Suryaa.co.in

Andhra Pradesh

బాబు మెలో డ్రామాలను ఎన్టీఆర్ కుటుంబం నమ్మొద్దు

– ఎన్టీఆర్ పైనే ఆయన బిడ్డలకు విషాన్ని ఎక్కించిన బాబుకు.. భార్యను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం ఒక లెక్కా..!
– బావకు బాలకృష్ణ తానా తందానా..!
– బాబు మైక్ కట్ చేస్తే.. సెల్ ఫోన్లలో వీడియోలు తీసి క్షణాల్లో ప్రచారం చేసిన వారు, మేం నిందలేస్తే ఆధారాలు ఎందుకు చూపించరు?
– రాజకీయంగా బాబు పాతాళానికి చేరారు.. కన్నీటి ఎపిసోడ్ ఓ డ్రామా
– దేవాలయం లాంటి అసెంబ్లీలో బూతుల సంస్కృతిని ప్రవేశపెట్టింది బాబే
– రాజకీయాల కోసం బాబు ఇంతలా దిగజారడం… బ్లాక్ డేనే
– అసెంబ్లీలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా చంద్రబాబు కుటుంబం, సతీమణి గురించి ప్రస్తావన చేయలేదు
– చంద్రబాబు మాటలు నమ్మి నిజం తెలుసుకోకుండా నందమూరి కుటుంబం మాపై నిందలు వేయడం సరికాదు
– రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ప్రెస్ మీట్
మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
రాజకీయాల్ని రాజకీయాలతోనే ఎదుర్కొవాలనే విషయాల్ని వదిలి.. అసత్యాలతో, జరగని విషయాలను జరిగినట్టు, కుటుంబాల్ని, కుటుంబ మర్యాదల్ని పణంగా పెట్టి.. చంద్రబాబు ఈ మెలో డ్రామాకు తెరదీయటమనేది రాజకీయాల్లో ఉన్న వారందరికీ బాధకరమైన విషయమని మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబు కన్నీటి ఎపిసోడ్‌ అంతా ఓ డ్రామా అని మంత్రి పేర్ని నాని తెలిపారు. నిన్నటి సభలో చంద్రబాబు సతీమణి గురించి ఏ ఒక్క సభ్యుడూ ఏమీ అనలేదని, అనని మాటలను అన్నట్టు చిత్రీకరిస్తూ బాబు దిగజారుడు రాజకీయాలకు తెర లేపారని పేర్ని నాని మండిపడ్డారు.
చంద్రబాబు ఏం చెబితే బాలకృష్ణ అది నమ్ముతున్నారని మంత్రి చెప్పారు. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు వారి అనుభవాన్ని అంతా రంగరించి, ఆయన మేధాశక్తిని అంతా క్రోడీకరించి ఈరకమైనటువంటి మెలో డ్రామాని రచించటం రాజకీయాల్లో ఒక దురదృష్టకరమైన సంఘటన. అసెంబ్లీలో ఏ ఒక్క సభ్యుడు కూడా చంద్రబాబు కుటుంబ సభ్యుల్ని లేదా వారి శ్రీమతి గారిని దూషణ చేసిన సందర్భం కానీ వారి పేరు ఉచ్ఛరించటం గానీ, వారి విషయాన్ని ప్రస్తావించటం గానీ.. జరగకపోయినప్పటికీ ఈ రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం దురదృష్టకరం.
