Suryaa.co.in

Andhra Pradesh

ఒక్క స్కూల్‌ కూడా మూసివేయడం లేదు

-ఒక్క స్కూల్‌ కూడా మూసివేయడం లేదు… ఆ ప్రసక్తే లేదు- ప్రభుత్వ పరంగా, ఒక మంత్రిగా, అధికారికంగా చెబుతున్నా
-8 వేల స్కూళ్లు ఎక్కడ మాయమయ్యాయో చూపండి
-మాయం కావడానికి అవేమైనా తోపుడు, ఎడ్ల బండ్లా?
-ఏమిటా భాష? ఏమిటా రాతలు? ఎందుకంత అనైతికత?
-రాష్ట్రంలో మొత్తం 42,750 స్కూళ్లు. 5250 స్కూళ్ల మ్యాపింగ్‌
-వాటిలో కిలోమీటర్‌ కంటే ఎక్కువ దూరంలో ఉన్నవి 296
-వాటిపైనా సమీక్షిస్తున్నాం. అవసరమైతే వాటినీ మారుస్తాం
-చదువుల్లో గందరగోళం అని రాశారు. ఏమిటా గందరగోళం?
-అసలు మీలోనే ఆ గందరగోలం! మీకే ఇబ్బంది వచ్చింది
-ప్రభుత్వ మంచి పనులతో మీకు దిక్కు తోచడం లేదు
-బడులు మూస్తే తిరగబడాలని రాశారు. ఏమిటా రాతలు?
-మరి బడులు మూయకపోతే మిమ్మల్ని ఏం అనాలి? ఏం చేయాలి?
-ఒకవేళ బడులు తెరిచి ఉంటే, మీ ఆఫీసులకు తాళాలు వేయాలా?
-ప్రెస్‌మీట్‌లో ఎల్లో మీడియాను నిలదీసిన మంత్రి బొత్స

తాడేపల్లి:ప్రెస్‌మీట్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడారంటే..:
నూతన విద్యా విధానానికి అనుగుణంగా:
దేశ చరిత్రలో స్వాతంత్య్రానంతరం రాష్ట్రంలో మాత్రమే విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొచ్చాం. అవి కూడా నూతన విద్యా విధానానికి అనుగుణంగానే చేస్తున్నాం. అవి మాకు మేముగా తేలేదు. విద్యా హక్కు, కొత్త విద్యా విధానాన్ని బేరీజు వేసుకునే, విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా సంస్కరణలు తీసుకొచ్చాం. నిరుపేదలు కూడా బాగా చదువుకోవాలని, ప్రతి ఒక్కరికి ఉన్నత విద్య అందించాలని, పాఠశాల స్థాయి నుంచే ఉత్తమ విద్యతో పాటు, విద్యార్థులకు అవకాశాలు కూడా కల్పించాలని సీఎం వైయస్‌ జగన్‌ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ దిశలో పలు పథకాలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.

బడులు మాయమా? ఇదా మీ వ్యక్తిత్వం?:
రెండు రోజులుగా ఈనాడు పత్రిక స్కూళ్ల మీద వార్తలు రాస్తోంది. బడి మాయమైపోయింది అంటూ రాశారు. వారిని సూటిగా అడుగుతున్నాను. బడి మాయమైపోవడానికి అదేమైనా తోపుడు బండా? లేక ఎడ్ల బండా? ఏమిటా భాష? ఏమిటా రాత? రాష్ట్రంలో ఒక్క బడి కూడా మూతబడలేదు. ఎక్కడ మాయమై పోయిందో చూపండి. రాష్ట్రంలో సుమారు 42,750 స్కూళ్లు ఉన్నాయి. అందులో ఒక్కటైనా మూత బడిందా? మూత పడుతోందా? ఈ వయసులో ఇన్ని అబద్దాలు ఎందుకు రాస్తున్నారు? ఇదా మీ వ్యక్తిత్వం?
చదువుల్లో గందరగోళం అని రాశారు. ఏమిటా గందరగోళం. అసలు మీకు గందరగోళం వచ్చింది. మీకు ఇబ్బంది వచ్చింది. ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల వల్ల ఏం తోచక మీరు గందరగోళ పడుతున్నారు.

మీ ఆఫీస్‌కు తాళాలు వేయాలా?:
ఆం«ధ్రజ్యోతిలో మరో కధనం. బడులు మూస్తే తిరగబడాలని రాశారు. ఏమిటా రాత? మరి బడులు మూయకపోతే నిన్ను ఏమనాలి? నిన్నేం చేయాలి? నీ దగ్గర పని చేస్తున్న వారికి తెలియదా? బడులు మూసాశా? తెరిచారా? అన్నది తెలియదా? ఒకవేళ బడులు తెరిచి ఉంటే, నీ ఆఫీసులకు తాళాలు వేయాలా? తిరగబడాలన్న నీ భాష అసలు సమర్థనీయమా?

