అమరావతి రాజధాని విస్తరణలో భాగంగా రెండోదశ పూలింగు నోటిఫికేషన్ ను జనవరి 3న విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. గత టిడిపి పాలనలో రాజధాని ప్రక్రియ జనవరిలోనూ మొదలైందని, ఇప్పుడు కూడా జనవరిలోనే ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా పల్నాడు జిల్లా అమరావతి, గుంటూరు జిల్లా తుళ్లూరు పరిధిలో ఏడు గ్రామాల నుండి భూసమీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది.
నవంబరు 27 జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఏడు గ్రామాల్లో భూ సమీకరణ అధికారాన్ని సిఆర్డిఎ కమిషనర్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. తాజా నోటిషికేషన్ ద్వారా 16,562.56 ఎకరాల పట్టా భూమి, 104.01 ఎకరాలు అసైండ్ భూమి మొత్తం 16,666.57 ఎకరాలు సమీకరించనున్నారు. దీంతోపాటు ప్రభుత్వ భూమి 3828.56 ఎకరాలు తీసుకోనున్నారు. దీనికి సంబంధించి కాంపిటెంట్ అథారిటీకి అవసరమైన అధికారులను ఎంపిక చేసింది. కార్యాలయాలూ తీసుకుంది.
డిసెంబర్ లో నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినా వేర్వేరు కారణాలతో ఆలస్యమైంది. తుళ్లూరు మండలంలోని పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రాపురం గ్రామాలు, అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్లపూడి లేమల్లెలో భూసమీకరణకు సంబంధించిన వివరాలను రెవెన్యూ అధికారులు సేకరించి నివేదికలు తయారుచేసి ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించారు. కొన్ని గ్రామాల్లో రైతులు ఇప్పటికే భూములు ఇస్తామని చెప్పి వారి భూముల పట్టాలను మంత్రి నారాయణకు అందజేశారు.
వడ్డమానులో రైతులతో సమావేశం సందర్భంగా నాలుగేళ్లలో అభివృద్ధి చేసి ఇవ్వాలని లేనిపక్షంలో రైతుకు ఐదు లక్షలు పరిహారం ఇచ్చేలా ఒప్పంద పత్రంలో చేర్చాలని రైతులు కోరారు. దీనిపై గతంలోనే గ్రామసభలూ నిర్వహించిన సంగతి తెలిసిందే. జనవరి మూడోతేదీన నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరి 28వతేదీలోపు ప్రక్రియను ముగించేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది.
– వల్లభనేని సురేష్
(సీనియర్ జర్నలిస్ట్)
9010099208