రాజకీయ అవసరాల కోసం కుటుంబ సభ్యుల్ని వాడుకోవడం దురదృష్టకరమని మంత్రి పేర్ని నాని అన్నారు. నా ఒక్కడికే కాదు.. వైయస్‌ఆర్‌సీపీకి, రాజకీయాల్లో ఉన్న అందరికీ బాధాకరం. ఇప్పటికే అసత్యాలతో, నిందాపూర్వక ఆరోపణలతో చంద్రబాబు కొత్త రాజకీయాలను తెర తీశారు. ఇప్పటికే ఒక రాజకీయ నాయకుడ్ని మరో రాజకీయ నాయకుడ్ని అసత్యాలతో, నిందాపూర్వక ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు మాటల్ని, ఆయన చెప్పిన అసత్యాల్ని ముందుకు తీసుకెళ్లే వారిని ఒకటే అడుగుతున్నాను. చంద్రబాబు కుటుంబ సభ్యుల్ని, వారి శ్రీమతిని ఎవరన్నారు, ఏమన్నారు? ఇవతల ఉన్నవారు ఏమైనా సంస్కారం లేనివారు అనుకున్నారా? చంద్రబాబు ఇటువంటి రాజకీయాలను చేయడం ద్వారా… వ్యవస్థని, రాజకీయాల్ని ఎక్కడకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు..?
చంద్రబాబుకు మైక్‌ కట్ చేశారని వారి శాసనసభ్యుడు సెల్ ఫోన్ లో వీడియో తీస్తే క్షణాల్లో దాన్ని విలేకరులకు, మీడియా మాధ్యమానికి క్షణాల్లో పంపించారు కదా. ఫోన్లల్లో రికార్డు చేశారు కదా. వాస్తవానికి అసెంబ్లీలో ఫోన్లతో చిత్రీకరించకూడదు. రూల్స్‌కు విరుద్ధం. సాంప్రదాయాలకు విరుద్ధం. అయినప్పటికీ కూడా మీరన్నీ షూట్ చేస్తున్నారు కదా! ఎక్కడన్నా.. ఏ వ్యక్తి అయినా మాట్లాడాడా.. మీదగ్గర ఒక్క ఆధారం ఉందా? మరీ హేయంగా, దుర్మార్గంగా అనని మాటని, జరగని విషయాన్ని, చెడుగా చిత్రీకరించి తద్వారా రాజకీయ అవసరాలకు తెరదీయటం దురదృష్టకరం. వ్యక్తుల్ని, వ్యక్తిత్వాన్ని అసభ్యంగా కించపరిచే రీతిలో తిట్టించే సంస్కృతికి తెరదీసింది చంద్రబాబే.
రాజకీయాలు ఈ స్థితికి దిగజారటానికి కానీ, దాని కొనసాగింపునకు చంద్రబాబుగాక ఇంకెవరు కారణం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, టీడీపీ వారిని, ఎక్కడెక్కడో ఉన్న తెలుగు ప్రజలను రాష్ట్ర రాజకీయాల్ని పరిశీలిస్తున్న వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రబాబు సతీమణి గురించి అసెంబ్లీలో ప్రస్తావన రాలేదు. ఎవరైనా ఆమె ప్రస్తావన గానీ, పల్లెత్తు మాట గానీ అనలేదన్నది సత్యం. చంద్రబాబు చెప్పేవి అసత్యాలు. ఆయన జరగని విషయాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయటం దురదృష్టకరం. అంబటి రాంబాబు అనని మాటల్ని, కాకినాడ శాసనసభ్యుడు మాట్లాడని మాటల్ని, ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు కూడా అన్నట్టు చిత్రీకరించారు. చంద్రబాబు మాటలు వారు బలంగా నమ్మి మాట్లాడారాని విశ్వసిస్తున్నారు. అంబటి రాంబాబు అసెంబ్లీ లైవ్‌లో మాట్లాడారు. ఫీడ్‌ అంతా, టీడీపీకి వత్తాసు పలికే మీడియాలో ఏబీఎన్, టీవీ5 దగ్గరా కూడా ఉంది. చూసుకోండని పేర్ని నాని సూచించారు.
అనని మాటల్ని సత్తెనపల్లి, కాకినాడ శాసనసభ్యులకు ఆపాదించి వైయస్‌ఆర్‌సీపీ మీద రాజకీయంగా పైచేయి సాధించాలని చంద్రబాబు చూస్తున్నారు. తద్వారా వైయస్‌ఆర్‌సీపీని, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల్లో పలుచన చేయాలనే ప్రయత్నం చేయటమనేది రాజకీయంగా దుర్మార్గమైన రాజకీయ క్రీడ అని పేర్ని నాని అన్నారు.