కడుపు మంటతో దుష్ప్రచారం:
నిన్న మరో కథనం. పుస్తకాలు లేవు. చదువులు లేవు. అని రాశారు. అది పట్టుకుని చంద్రబాబు మాట్లాడారు. వారు పేపర్లో రాస్తారు. చంద్రబాబు మాట్లాడతారు. ఏమిటి వారి ఉద్దేశం అంటే, ప్రజలను అయోమయానికి గురి చేయడం.
అమ్మ ఒడి కార్యక్రమాన్ని కూడా తప్పు పట్టిన ఏకైక వ్యక్తి చంద్రబాబు. పేదింటి పిల్లలు కూడా బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో, వారి బతుకులు మార్చాలన్న లక్ష్యంతో అమ్మ ఒడి పథకం పెట్టాం. నీ మాదిరిగా జన్మభూమి కమిటీల మాదిరిగా దోచుకోవడానికి కాదు కదా?
ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న అక్కసు. ఆ కడుపుమంటతో ఇవన్నీ వారంతా కలిసి చేస్తున్నారు. దుష్ప్రచారం చేస్తున్నారు.

విద్యా ప్రమాణాల పెంపు:
రాష్ట్రంలో 42,750 స్కూళ్లు ఉన్నాయి. నూతన విద్యా విధానం ప్రకారం ఫౌండేషన్‌ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నాం. ఆ మేరకు అంగన్‌వాడీల్లో మార్పులు చేస్తున్నాం. ఒకటో తరగతి నుంచే విద్యా ప్రమాణాలు పెంచే విధంగా ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది.
గురుకుల పాఠశాలలు, సెంట్రల్‌ సిలబస్‌తో నడుస్తున్న స్కూళ్ల మాదిరిగా, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్‌ను పెట్టే విధానంతో మార్పులు చేస్తున్నాం. అది తప్పా? అలా వద్దు. అన్నీ ఒకే టీచర్‌ చెప్పాలంటారా? అది మంచి పద్ధతేనా? చెప్పండి. కేజీబీ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు మీరు చూడడం లేదా? గురుకుల విద్యార్థుల్లో నైపుణ్యత మీకు తెలియడం లేదా?

ఆ స్కూళ్లనూ మారుస్తాం:
కొన్ని స్కూళ్లు 3 కి.మీ దూరంలో ఉన్నాయని తెలిసింది. ఆ విషయం ప్రభుత్వం దృష్టికి రాగానే, సీఎంగారు స్పష్టంగా చెప్పారు. స్కూళ్లు కిలోమీటర్‌ లోపలే ఉండాలని, ఆ మేరకు అన్ని వసతులు కల్పించి, అవసరం మేరకు మెర్జింగ్‌ చేయాలని ఆయన నిర్దేశించారు.
రాష్ట్రంలో మొత్తం 42,750 స్కూళ్లకు గానూ 5250 స్కూళ్లు మాత్రమే మ్యాపింగ్‌ (3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మెర్జింగ్‌) చేశాం. వాటిలో 296 స్కూళ్లు కిలోమీటరు దూరం కంటే ఎక్కువలో ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. దాని వల్ల విద్యార్థులు ఇబ్బంది పడితే తప్పకుండా పునరాలోచిస్తాము. మార్పులు చేస్తాము.

ప్రభుత్వ విధానం సుస్పష్టం:
ఏదైనా కొత్త విధానం పెడితే, ఫలితాలు ఎలా ఉంటాయన్నది చూడాలి. ఆ మేరకు అవసరమైన మార్పులు చేసుకోవచ్చు. కానీ ఇలా పనికిమాలిన వార్తలు రాయడం సరైన పద్ధతేనా?
8 వేల స్కూళ్లు మాయమైపోయాయా? ఎక్కడ అవి కనపడకుండా పోయాయో చెప్పండి. మా విధానం స్పష్టంగా ఉంది. ఇంగ్లిష్‌ మీడియమ్‌లో పిల్లలు చదవాలి. వారూ జీవితంలో ఎదగాలి. పోటీ ప్రపంచంలో నిలబడాలన్నదే లక్ష్యం. ఆ దిశలోనే ఈ చర్యలు. వాటి ఫలితాలు కొన్నేళ్ల తర్వాత కనిపిస్తాయి. ఒక్క రోజులోనే రావు కదా?

