Suryaa.co.in

Andhra Pradesh

ప్రజల ఆస్తులకే కాదు ఏడుకొండలవారి ఆస్తులకు కూడా రాష్ట్రంలో రక్షణ లేదు

– శాసనసభ్యులు డోల బాల వీరాంజనేయస్వామి

రాష్ట్రంలో ప్రజల ఆస్తులకే కాదు ఏడుకొండలవారి ఆస్తులకు కూడా రక్షణ లేదు. తిరుమలలో రోజు రోజుకు శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సు చోరీకి గురవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. తిరుమలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే విషయం ఈ సంఘటన ద్వారా బట్టబయలైంది. దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తూ.. ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారు.

లడ్డు ధరలు, వసతి గృహాల అద్దెలు, తిరుమల ఘాట్ లోని టోల్ గేట్ చార్జీలు, టీటీడీ కల్యాణ మండపం అద్దెలు పెంచి ప్రజలను దోచుకోవడంలో మునిగితేలుతూ టీటీడీ పరిరక్షణ బాధ్యతను గాలికి వదిలేశారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే కొండమీద ఉన్న ఏడుకొండల వారి విగ్రహాన్ని కూడా మాయం చేసేలా కనిపిస్తున్నారు. అసమర్థులను పాలక మండలిలో నియమించి టీటీడీని అస్తవ్యస్తం చేస్తున్నారు. కొండకు నడిచివెళ్లే భక్తులకు కూడా రక్షణ లేకుండా పోయింది. వీఐపీలు, అధికార పార్టీ నేతల భద్రతపై చూపుతున్న శ్రద్ధ.. సామాన్యులపై గానీ, టీటీడీ ఆస్తులపై గానీ చూపించడం లేదు.

టీటీడీ గోశాల నుంచి స్వామివారికి ఉపయోగించాల్సిన ఆవు పాలను అధికారులు వైసీపీ నేతల ఇళ్లకు పంపడం దుర్మార్గం. ప్రతిపక్ష నేతలను ఇళ్లల్లోనుంచి బయటకు రాకుండా పోలీసులతో ఇళ్ల ముందు కాపలా పెడుతూ.. స్వామివారి ఆస్తులకు భద్రత లేకుండా చేశారు. పోలీసులను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం వల్లనే టీటీడీ బస్సులు చోరీకి గురవడం, అడవుల్లో ఉండాల్సిన పులులు రోడ్డెక్కడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. భక్తుల చేతులకు కర్రలు ఇవ్వడం వంటి అనాలోచిత నిర్ణయాలతో టీటీడీని అప్రతిష్టపాలు చేస్తున్న పాలక మండలిని భక్తులే పారదోలే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.

LEAVE A RESPONSE