బాలకృష్ణ, మిగతా తోబుట్టువులు, వారి కుటుంబసభ్యులు వారి సోదరిని వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు ఏదో అనేసినట్లుగా.. అది నిజమని నమ్మి మాట్లాడటమనేది బాధాకరమైన విషయం. బాలకృష్ణ, ఆయన సోదరులకు వారి తండ్రి గురించే వారి బుర్రల్లో విషం ఎక్కించగల నేర్పరితనం, పనితీరున్న చంద్రబాబు… అనకుండానే వారి సోదరి గురించి, తోబుట్టువు గురించి వైయస్‌ఆర్‌సీపీ వారు అన్నారని నమ్మించటమనేది చంద్రబాబుకు చాలా చిన్న విషయంగా చెప్పుకోవచ్చు.
సాక్షాత్తూ ఎన్టీఆర్‌ దుర్మార్గుడు, దుష్టుడు అని కన్నబిడ్డల్ని నమ్మించగలిగే నేర్పరితనం చంద్రబాబులో ఉంది. ఇవాళ ఇద్దరు సామాన్య శాసన సభ్యులు ఏదో అన్నారని ఒక అభూతకల్పనను సృష్టించటం, నమ్మించగలటం అనేది చంద్రబాబుకు చాలా చిన్న విషయం. పాత సంఘటనలు, చంద్రబాబు చరిత్ర ఒక్కసారి చూస్తే.. ఎన్టీఆర్‌ కడుపున పుట్టిన కూతుళ్లు, కొడుకులు తండ్రినే అధికారం నుంచి పడేయటానికి సహకరించారంటే ఎంతగా విషపు మాటల్ని చంద్రబాబు నమ్మించగలిగి ఉంటారు.
ఏ తండ్రినైనా మానసికంగా కుంగదీయటానికి ఏ పిల్లలు ఒప్పుకుంటారు. “మేం ఎన్టీఆర్‌ కుటుంబం. ఎన్టీఆర్‌ రక్తం” అని గర్వంగా చెప్పుకునే పిల్లల మనస్సుల్లో, బుర్రల్లో ఆరోజు ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా విషం ఎక్కించగలిగే నేర్పరితనం చంద్రబాబుకు ఉంది. ఈరోజు అనని మాటని కూడా వారి శ్రీమతిని అనకపోయినా, వారి పేరు బయటకు ఎవరూ తీయకపోయినా… ఈ రకంగా ఆపాదించి దుర్మార్గమైన రాజకీయ క్రీడకు తెరలేపటం ఆపైన భగవంతుడు చూడటం తప్ప దీన్ని మార్చగలిగే స్థితి ఎవరికి ఉంది? ఈ స్థితిలో ప్రవర్తించటం తగదు.
వాస్తవాలు మాట్లాడితే చంద్రబాబు అనుభవానికి ఒక పరమార్థం ఉంటుంది. అనని మాటల్ని, జరగని విషయాల్ని తెచ్చి, ఈరకంగా అసెంబ్లీలో గొడవలకు కారణం మీరు. ఆహ్లాదకరంగా, జనరంజకంగా వ్యవసాయంపై చర్చ జరుగుతుంటే ఇవన్నీ మాట్లాడింది ఎవరు. నిన్న సభలో సీఎం శ్రీ జగన్ గారు లేకపోయినా… ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి చంద్రబాబు మైక్‌లో రికార్డుల్లోకి వెళ్లేలా పనిగట్టుకొని మాట్లాడింది మీరు కాదా. ” బాబాయ్ హత్య గురించి, బాబాయ్‌ గురించి, గొడ్డలి గురించి, చెల్లి గురించి, తల్లి గురించి” ప్రస్తావన చేసింది చంద్రబాబే. చంద్రబాబు శ్రీమతి పేరు రానిపరిస్థితుల్లో ఈరకంగా చేయటమనేది రాష్ట్ర రాజకీయాలను ఏం చేయాలనుకుంటున్నారో, ఎన్ని మలుపులు తిప్పాలనుకుంటున్నారో అర్థంకాని పరిస్థితి..
