Suryaa.co.in

Andhra Pradesh

అక్రమ అరెస్టులపై కాదు…అంగన్ వాడీ సమస్యలపై దృష్టి పెట్టండి

టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు

అమరావతి: సమస్యల పరిష్కారం కోసం 11 రోజులుగా సమ్మెలో ఉన్న అంగన్ వాడీల నిరసనలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం జగన్ ప్రభుత్వ అహంకార దోరణికి నిదర్శనం. సేవకు ప్రతిరూపంగా ఉన్న అంగన్ వాడీల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్దితో ప్రయత్నం చేయకపోగా న్యాయం కోసం రోడ్డెక్కిన వారి నిరసనలను అణిచివేయడం దుర్మార్గం. నాడు అంగన్ వాడీల కష్టాన్ని, సేవను తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించింది. 2014 నాటికి రూ. 4,200 వేతనం పొందుతున్న అంగన్వాడీలకు రూ. 6,300 పెంచి రూ.10,500 చేశాం.

ఎటువంటి ఆంక్షలు లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరవాత అంగన్వాడీల కష్టాలు మొదలయ్యాయి. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వారి జీతాలు పెంచలేదు. చెల్లింపులు జరపడం లేదు. పైగా అర్థం లేని ఆంక్షలు పెట్టి వారి సంక్షేమ పథకాలకు కోతలు పెట్టారు. దీనిపై నిరసనగా వారు చేపట్టిన సమ్మెను విచ్చిన్నం చేయడానికి పోలీసులు, వైసీపీ నేతలు అనుసరిస్తున్న విధానం నివ్వెరపరిచింది. న్యాయ బద్దమైన డిమాండ్లతో 11 రోజులుగా సమ్మె చేస్తుంటే పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం నిరంకుశత్వమే.

సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లి ఎన్ఆర్ఐ యువకుడిని అరెస్టు చేయడంపై పెట్టి శ్రద్ద…అంగన్ వాడీ సమస్యల పరిష్కారం పై ఈ ప్రభుత్వం ఎందుకు పెట్టలేకపోతుంది? ఆనారోగ్యంతో ఉన్న తల్లి కోసం స్వదేశానికి వస్తున్న ఎన్ఆర్ఐ యువకుడు యష్ బొద్దులూరి అరెస్టు కోసం పోలీసులను ప్రత్యేకంగా పక్క రాష్ట్రానికి పంపించి అరెస్టు చేశారు. కానీ ఇంటి పక్కన నిరసనలు చేస్తున్న అంగన్ వాడీల సమస్యలు పరిష్కరించేందుకు కనీసం సమయం పెట్టలేదు. వీటి ద్వారా జగన్ ప్రభుత్వ ప్రాధాన్యాలు ఏంటో ప్రజలకు స్పష్టంగా అర్థం అవుతుంది. ప్రభుత్వం అక్రమ కేసులు, నోటీసులు, వేధింపుల కోసం వెచ్చిస్తున్న సమయాన్ని సమాజానికి సేవ చేస్తున్న అంగన్ వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారంపై పెట్టాలి.

LEAVE A RESPONSE