దివంగత లెజెండరీ నటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామరారావుకు ఇప్పటి రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానులకు కొదువేలేదు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయినా తెలంగాణలో కూడా ఆయనను అభిమానించే వారు కోట్లలోనే ఉంటారు. ఆయన అభిమానానికి గుర్తుగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా లకారం ట్యాంక్ బండ్ పై భారీ విగ్రహ ఆవిష్కరణకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఖమ్మం పట్టణంలోని లకారం చెరువులో ఎన్టీఆర్ కృష్ణావతార విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన అభిమానులు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మే 28న దీనిని ప్రారంభించనుండగా.. 54 అడుగుల ఎత్తైన ఈ విగ్రహాన్ని రూ.2.3 కోట్ల వ్యయంతో నిజామాబాద్‌లో ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. లకారం చెరువు మధ్యలో తీగల వంతెన వద్ద ఈ విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. విగ్రహం తయారీ పనులు తుదిదశకు చేరినట్లు నిర్వహకులు తెలపగా.. హరికృష్ణ తనయుడు, ఎన్టీఆర్ మనవడు, జూనియర్ ఎన్టీఆర్ చేత.. కృష్ణావతారంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్తున్నారు.
తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఈ కృష్ణావతారంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకి చొరవ చూపిస్తుండగా.. ఎన్టీఆర్ అభిమానులు ఈ విగ్రహ ఏర్పాటులో పాలు పంచుకుంటున్నారు. హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ మధ్యలో బుద్దుని విగ్రహం మాదిరే.. ఖమ్మం లకారం ట్యాంక్‌బండ్‌పై శ్రీకృష్ణుడి రూపంలో ఈ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. బేస్‌మెంట్‌తో కలిపి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహం ఎటు చూసినా.. 36 అడుగుల పొడవు వెడల్పుతో వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్‌మెంట్పై అమర్చనున్నారు.