అందరూ వీధుల్లోకి రండి. కొవ్వొత్తులు పట్టుకోండి. నిరసన తెలియజేయండని చంద్రబాబు అంటున్నారు. అసలు ఎవరు నిరసన, ఎందుకు నిరసన, ఎవరిని ఎవరు ఏమన్నారని.. ఎవరు అన్నారని చేయాలనుకున్నారు. ఏం స్క్రిప్టులు తయారు చేస్తున్నారు. నిరసన చేస్తే.. ఒక అర్థం, పరమార్థం ఉండాలి, మూలం ఉండాలి. ఇవాళ వైయస్‌ఆర్‌సీపీ భారతదేశ రైతులు సాధించిన విజయానికి మద్దతుగా, దానికి అద్దం పడుతూ కొవ్వొత్తుల ర్యాలీ చేస్తోంది. దానికి ఓ అర్థం ఉంది. ఏడాదిగా మెండిగా ఉన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేసినటువంటి చరిత్ర రైతులది కాబట్టి. రైతులకు సంఘీభావంగా రైతుల ర్యాలీ వైయస్‌ఆర్‌సీపీ చేస్తోంది.
భారతదేశంలో ఇంత బహిరంగా రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలని బంద్‌కు ఎవరూ మద్దతు ఇవ్వలేదు. రైతులకు మద్దతుగా నిలిచేటటువంటి ఆలోచన, తత్వం జగన్ మోహన్ రెడ్డిది. రైతులు సంవత్సరంపైగా పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని వెనక్కి మళ్లించేలా చేసిన రైతుల్ని కీర్తిస్తూ ఇవాళ కొవ్వొత్తుల ర్యాలీని వైయస్‌ఆర్‌సీపీ చేపడుతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో, నియోజకవర్గాల్లో రైతులకు మద్దతుగా, వారి విజయానికి జేజేలు పలుకుతూ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
చంద్రబాబు చెప్పే అసత్యాలు నమ్మ వద్దని రాష్ట్ర ప్రజలకు మంత్రి పేర్ని నాని విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లో ఇంతకంటే మెట్టు దిగడులే అనుకున్న ప్రతిసారీ .. ఆయన ఇంకా.. ఇంకా పాతాళానికి దిగే పరిస్థితి చూస్తున్నాము. పేదల గుండెల్లో దేవుడు లాంటి స్థానం సంపాదించుకున్న ఎన్టీఆర్‌ మీదే ఆయన కన్నబిడ్డలతో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది అభిమానుల్లో రామారావు గురించి విషాన్ని, వ్యతిరేకతను చంద్రబాబు ఎక్కించగలిగారు. అంతటి చంద్రబాబుకు నిన్న జరగని ఒక సంఘటనను జరిగినట్లుగా చిత్రీకరించి ప్రచారం తీసుకెళ్లటం అనేది వెన్నతో పెట్టిన చిన్న విషయంగా భావిస్తున్నాను. ఇంత దుర్మార్గమైన, వికృతమైన రాజకీయాలు చంద్రబాబు నడుపుతున్నారు.
మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ…
బాలకృష్ణ అమాయక చక్రవర్తి. వాళ్ల బావ ఏది చెబితే అదే ఆయనకు ఎక్కేస్తుంది తప్ప వేరేది ఏమీ బాలకృష్ణకు కనపడటం లేదు. ఎన్టీఆర్‌ను కూల్చిన చరిత్ర కానీ.. నిన్న జరిగిన మెలోడీ డ్రామా చూస్తే చంద్రబాబు ఏది చెబితే అది నమ్మే పరిస్థితుల్లోకి ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు. తోబుట్టువు, స్త్రీ గురించి ఎందుకు మాట్లాడతారు. మా ఇంట్లో ఆడవాళ్లు లేరా? మా ఇంట్లో వాళ్లను అంటే బాధ ఉండదా? ఆ మాత్రం విజ్ఞత లేకుండా ఎవరుంటారు. బాలకృష్ణ కి కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇక్కడెవ్వరూ ఎలాంటి మాట అనలేదు. అసెంబ్లీలో ఆరోపణలు దాదాపుగా రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి చూస్తున్నాం కదా. 2014 నుంచి ఇవన్నీ అసెంబ్లీకి అలవాటు చేసింది వాళ్ల బావగారే కదా! దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇలాంటి బూతులు మాట్లాడే సంస్కృతిని చంద్రబాబే అలవాటు చేశారు. ఇలాంటి సాంప్రదాయాలను తయారు చేసింది ఎవరు? వారి సోదరి, చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్‌ కుమార్తె గురించి ఎవ్వరూ ఏమీ అనలేదు. చంద్రబాబు ప్రచారం చేస్తున్నది అసత్యం అని మీడియా ద్వారా మరోసారి బాలకృష్ణ కి తెలియజేస్తున్నాను.
నిన్న వ్యవసాయ శాఖ మంత్రి గడిచిన రెండున్నర సంవత్సరాల్లో వ్యవసాయ శాఖకు ఏం చేశారో అన్నీ వివరంగా చెబుతున్నారు. మీడియా కూడా ఉంది కదా! చంద్రబాబుతో ఉన్న శాసనసభ్యులు వ్యవసాయం మీద ఏమైనా ప్రశ్నించారా? అవి కాకుండా కన్నబాబు నువ్వు పార్టీలు మారావు అన్నారు. పార్టీ మారింది ఎవరు. మీ టీడీపీఎల్పీ లీడర్ ఎవరు. ఎన్టీఆర్‌ మీదనే పోటీ చేస్తానని చెప్పి ఓడిపోయిన మూడు నెలలకే కాంగ్రెస్‌ నుంచి తెలుగుదేశం పంచన చేరాడు కదా. చంద్రబాబు పుడుతూనే టీడీపీలో పుట్టాడా? టీడీపీ పుట్టినప్పుడు మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నారు. పార్టీ మారని వారెవరు?
బాబాయ్, గొడ్డలి అని మాట్లాడారు. వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు ప్రభుత్వం నడిపిందెవరు? అప్పుడు సీఎం ఎవరు? ఈరోజు ఆరోపిస్తున్నట్టుగా.. మీ ప్రభుత్వ హయాంలో ఆరోజే దోషుల్ని లోపలి వేయెచ్చు కదా! ఎందుకు వారిపై ఎఫ్‌ఐఆర్‌ కట్టలేదు. అందులో వాస్తవం లేదు కాబట్టి. ఆరోజున ఏం చేశారు. ప్రభుత్వం మీదే కదా!
మీడియాలో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇది ఇంట్లో ఆడవారి విషయం. మేము ఏదైనా సర్క్యులేట్ చేస్తే… ఈపాటికి మా బ్రతుకులు ఇలా ఉండేవా? ఇది చాలా అన్యాయం. దుర్మార్గమైన క్రీడ ఇది. ఒక శృతి మించి వెళ్లే పరిస్థితికి రాజకీయాలు వెళ్లిపోయాయి. నిన్న చంద్రబాబు మైక్‌ కట్ చేస్తే .. ఆ వెంటనే వీడియోలు ఎలా రికార్డు చేయగలిగారు. ప్రీప్లాన్డ్‌ డ్రామా ఇది. అసెంబ్లీలో రికార్డు చేసి బయటకు ఎలా వదులుతారు. మైక్‌ కట్ చేయటమనేది క్షణాల్లో జరుగుతుంది కదా. వెంటనే ఫోన్‌ ఎలా ఆన్‌ చేయగలిగారు. ఎలా రికార్డు చేయగలిగారు. ఇది ఒక ఇంజనీర్డ్‌ మెలో డ్రామా. దుర్మార్గం ఏమిటి అంటే.. ఇందులోకి కుటుంబ సభ్యుల్ని చంద్రబాబు తీసుకురావటంపై మేం కూడా బాధపడుతున్నాం. మగాళ్లు మగాళ్లు బూతులు తిట్టుకోవటం.. అసభ్యంగా మాట్లాడుకోవటం, వ్యక్తిత్వాన్ని కించపర్చుకోవటం అయిపోయి… ఇంట్లో వాళ్లను తీసుకురావటం సరికాదు. ఇంతకంటే హేయమైన సంఘటన రాజకీయాల్లో ఇంకొకటి ఉండదు.
