాలా ఉందని చెప్పారు. ప్రజలు ఆశించింది చేరికలు, వలసలు కావని ఐదేళ్ళ విధ్వంసంపై ప్రక్షాళన పాలన అని చెప్పారు.
ప్రజలకు షార్ట్ మెమరీ ఉంటుందని, వారు వీటిని గుర్తు పెట్టుకోరు అని భావిస్తే, అవివేకం అవుతోందని తెలిపారు. వైసీపీ పాలనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ఎదురు వెళ్ళటం అంటే రైలు బండికి ఎదురెళ్ళటమే అని,అలా ఎదురెళ్ళి రాజధాని ఉద్యమంలో గెలిచామని బాలకోటయ్య గుర్తు చేశారు.