డిసెంబర్ 31 రోజున అందరికీ ఎక్కడ లేని హడావుడి.. ఎందుకంటే న్యూ ఇయర్ అట.. అర్ధరాత్రి 12 గంటలకు కొత్త సంవత్సరం మొదలవుతుందని సంబరాలు చేసుకుంటారు. మీరంతా సంబరాలు చేసుకుంటే ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ మనం సమగ్రమైన భారత కాలమానాన్ని మరచిపోయి, అర్థంలేని గ్రెగోరియన్ (ఆంగ్ల) క్యాలండర్ ను అనుసరిస్తున్నాం అని గమనించాలి. భారతీయ కాలమానం ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకృతికి విరుద్ధం. ఎలాగో గమనించండి.
భారతీయ కాలమానం ప్రకారం సూర్యోదయంతో దినం మొదలవుతుంది. మనకు ఒక రోజు అంటే ఇవాళ తెల్లవారుఝాము నుండి మరునాటి తెల్లవారు వరకూ. కానీ గ్రెగోరియన్ క్యాలండర్ మాత్రం అర్ధరాత్రి పూట దినం మొదలవుతుంది. అది తిరిగి అర్ధరాత్రి వరకూ కొనసాగుతుంది.
సృష్టిలో ఏ ప్రాణి అయినా తెల్లవారు ఝామునే నిద్ర లేస్తుంది.. మనుషులంతా ఉదయాన్నే నిద్ర లేచి దైనందిన కార్యక్రమాలకు సిద్ధమవుతాం. పక్షుల కిలకిలరావాలు సుమధురంగా వినిపించేది. తోటల్లో పూవులు వికసిస్తాయి. ఆవులు దూడలకు పాలను ఇస్తాయి. మరి ఈ చర్యలన్నీ అర్ధరాత్రి జరగడం మీరెప్పుడైనా చూశారా?
ప్రకృతి నియమాల ప్రకారం సాగే ఈ చర్యలు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అర్ధరాత్రి పూట జరగడం మీరు ఎక్కడైనా చూశారా?
మనం ఆలయాల్లో సుప్రభాత ప్రార్ధనలు తెల్లవారునే ఎందుకు చేస్తాం? అర్ధరాత్రి ఎందుకు చేయం. మన పండుగలు భారతీయ కాలమానం ప్రకారమే జరుపుకుంటున్నం. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడైనా జరుపుకుంటున్నామా?
భారతీయ సాంప్రదాయం ప్రకారం ఉగాదితో నూతన సంవత్సరం ఆరంభం అవుతుంది. సూర్యమానమైనా, చంద్రమానమైనా గ్రహాల గమనం, ప్రకృతి ధర్మాల ప్రకారం మన కాలమానం రూపుదిద్దుకుంది.
జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం అని చెప్పడానికి సరైన ప్రమాణాలు లేవు. రోమన్లు, గ్రీకులు పాటించే గ్రెగోరియర్ క్యాలెండర్ కాలగమనంలో అనేక మార్పులకు లోనైంది. యూరోప్ దేశాల వలస పాలన ద్వారా ప్రపంచ దేశాలన్నిటిపైనా బలవంతాన రుద్దబడింది. ఆంగ్లేయుల ద్వారా మన దేశానికి దాపురించింది.
నిజానికి స్పష్టమైన కాలగణన ఉన్నభారతీయ కాలమానమే ప్రపంచానికి ఆదర్శం. గ్రెగేరియన్ క్యాలండర్లో ఎన్నో లోపాలు కనిపిస్తాయి.
మనం నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాల్సింది ఉగాది రోజునే, జనవరి 1వ తేదీన జరుపుకోవాలని నియమం ఏమీ లేదు. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ను అనుసరిస్తున్నాయి. దీన్ని మనం క్యాలెండర్ మార్పుగానే గుర్తించాలి.