Suryaa.co.in

Political News

ఎన్టీఆర్…ఈ పేరు చాలా కాలం యాదుంటది!

ఎన్టీఆర్ చనిపోయిన 27 సంవత్సరాల తర్వాత కూడా ఆయన గురించి మాట్లాడుకునేటప్పుడు, చాలామంది ఆయన సినిమా నటుడని, శ్రీకృష్ణుడని, శ్రీరాముడని చెబుతూ ఉంటారు. సినిమా నటుడు కాబట్టి ఎన్టీఆర్ గురించి ఇప్పటికీ ప్రజలు చెప్పుకుంటే… మరి అక్కినేని నాగేశ్వర రావు గురించి అదే ప్రజలు ఎందుకు మర్చిపోయారు?

20వ శతాబ్దపు తెలుగు వాళ్ల చరిత్ర లో ఎన్టీ రామారావు ని చిరస్మరణీయుడిగా మార్చడంలో, ఆయన సినిమా ఇమేజ్ పాత్ర చాలా తక్కువ. 38 ఏళ్ళ క్రితం, 60 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థాన ప్రారంభం ఒక సంచలనం.

1953లో ఆంధ్ర రాష్ట్రం, 1956లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత… అంటే 1953 నుంచి 1983 వరకు ఒకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని /రాజ్యాన్ని పాలిస్తున్న నేపద్యంలో, దామోదరం సంజీవయ్య, పీవీ నరసింహారావు, జలగం వెంకటరావు లాంటి నాయకులు తప్ప… ఒకే సామాజిక వర్గం ఆధిపత్యం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎదురు లేకుండా సాగుతున్న రోజుల్లో, తెలుగుదేశం స్థాపన ఒక సామాజిక విస్పోటనం, ఒక రాజకీయ భూకంపం, ఒక పాలన సంస్కరణ.

అత్యంత సాధారణ కమ్మ కుటుంబం లో పుట్టి, బీఏ వరకు చదువుకొని, మొన్న ఎన్నికల్లో లోకేష్ రాజకీయ ప్రయోగం చేసిన మంగళగిరిలో ఉద్యోగం చేసి, సినిమా రంగంలో వచ్చిన అవకాశాలతో కష్టపడి స్వయంకృషితో ఎదిగిన ఎన్టీఆర్, తన ఆస్తి మొత్తం కొడుకులకు కూతుళ్ళకు పంచి, తనకు అపారమైన కీర్తి సంపదల నిచ్చిన ప్రజల రుణం తీర్చుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చాడు.

అప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బ్రాహ్మణుల ఆధిపత్యం అంతరించి, రెడ్ల ఆధిపత్యం స్థిరపడిపోయింది. ఈ రెడ్ల ఆధిపత్యాన్ని నియంత్రించే ప్రయత్నాలలో భాగంగా వెలమ నాయకుడైన జలగం వెంగళరావు కమ్మ నాయకులను, వ్యాపారులను ప్రోత్సహించి నప్పటికీ, కాంగ్రెస్ లో కమ్మ నాయకులు ముఖ్యమంత్రి స్థాయికి ఎదగలేకపోయారు.

ఎస్సీ,ఎస్టీల ను ఓటు బ్యాంకుగా చేసుకొని రెడ్ల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ని పాలిస్తున్న సామాజిక నేపథ్యంలో తెలుగుదేశం పుట్టింది. జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్ సహాయ పడినట్టు, ఆరోజు పర్వతనేని ఉపేంద్ర లాంటి ఎంతోమంది విద్యావంతులు, నాయకులు… కాంగ్రెస్ పార్టీని ఓడించటానికి కావాల్సిన సోషల్ ఇంజనీరింగ్ మౌలిక సూత్రాలను ఎన్టీఆర్ కి వివరించారు.

అప్పుడు మొదలైంది తెలుగు రాజకీయాల్లో ఒక సామాజిక విప్లవం. ఫలితంగా అప్పటివరకు రాజకీయాల్లో అవకాశాలు రాక వెనుకబడిపోయిన… రాయలసీమలో బలిజలు, బోయలు, మాదిగలు. ఉత్తరాంధ్రలో కొప్పుల వెలమలు, కాళింగులు తూర్పుకాపులు, తెలంగాణలో మున్నూరు కాపులు, మాదిగలు, బైండ్ల, గోండి, గౌడ లు, బ్రాహ్మణులు, ముదిరాజులు, కోస్తా జిల్లాల్లో కాపులు, రాష్ట్రంలోని 23 జిల్లాల్లో యాదవులు, ముస్లిం మైనారిటీ లు, మహిళలు పెద్ద ఎత్తున రాజకీయ అవకాశాలు పొంది చట్టసభల్లో ప్రవేశించారు.

ఎలాంటి ఆయుధాలు లేకుండా, ఎలాంటి రక్తపాతం లేకుండా భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఓటు హక్కు ద్వారా ఈ నిశ్శబ్ద,సామాజిక విప్లవం సాధ్యమైంది.

