Suryaa.co.in

Sports Telangana

తెలంగాణ బ్యాట్మింటెన్ అసోసియేషన్

వయస్సు తగ్గించి పిన్న వయస్కులతో పోటీ!

– నకిలీ డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికెట్లతో బ్యాట్మింటెన్ క్రీడాకారులు
– వారి తల్లిదండ్రులకు తెలిసే సాగిన ఈ గోల్‌మాల్‌ వ్యవహారం
– బోగస్‌ మెడికల్‌ సర్టిఫికెట్లతో సహకరిస్తున్న కొందరు వైద్యులు
– బీఏఐకి ఇవే దాఖలు చేస్తూ తమ కంటే చిన్న వారితో పోటీల్లోకి
– జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకర్లు, గోల్డ్‌ మెడలిస్టులు సైతం
– ఆకాశరామన్న లేఖ ఆధారంగా సిటీ సీసీఎస్‌ పోలీసుల దర్యాప్తు
– ముగ్గురు విషయంలో రూఢీ, మరో 40 మంది ఉంటారని సందేశం
– తెలంగాణ బ్యాట్మింటెన్ అసోసియేషన్ లకు లేఖ రాసిన డీసీపీ డీడీ
– రెండు నెలలు దాటినా ఇప్పటి వరకు స్పందించని ఆసోసియేషన్

బ్యాడ్మింటన్ లో 12 ఏళ్ల వయస్సున్న క్రీడాకారుడు అదే వయస్సులో ఉన్న మరో ప్లేయర్‌తో పోటీ పడాలి. అప్పుడే సరైన ప్రతిభ బయటకు వచ్చి అర్హులకు పతకాలు లభిస్తాయి. నిబంధనలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు జాతీయ స్థాయి క్రీడాకారులు తమ డేట్‌ ఆఫ్‌ బర్త్‌ల విషయంలో భారీ స్కామ్‌కు పాల్పడ్డారు.

బ్యాట్మింటెన్ అసోసియేషన్ ఆఫ్‌ ఇండియాకు (బీఏఐ) నకిలీ సర్టిఫికెట్లు సమర్పిస్తూ తమ వయస్సు తగ్గించేసుకున్నారు. ఆకాశరామన్న ఉత్తరం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైౖ మ్‌ స్టేషన్ (సీసీఎస్‌) పోలీసులు ముగ్గురి విషయంలో ఈ స్కామ్‌ను నిర్థారించారు. సమగ్ర ఆధారాలతో తెలంగాణ బ్యాట్మింటెన్ అసోసియేషన్ కు లేఖ రాసినా… వారి నుంచి స్పందన కరువైంది.

మార్చిలో అందిన ఉత్తరం ఆధారంగా…

ఈ స్కామ్‌కు సంబంధించిన సమాచారాన్ని సిటీ సీసీఎస్‌ పోలీసులకు ఓ అజ్ఞాత వ్యక్తి లేఖ ద్వారా అందించాడు. ఈ ఏడాది మార్చి 29న అందిన ఈ లేఖలో ఆరుగురు క్రీడాకారులపై ఆరోపణలు చేసిన సదరు వ్యక్తి సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా కోరాడు. ఈ క్రీడాకారుల తమ అసలు వయస్సును దాచి పెట్టి నకిలీ సర్టిఫికెట్లను బీఏఐకి సమర్పించారని, ఇలా తమ కంటే చిన్న వారితో పోటీల్లో తలపడుతూ అడ్డదారిలో మెడల్స్, జాతీయ స్థాయి ర్యాంకులు సాధిస్తున్నారని అజ్ఞాత వ్యక్తి తన లేఖలో పేర్కొన్నారు.

ఈ పరిణామాలతో అనర్హులకు పతకాలు, గుర్తింపు రావడంతో పాటు అర్హులైన క్రీడాకారులు తీవ్ర నిరాశ నిస్ఫృహలకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే బీఏఐకి అనేక మంది నుంచి ఫిర్యాదులు వెళ్లాయని, అయితే ఈ విషయాన్ని వాళ్లు పట్టించుకోవట్లేదని ఆరోపించారు.

సమగ్ర దర్యాప్తు చేసిన సీసీఎస్‌…

కేవలం ఈ ఆరుగురే కాదని, దాదాపు 40 మంది బ్యాట్మింటెన్ ఆటగాళ్ల వయస్సు విషయంలో తమకు సందేహాలు ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు. వీరిలో చాలా మంది 2005–10 మధ్య పుట్టారని, అయితే డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికెట్లకు బదులుగా కొందరు వైద్యులు ఇచ్చిన బోగస్‌ మెడికల్‌ సర్టిఫికెట్లు దాఖలు చేసి తమ వయస్సు తగ్గించుకున్నారని ఆ అజ్ఞాత వ్యక్తి పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు.