చంద్రబాబు కనీసం ఆలోచించారా?:
పుస్తకాలు లేవు. చదువులు లేవని రాశారు. గత 5 ఏళ్లు చంద్రబాబు ఉన్నాడు కదా? మేము విద్యాకానుకలో అన్నీ ఫ్రీగా ఇచ్చాం. మరి చంద్రబాబు పిల్లలకు పుస్తకాలు, షూస్, సాక్సులు, బెల్టు, స్కూల్‌ బ్యాగ్‌ ఇచ్చాడా? చివరకు మధ్యాహ్న భోజనం కూడా సక్రమంగా పెట్టకుండా దోచుకుతిన్న చంద్రబాబు ఇవాళ మాట్లాడుతున్నాడు.
విద్యాదీవెన, వసతి దీవెన, విద్యా కానుక, అమ్మ ఒడి వంటి పథకాల ద్వారా విద్యార్థులకు ఎంతో మేలు చేస్తున్నాం. విద్యా వ్యవస్థ బాగు కోసం అవన్నీ అమలు చేస్తున్నాం.

ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ:
అదే విధంగా ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ కోసం జీఓ జారీ చేశాం. టీచర్ల అభ్యంతరాలు విన్నాం. ఆలోచించాం. కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించాం. ఈ ఉదయం విద్యార్థి నాయకులతో సమావేశమయ్యాను. వారు చెప్పినవి విన్నాను. మా చర్యలలో 90 శాతం వాటికి వారు ఆమోదం తెలిపారు. ఇంగ్లిష్‌ మీడియమ్‌ ప్రభుత్వ విధానమని చెప్పాం. ప్రభుత్వ విధానాన్ని ఉపాధ్యాయులు పాటించాలి. ఏమైనా లోటుపాట్లు ఉంటే సరి చేస్తాము. ఆ మేరకు అన్నీ ఒక్కొక్కటిగా చక్కదిద్దుతున్నాం.

అవన్నీ ఎవరైనా చేశారా?:
కానీ పనికిమాలిన వార్తలు రాయడం. దానిపై చంద్రబాబు మాట్లాడడం. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
నూతన విద్యా విధానానికి అనుగుణంగానే మార్పులు చేస్తున్నాం. విద్యార్థుల్లో ప్రావీణ్యం పెంచడం కోసం.. ఇంగ్లిష్‌ మీడియమ్‌లో బోధన. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ. బైజూస్‌ ద్వారా విద్యాబోధన. బైలింగ్వువల్‌ పుస్తకాలు. ఇవన్నీ గతంలో ఏనాడైనా, ఎవరైనా అమలు చేశారా?
వీటన్నింటితో పాటు నాడు–నేడుతో స్కూళ్లలో సమూల మార్పులు చేస్తున్నాం. స్కూళ్లలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఇప్పటికే తొలి దశ స్కూళ్లలో పనులు పూర్తి కాగా, రెండో దశ స్కూళ్లలో పనులు కూడా మొదలయ్యాయి. స్కూళ్లలో అవసరమైన తరగతి గదులు కడుతున్నాం. స్కూళ్లలో మొత్తం 10 రకాల వసతులు కల్పిస్తున్నాం. ఇంకా స్మార్ట్‌ క్లాస్‌ రూమ్‌లు ఉండేందుకు ప్రతి రూమ్‌లో డిజిటల్‌ టీవీ, టచ్‌ స్క్రీన్‌ ఏర్పాటు చేస్తున్నాం.
హైస్కూళ్లలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌. ప్రతి స్కూల్‌కు ఒక వాచ్‌మెన్‌ నియామకం. ఆ విధంగా ప్రభుత్వ బడులను పూర్తిగా మారుస్తున్నాం.
అయినా వీరు పుస్తకాలు లేవని రాస్తున్నారు. ఏం ఖర్మ వచ్చింది. అసలు ఇలాంటి ఆలోచన చంద్రబాబు ఏనాడైనా చేశాడా? కనీసం ఒక్క పని అయినా చేశాడా?