ఈ సామాజిక విప్లవం తెలంగాణలో ప్రకంపనలు సృష్టించింది. 1948లో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీన మై, భారత రాజ్యాంగం ప్రకారం పాలన జరుగుతున్నప్పటికీ… తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ, భూస్వామ్య భావజాలం పటిష్టంగా ఉండటం వలన, గ్రామీణ పెత్తందారులు అయిన పటేల్, పట్వారీ వ్యవస్థ లు ప్రజలను అణచివేస్తూ, దోచుకుంటూ… బాంచన్ దొరా… నీ కాల్ మొక్కుతా సంస్కృతిని కొనసాగిస్తున్న తెలంగాణ సమాజానికి… తెలుగుదేశం పార్టీ స్థాపన, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావటం, పటేల్ పట్వారీ, వ్యవస్థలు రద్దు కావటం… నక్సలైట్ విద్యార్థి సంఘం లో పనిచేసే ఇంద్రా రెడ్డి లాంటి అగ్రకుల అభ్యుదయవాదులు, మోత్కుపల్లి నర్సింహులు నాటి చైతన్యవంతులైన దళిత యువకులు ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ నుండి డైరెక్ట్ గా ఎమ్మెల్యేలు, మంత్రులు కావటం, ఊహకు కూడా అందని సామాజిక సంచలనం.

పైన చెప్పిన కులాల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయన వాళ్ళల్లో 90% పేద కుటుంబాల నుంచి వచ్చిన వారే. మరో విధంగా చెప్పాలంటే తెలుగుదేశాన్ని స్థాపించడం ద్వారా ఎన్టీఆర్ తెలుగు సమాజానికి అన్ని కులాల నుంచి విద్యావంతులైన, చైతన్యవంతులైన నూతన నాయకులను అందించాడు. (వాళ్ళలో కొంతమంది దళిత, బీసీ నాయకులు వందల కోట్లకు అధిపతులై, సొంత వారినే అణిచివేయడం ఒక విషాద వాస్తవం)

తెలుగుదేశం పార్టీ స్థాపించడం ద్వారా ఎన్టీఆర్ తెచ్చిన సామాజిక విప్లవం లో.. అత్యంత కీలకమైనది రాజకీయాలలో, పరిపాలనలో, చదువులో, ఆఖరికి ఆస్తిలో కూడా స్త్రీలకు ఎక్కువ అవకాశాలు కల్పించడం. ఫలితంగా అన్ని కులాలలో చదువుకున్న మహిళలు నాయకత్వ అవకాశాలు పొందారు.

రెండేళ్ల క్రితం తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో పేలిన ఒక జోక్ ఏంటంటే….. కెసిఆర్, తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ రెడ్డి మొదలైన వారిని చూసిన తర్వాత ఇది టీఆర్ఎస్ క్యాబినెట్ సమావేశమా? టిడిపి క్యాబినెట్ సమావేశమా? అని ఒక మంత్రి వ్యాఖ్యానించడం.

ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి ఎన్నికలలో జగన్ ఎన్నిక చేసిన కడప జిల్లాకు చెందిన సి రామచంద్రయ్య గారిని చూసినప్పుడు నాకు కూడా ఎన్టీఆర్ సృష్టించిన నాయకులు గుర్తొచ్చారు. ఎన్టీఆర్ తీసుకొచ్చిన సామాజిక మార్పుల తర్వాత … మరో కీలకమైన అంశం… కేంద్ర రాష్ట్ర సంబంధాల పై ఎన్టీఆర్ ప్రభావం.

1952, 57, 62….. మూడు సాధారణ ఎన్నికలలో , కేంద్రంలో మరియు రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది (1957లో కేరళ తప్ప). కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను, హై కమాండ్ నిర్ణయిస్తుంది కాబట్టి, రాష్ట్రాలపై కేంద్రం పెత్తనాన్ని, ప్రణాళిక సంఘం లో కేంద్రం పెత్తనాన్ని, జాతీయ అభివృద్ధి మండలి లో ముఖ్యమంత్రులు ప్రశ్నించే వాళ్ళు కాదు.

కానీ 1967 సాధారణ ఎన్నికలలో దేశంలోని పద్నాలుగు రాష్ట్రాలలో, తొమ్మిది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి, కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
ఈ కాంగ్రెస్సేతర ప్రభుత్వాలలో….. తమిళనాడు ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వం… కేంద్రం పెత్తనాన్ని నిరసిస్తూ, కేంద్ర- రాష్ట్ర సంబంధాలపై ఒక కమిషన్ ని నియమించాలని, కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. కానీ రాజ్యాంగాన్ని కూడా దిక్కరించి నియంతలా పరిపాలించిన ఇందిరాగాంధీ పట్టించుకోలేదు.

ఈ నేపథ్యంలో 1983లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, దేశంలోని కాంగ్రెసేతర పార్టీల ముఖ్యమంత్రులను, ప్రధాన నాయకులను విజయవాడ ఆహ్వానించి బ్రహ్మాండమైన బహిరంగ సభ నిర్వహించి… కేంద్రం మిథ్య (ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటే లేదు) అని ప్రకటించి, ఇందిరాగాంధీ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలన్నింటికీ కొత్త నాయకుడిగా అవతరించాడు.