బాబును నమ్మి పురంధేశ్వరి కుటుంబం కూడా మోసపోయింది కదా..
మరొక్కసారి మీడియాకు చెబుతున్నా.. చూడకుండానే వీడియో ఉందని తిప్పుతున్నారని మాట్లాడినట్లే.. అందరూ కూడా నమ్మే స్థితిలో ఉన్నారు. వాస్తవం కాదు. భువనేశ్వరి గారిని ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. వారి అక్కగారు నిన్న ట్వీట్ చేశారు. రాజకీయాల్లో తొందరపాటు ఉండకూడదు. పురంధేశ్వరి కూడా వాస్తవాలు తెలుసుకోని మాట్లాడాలి. మరది అంటే పడదని ఒక పక్క అంటారు. మరిది దుర్మార్గుడంటారు. ఆయన ఉన్న పార్టీలో ఉండమంటారు. ఇవాళ ఆయన చెప్పింది ఎలా నమ్ముతారు. గతంలో నమ్మి మోసపోయారు కదా? మీ నాన్న గురించి చంద్రబాబు చెప్పింది నమ్మి మోసపోయారు కదా? ఇంకా ఎన్నిసార్లు మోసపోతారు. ఇవతల ఉన్నది కూడా సభ్యత, సంస్కారం తెల్సిన నిఖారైన రాజకీయ నాయకుడు వైయస్‌ జగన్‌.
బాలకృష్ణ బొబ్బిలి బ్రహ్మన్న పాత్ర ఏమైనా వేస్తున్నారేమో. ఆయన కూడా 2014-19 వరకు శాసనసభలో శాసనసభ్యుడిగా ఉన్నారు కదా. అప్పుడు కనపడలేదా.. సభ ఎలా నడుస్తోందో. ఇప్పుడు పిలిచినట్లే అప్పుడు కూడా మీడియాను పిలిచి సమావేశం పెడితే బావుండేది కదా. సభ సక్రమంగా నడవటం లేదు. సభ చాలా అసహ్యంగా ఉంది. సభాపతి సరిగా నడపటం లేదు. ఏకపక్షంగా మా బావ చంద్రబాబు నడుపుతున్నారు. మా బావ ఏది అంటే అది అంటున్నారు కోడెల శివప్రసాద్ అని ఆరోజే చెప్పవచ్చు కదా. అప్పుడు కూడా మేం కూడా శెభాష్‌ బొబ్బిలి బ్రహ్మన్నలా తీర్పు చెబుతాడు అనుకునేవాళ్లం కదా.
రాజకీయాల కోసం ఇంతలా దిగజారడం… నిన్నటి చంద్రబాబు ఎపిసోడ్‌ ఏపీ రాజకీయ చరిత్రలో నిజంగా బ్లాక్‌డేనే. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే ఓ నాయకుడు ఇంతగా దిగజారుతారున్నది ఇంతకన్నా బ్లాక్‌ డే మరొకటి ఉండదని పేర్ని నాని పేర్కొన్నారు. ఇంతలా అసత్యాలు మాట్లాడతారనే దానికి మరో బ్లాక్‌ డే ఉండదన్నారు.

LEAVE A RESPONSE