-వెలగపూడి గోపాలకృష్ణ
1. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కు నేడు చట్టబద్ధత ఉన్నదా? లేదా? ఆ కార్పోరేషన్ కు 2015 -16 వార్షిక బడ్జెట్ లో రు.371 కోట్లు కేటాయించారా? లేదా? ఈ రెండూ చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన చర్యలు అయినప్పుడు ఇహ! “నోట్ ఫైల్స్” చుట్టూ గోల దేనికోసం?
2. శాసన సభ ఆమోదించిన వార్షిక బడ్జెట్ లో నిధులు కేటాయించాక, ఆ నిధులను ఆర్థిక శాఖ కార్పోరేషన్ కు ఇవ్వాల్సిందే కదా? ప్రయివేటు సంస్థలతో కుదుర్చుకొన్న త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం జవాబుదారీతనంతో, సక్రమంగా ఆ నిధులను ఖర్చు చేయాల్సిన బాధ్యత ఆ కార్పోరేషన్ కు ప్రత్యక్షంగా బాధ్యతవహిస్తున్న అధికారులదే కదా? కుంభకోణం జరిగితే వాళ్ళనే కదా! ముందు శిక్షించాల్సింది? శిక్షించారా?
3. బడ్జెట్ లో కేటాయించింది రు.371 కోట్లు. జి.ఎస్.టి. మినహాయించాక రు.330 కోట్లు పథకానికి ఖర్చు చేయాల్సి ఉందని సిఐడి తెలియజేసింది. ఈ పథకం అమలులో భాగంగా ఆరు క్లస్టర్స్ పరిధిలో 36 శిక్షణా కేంద్రాలను నెలకొల్పి, మౌలిక సదుపాయాలు కల్పించి, 2,13,000 శిక్షణ ఇచ్చి, దాదాపు 75,000 వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభించేలా దోహదపడిందని అధికారిక గణాంకాలే తెలియజేస్తున్నాయి. ఈ పని చేయడానికి ఎంత ఖర్చు అయి ఉంటుందో ప్రభుత్వం నిజాయితీతో వెల్లడించాలి.
4. పథకం అమలు గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే మంజూరు చేసిన రు.330 కోట్లలో రు.271 కోట్లు డొల్ల కంపెనీల ద్వారా దారి మళ్ళి పోయిందంటే నమ్మశక్యంగా ఉన్నదా? విజ్ఞతతో ఆలోచించాలి.
5. అధారారహిత ఆరోపణలతో సిఐడి కేసు నమోదు చేసి, చట్ట వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసి, కోర్టు ముందు దోషిగా నిలబెడితే న్యాయస్థానం ఏం చేయాలి? ఆధారాలు చూపెట్టమని అడగాలి కదా? అడిగారా? ఆధారాలు చూపెట్టకుండా అనుమానించి అరెస్టు చేశాం, విచారణను కొనసాగించి, భవిష్యత్తులో ఆధారాలు దొరికితే న్యాయస్థానంకు అందజేస్తాం, ప్రస్తుతానికి ముద్దాయిని జైలుకు పంపండని సిఐడి తరుపు న్యాయవాది కోరడం, న్యాయస్థానం అంగీకరించడం సమర్థనీయమా?
6. నాకొచ్చిన ఈ ధర్మసందేహాలతో పాటు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో చంద్రబాబుకు రక్షణ ఏర్పాట్లు, చంద్రబాబుపై ప్రభుత్వం మోపిన ఇతర కేసులు, టిడిపి – జనసేన రానున్న ఎన్నికల్లో పొత్తు, బిజెపి కోసం ఆరాటపడుతున్నట్లు పవన్ కళ్యాణ్ మాటల్లో ధ్వనించిన అంశంపైన నా అభిప్రాయాలను తెలియజేశాను.