1966లో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్,
1969లో తమిళనాడు ప్రభుత్వం నియమించిన రాజమన్నార్ కమిటీ,
1973లో పంజాబ్ లో చేసిన ఆనందపూర్ సాహిబ్ తీర్మానం,
1977లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సమర్పించిన మెమోరాండం లో……

ఇలా ఎన్నో సార్లు, ఎన్నో కమిటీలు… కేంద్ర రాష్ట్ర సంబంధాలను మళ్లీ అధ్యయనం చేయాలి, రాష్ట్రాలపై కేంద్ర పెత్తనం ఆపేయాలి,
భారత రాజ్యాంగం ఏర్పాటుచేసిన సమాఖ్య వ్యవస్థను అమలు చేయాలి, అకారణంగా రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన పెట్టకూడదు, రాష్ట్రాల పాలనా వ్యవహారాలలో కాంగ్రెస్ పార్టీ నాయకుల జోక్యం ఉండకూడదని…

ఎన్నిసార్లు చెప్పినా స్పందించని ఇందిరాగాంధీ…
ఎన్టీఆర్ ప్రభంజనానికి భయపడి… ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన కొద్ది నెలల్లోనే… కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనం కోసం 1983లో సర్కారియా కమిషన్ ని నియమించింది.

రాజకీయాలలో ఎవరికీ భయపడని ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ కి భయపడింది అని ఈ ఒక్క నిర్ణయంతో, జాతీయ స్థాయి కాంగ్రెసేతర నాయకులకు స్పష్టంగా అర్థమైంది. అందుకే ఒక్కసారి కూడా పార్లమెంట్ కి పోటీ చేయని ఎన్టీఆర్ ను నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.(1984లో లోక్ సభలో,అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం, 1989లో ఆంధ్రప్రదేశ్లో గెలుచిఉంటే, ఎన్టీఆర్, వి.పి.సింగ్ స్థానంలో ప్రధాన అయ్యేవాడు).

1988లో సర్కారియా కమిషన్ నివేదిక సమర్పించిన నాటి నుండి 2007లో కేంద్ర రాష్ట్ర సంబంధాల పై ఫూంఛీ కమిషన్ ను నయమించేంత వరకు, అనేక రాష్ట్రాల్లో అకారణంగా రాష్ట్రపతి పాలన రాకుండా కాపాడింది, సర్కారియా కమిషన్ సిఫారసులే. అది జాతీయ రాజకీయాలపై ఎన్టీఆర్ వేసిన చెరగని ముద్ర.

1971లో మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత (1966 మొదటిసారి, లాల్ బహుదూర్ శాస్త్రి మరణం తర్వాత, 1967 రెండవ సారి, సాధారణ ఎన్నికల తర్వాత) 1977 వరకు ఇందిరాగాంధీ ఒక నియంతలా పాలించింది. తన ఆధిపత్యానికి అడ్డం అనిపించిన ప్రతిసారి రాజ్యాంగాన్ని సవరించింది, ఆఖరికి 1973 లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించినప్పుడు, నిబంధనలకు భిన్నంగా అందరికన్నా సీనియర్ జడ్జిని కాదని, సీనియారిటీలో నాలుగో స్థానంలో ఉన్న రే ని ప్రధాన న్యాయమూర్తిని చేసింది.

1971-77 మధ్యకాలం ఒకరకంగా పార్లమెంట్ కి… సుప్రీం కోర్ట్ కి యుద్ధ కాలం లాంటిది. సుప్రీంకోర్టు నిర్ణయాలను మార్చడానికి ఎన్నోసార్లు ఇందిరాగాంధీ పార్లమెంటులో తన బలాన్ని ఉపయోగించి, ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని సవరించింది. (1977 లో జనతా పార్టీ అధికారంలోకి రాగానే, ఇందిరాగాంధీ చేసిన సవరణలన్నీ… సవరించబడ్డాయి)

1984లో ఇందిరా గాంధీ మరణించిన తరువాత… మళ్లీ 30 ఏళ్లకు, ఒక నియంత ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. తన ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగానికి సవరణలు చేస్తున్నాడు. ఈ సవరణల ద్వారా రాజ్యాంగ మౌలిక స్వరూపమే, మారిపోతున్న విషయం… కాశ్మీర్లో ముస్లింలు, ఈశాన్య భారతదేశంలో గిరిజనులు, దేశవ్యాప్తంగా దళిత, ఆదివాసి, మానవ హక్కుల కార్యకర్తలు తప్ప,దేశభక్తులకు అర్థం కాకపోవటం, కరోనా కంటే ప్రమాదకరం. జోహార్ ఎన్టీఆర్

– డాక్టర్ కొలికపూడి శ్రీనివాస రావు

LEAVE A RESPONSE