వచ్చే రెండేళ్ల కాలానికి (2023-25) రాష్ట్రంలోని 2 వేలా 620 ఏ 4 దుకాణాల (వైన్ షాపుల) ద్వారా మద్యం విక్రయించడం కోసం లైసెన్సులు మంజూరు చేసే ప్రక్రియను ఎక్సైజ్ శాఖ ప్రారంభించింది. ఈ మేరకు ఈనెల 4 న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ ప్రకారం నిర్వహించాల్సిన ప్రక్రియపై అన్ని జిల్లాల ఎక్సైజ్ అధికారులతో రాష్ట్ర ఎక్సైజ్ డైరెక్టర్ ఫారూఖీ, ఇతర ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. మద్యం ఆక్షన్ల ప్రక్రియపై వాళ్లకు మార్గనిర్దేశనం చేశారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈనెల 4 వ తేదీన నోటిఫికేషన్ రానుండగా, అదేరోజు నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈనెల 20 లేదా 21 వ తేదీన లాటరీలు నిర్వహించి షాపులు కేటాయించనున్నట్లు సమాచారం. అయితే, గత రెండేళ్ల పాలసీనే ఈసారి కూడా అమలు చేస్తారని, దరఖాస్తు ఫీజు, దుకాణాల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదని, ఎస్సీ, ఎస్టీ, గౌడ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు యథాతథంగా అమలవుతాయని తెలుస్తోంది.