ఇదీ మా ప్రభుత్వ విధానం:
విద్య పట్ల మా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. సీబీఎస్సీ సిలబస్‌తో మూడో తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్‌ను పెట్టి, విద్యా ప్రమాణాలు పూర్తిగా మారుస్తున్నాం. ఇందులో ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కు తగ్గం. మా ప్రభుత్వ విధానం ఇది. ఇది చెత్త రాత. ఏ ఒక్క స్కూల్‌ కూడా మూతబడడం జరగదు. కాబట్టి ఇలాంటి వాటిని ఛీ కొట్టాలి.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
జగన్‌గారు విద్యావంతుడు:
చంద్రబాబు తాను తిరుపతిలో చదివానంటున్నాడు కదా. మరి జగన్‌ ఎక్కడ చదివాడు అన్నది కూడా అందరికీ తెలుసు కదా? ఆయన హెచ్‌పీఎస్‌లో చదివాడని తెలుసు కదా? అంటే ఆయన కూడా మంచి విద్యా ప్రమాణాలు కలిగి ఉన్నాడనేది తెలుస్తుంది కదా? అసలు జగన్‌గారి మాదిరిగా ఇంగ్లిష్‌ చంద్రబాబు మాట్లాడగలడా? జగన్‌గారికి ఉన్న ఐక్యూ చంద్రబాబుకు ఉందా?.
చంద్రబాబుకూ తెలివి ఉంది. మోసం చేయడం, దగా చేయడం, వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు దిట్ట. అవేవీ జగన్‌గారికి లేవే. ఆయనకు అసలు అలాంటి ఆలోచనలే రావే.

అమ్మ ఒడి–హాజరు తప్పనిసరి:
అమ్మ ఒడి పథకంలో గత ఏడాది కంటే 52 వేల మంది తగ్గారని ముందే చెస్పాం. ఎందుకంటే 75 శాతం హాజరు తప్పనిసరి అన్నాం. అందులో రాజీ పడబోమన్నాం. అందుకే పిల్లలు బడికి రావాలని చెప్పాం. హాజరు శాతం పెంచుకోవాలని కోరాం. అసలు అమ్మ ఒడి పథకాన్ని చంద్రబాబు ప్రారంభించి ఉంటే, మేము ఆ సంఖ్యను తగ్గిస్తే తప్పు పట్టాలి. కానీ ఆ పథకాన్ని మేమే కదా ప్రారంభించింది? పిల్లలు బడికి రావాలి. బాగా చదువుకోవాలి. అందుకే 75 శాతం హాజరు తప్పనిసరి చేశాం. జీఓ చూస్తే అన్నీ అర్ధం అవుతాయి. అన్నీ చౌకబారు ఉపన్యాసాలు. పనికి మాలిన మాటలు.

జీఓ.117 సవరణ:
జీఓ.117 మీద కూలంకషంగా చర్చించాం. అవసరమైన మార్పులు చేసి కొత్త జీఓ ఇచ్చాం. సింగిల్‌ టీచర్‌ వద్దన్నారు. ప్రతి 20 మంది పిల్లలకు ఇద్దరు టీచర్లు. ప్రతి హైస్కూల్‌కు ఒక హెడ్మాస్టర్, పీఈటీ తప్పనిసరి. ఒక టీచర్‌కు 36 మంది పిల్లలే ఉండాలని కొత్త జీఓలో నిర్దేశించాం.

ఒక్క స్కూల్‌ కూడా మూయడం లేదు:
పిల్లలకు మూడో తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్‌ ఉండడం చాలా మంచిది కదా? కిలోమీటర్‌ దూరంలోనే స్కూళ్లు ఉండేలా చూస్తున్నాం.
అంతే కానీ ఈ చెత్త పేపర్లు రాసినట్లు ఒక్క స్కూల్‌ కూడా మూసివేయడం జరగదు. ఆ ప్రసక్తే లేదు. ప్రభుత్వ పరంగా, ఒక మంత్రిగా, అధికార పూర్వకంగా చెబుతున్న మాట. ఒక్క స్కూల్‌ కూడా మూయడం లేదు.

విజయమ్మగారిపై ఎంతో గౌరవం:
ఎవరో ఏదో రాస్తే, దానికి మేము సమాధానం ఎలా చెబుతాం? ప్లీనరీలో ఏం నిర్ణయం తీసుకున్నా, అక్కడే వేదికపై చెబుతాం. ఒక మంచి కార్యక్రమం జరుగుతుంటే, ఓర్చుకోలేని వారు ఏదేదో మాట్లాడతారు. వాటన్నింటికీ మేము సమాధానం చెప్పాలా?
విజయమ్మ గారు చాలా గౌరవమైన వ్యక్తి. ఆమె వైయస్సార్‌గారి సతీమణి. ఆమె అంటే మాకు ఎంతో గౌరవం. చంద్రబాబు మాదిరిగా ఆమె ఎవరికీ వెన్నుపోటు పొడవలేదు కదా? ఆ పని చేసిన చంద్రబాబు కాలర్‌ ఎగరేసుకుని తిరుగుతున్నాడు.

LEAVE A RESPONSE