ఈ క్రీడాకారులకు తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది కోచ్‌లు, వారి తల్లిదండ్రులతో పాటు ఈ వైద్యుల సహకారం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ స్కామ్‌ మొత్తం వారి ఆధీనంలోనే నడుస్తోందని ఆరోపించారు. ఈ ఆకాశరామన్న ఉత్తరాన్ని సిటీ పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. అందులోని ఆరోపణల్లో నిజమెంతో నిగ్గు తేల్చాలని నిర్ణయించుకున్నారు. దీంతో సీసీఎస్‌ ఇ¯Œ స్పెక్టర్‌ కె.చంద్రకుమార్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.

ముగ్గురి విషయంలో ఆధారాలు లభ్యం…

ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన సీసీఎస్‌ పోలీసులకు తొలి దశలోనే ముగ్గురు క్రీడాకారులకు సంబంధించిన సమగ్ర ఆధారాలు లభించాయి. బ్యాట్మింటెన్ అసోసియేషన్ ఆఫ్‌ ఇండియా జాబితాలో అండర్‌–17 కేటగిరీలో 1176 పాయింట్లతో మూడో ర్యాంకులో ఉన్న రోహన్ కుమార్‌ ఆనంద్‌దాస్‌ రాజ్‌ కుమార్ తన పుట్టిన తేదీని 2007 జనవరి 29గా పేర్కొంటూ బీఏఐకు సర్టిఫికెట్లు సమర్పించి టోర్నమెంట్స్‌లో ఆడాడు. వాస్తవానికి రోహన్ పుట్టిన తేదీ 2005 అక్టోబర్‌ 29గా పోలీసులు నిర్థారించారు.

ఇదే కేటగిరీలో 92 పాయింట్లతో 44వ ర్యాంక్‌లో ఉన్న దవు వెంకట శివ నాగ రామ్‌ మౌనీష్‌ పుట్టిన తేదీని 2007 జనవరి 29గా పేర్కొంటూ బీఏఐలో సర్టిఫికెట్లు దాఖలు చేశారు. ఈ క్రీడాకారుడి అసలు పుట్టిన తేదీ 2006 జూన్ 4గా దర్యాప్తులో తేలింది. అండర్‌–15 కేటగిరీలో 188 పాయింట్లతో 32వ ర్యాంక్‌లో ఉన్న భూక్యా నిషాంత్‌ తన డేట్‌ ఆఫ్‌ బర్త్‌ను 2010 అక్టోబర్‌ 12గా పేర్కొనగా… ఇతడి వాస్తవ పుట్టిన తేదీ 2007 జనవరి 12గా తేలింది. వీళ్లు మైనర్లు కావడంతో తమంతట తాముగా ఇలాంటి చర్యలకు పాల్పడలేరని, వాళ్ల కోచ్‌లు లేదా తల్లిదండ్రుల ప్రోద్భలంతోనే ఇలా చేసినట్లు భావిస్తున్నారు.

ఏమాత్రం స్పందించని అసోసియేషన్ …

ఆకాశరామన్న ఉత్తరం ఆధారమంగా తొలి దశ దర్యాప్తులోనే ముగ్గురి వ్యవహారం వెలుగులోకి రావడంతో హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తయ్యారు. ఇలాంటి వాళ్లు మరికొందరు ఉండి ఉంటారని అనుమానించారు. ఈ వ్యవహారాన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలన్నా, బా«ధ్యుల్ని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నా బ్యాట్మింటెన్ అసోసియేషన్ ఫిర్యాదు తప్పనిసరి. ఈ నేపథ్యంలో తమకు అజ్ఞాత వ్యక్తి రాసిన లేఖ, తాము దర్యాప్తులో గుర్తించిన అంశాలతో పాటు మౌనీష్, నిషాంత్, రోహన్ లు సమర్పించిన నకిలీ సర్టిఫికెట్లు, వారి అసలు సర్టిఫికెట్ల ప్రతులతో సమగ్ర నివేదిక తయారు చేశారు.

దీన్ని తెలంగాణ బ్యాట్మింటెన్ అసోసియేషన్ దృష్టికి తీసుకువెళ్తూ ఈ ఏడాది మే 25న లేఖ (నెం.65/పీఈ/క్యాంప్‌/డీసీపీ/డీడీ/సీసీఎస్‌/డీడీ/2023) రాశారు. దీనిపై తగిన చర్యలు తీసుకుని తమకు తెలపాలంటూ ఆ లేఖలో డిటెక్టివ్‌ డిపార్ట్‌మెంట్‌ డీసీపీ కోరారు. అయితే ఇప్పటి వరకు అసోసియేషన్ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో వారికి తెలిసే ఈ స్కామ్‌ జరుగుతోందా? అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కామ్‌ దేశ వ్యాప్తంగా విస్తరించి ఉంటుందని భావిస్తున్నారు. సమగ్ర దర్యాప్తు చేస్తే మరిందని వ్యవహారాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు.

 

LEAVE A RESPONSE