Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో కోవిడ్ బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ విస్తృత‌ సేవలు

– టెలిమెడిసిన్ ద్వారా వారం రోజుల్లో దాదాపు 8 వేల మందికి వైద్య సాయం
– 12 మంది దేశ విదేశీ వైద్యులతో వైద్య బృందాలు – ట్రస్ట్ నుంచి మందుల పంపిణీ
– తెలుగు రాష్ట్రాల్లో మూడు చోట్ల ఎన్టీఆర్ ట్రస్ట్ ఆక్సిజన్ ప్లాంట్లు
– మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో వివిధ వర్గాలకు ట్రస్ట్ సేవలు

అమరావతి:కోవిడ్ తర్డ్ వేవ్ కారణంగా మళ్లీ పెద్ద సంఖ్యలో ప్రజలు కరోనా భారిన పడుతున్నారు. దీంతో ప్రజలను ఆదుకునేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ తన సేవలు మరింత విస్తృతం చేసింది. జూమ్ యాప్ ద్వారా వీడియో లింక్ లు షేర్ చేసి వేల మంది కోవిడ్ బాధితులకు టెలిమెడిసిన్ సాయం అందిస్తుంది. దేశ విదేశీ వైద్యులతో ఏర్పాటు చేసిన వైద్య బృందాలు గత వారం రోజులుగా రోజుకు నాలుగైదు గంటల పాటు వీడియో కాల్ ద్వారా వందల మందిని ట్రీట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ , తెలుగు దేశం పార్టీ సమన్వయంతో ఈ టెలిమెడిసిన్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. దీని కోసం ప్రత్యేక వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. 12 మంది వైద్యులతో వైద్య సాయం అందివ్వడంతో పాటు అవసరం అయిన వారికి మందులు కూడా ఇంటికి పంపుతున్నారు.

గత ఏడాది కోవిడ్ సమయంలో కూడా ఇదే తరహా సేవలు అందించినా…ఇప్పుడు వాటిని మరింత విస్తృతం చేశారు. రోజూ లక్షల మందికి ఈ జూమ్ మీటింగ్ లింక్ పంపుతున్నారు. వాటిని అందుకున్న వారిలో కోవిడ్ బాధితులు వీడియో కాల్ లోకి వచ్చి డాక్టర్ల సహాయం పొందుతున్నారు. కోవిడ్ బాధితులు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా….ఇంటి వద్దనే ఉండి ఉచితంగా డాక్టర్ల సాయం పొందుతున్నారు. రోగులు చెప్పిన సమస్యలపై చర్చించుకున్న తరువాత డాక్టర్లు వారికి తగు సూచనలు చేస్తున్నారు. మొత్తం 12 మంది డాక్టర్లలో అమెరికా నుంచి నలుగురు వైద్యులు ఉండగా…మిగిలిన 8 మంది ఎపి నుంచి రోగులకు వైద్య సాయం అందిస్తున్నారు.

అమెరికా వైద్యుల పర్యవేక్షణలో రాష్ట్ర వైద్యులు రోగులను ట్రీట్ చేస్తున్నారు. ఒక యాప్ ద్వారా….ఇన్ని వేల మందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్య సాయం అందించడం దేశంలోనే ప్రధమం. వైద్య సాయం కోరే రోగులకు 6 రూంలను ఏర్పాటు చేసి వర్చ్యువల్ హాస్పిటల్ ను నడుపుతున్నారు. నేరుగా డాక్టర్లకు తమ సమస్య చెప్పుకునే అవకాశం రావడంతో రోగులు కూడా పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ స్థాయిలో సేవలు
తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు కొత్త కాదు. దశాబ్దాలుగా విద్యా, స్వయం ఉపాధి రంగాలలో ట్రస్ట్ సేవలు చేస్తోంది. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రజల వెతలు చూసిన ఎన్టీఆర్ ట్రస్ట్…. వైద్య సేవల విషయంలో భారీ ప్రణాళికతో సేవలు మొదలు పెట్టారు. కోవిడ్… లక్షల కుటుంబాలను ఎంతలా ప్రభావితం చేస్తుందో చూసిన కారణంగా…గ్రామ స్థాయిలో ఉచిత సేవలు అందిస్తున్నారు. ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ అటు తెలుగు దేశం పార్టీ నేతలు, సాంకేతిక బృందాల సాయంతో రోజూ వందల, వేల మందికి వైద్య సాయం అందిస్తున్నారు. కేవలం వైద్య సాయమే కాకుండా అవసరం ఉన్న రోగులకు ట్రస్ట్ ప్రతినిధుల ద్వారా మందుల పంపిణీకి కూడా చేస్తున్నారు.

ఆక్సిజన్ ప్లాంట్లు
గత కోవిడ్ సమయంలో ఆక్సిజన్ అవసరాలు ఏ స్థాయిలో ఉన్నాయో చూసిన ట్రస్ట్ యాజమాన్యం….. ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వయంగా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. గ‌త ఏడాది కోవిడ్ స‌మ‌యంలో ఎన్టీఆర్ ట్ర‌స్ట్ దాదాపు 1 కోటి 75 ల‌క్ష‌ల విలువైన మందులు, ఆహారం, వైద్య పరికరాలు అందించారు. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు చోట్ల ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు చేస్తున్నారు.ఇప్ప‌టికే కుప్పంలో ఆక్సిజ‌న్ ప్లాంట్ ను టిడిపి అధినేత చంద్ర‌బాబు ప్రారంభించారు. మ‌రోవైపు శ్రీ‌కాకుళం జిల్లా టెక్క‌లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను ఒకటి రెండు రోజుల్లో ప్రారంభించబోతున్నారు. ఇవి రెండు కాకుండా తెలంగాణ‌లోని మ‌హ‌బూబాబాద్ జిల్లా గూడూరులో ఆక్సిజ‌న్ ప్లాంట్లు సిద్దం చేస్తున్నారు.

ప్రకృతి విప‌త్తులు – ట్రస్ట్ ఆర్థిక సాయం
ఇకపోతే ప్రకృతి విప‌త్తులు వంటివి వచ్చిన సమయంలో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు అందిస్తుంది. 2021 సంవత్సరం నవంబర్ నెలలో కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో వరదలకు తీవ్ర నష్టం జరిగింది. ఆ వరదల కారణంగా 48 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ 48 కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరుపున నారా భువనేశ్వరి లక్ష చొప్పున ఆర్ధిక సహాయం అందించారు. ఆనాటి వరదల్లో సాహసంతో 6 గురి ప్రాణాలు కాపాడిన కడప జిల్లా పులపాతూరు యువకుడికి ఎన్టీఆర్ ట్రస్ట్ సన్మానం చేసింది.

6 గురి ప్రాణాలు కాపాడిన గంధం శివప్రసాద్ ను అభినందించిన నారా భువనేశ్వరి లక్ష ఆర్థిక సాయం అందించారు. నారా భువనేశ్వరి రోజు వారీ ట్రస్ట్ సేవలను ట్రస్ట్ సీఈవో రాజేంద్ర కుమార్ తో కలిసి పర్యవేక్షిస్తూ అందరినీ సమన్వయ పరుస్తున్నారు. మరో వైపు టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో మాట్లాడుతూ….ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్య సేవలు గ్రామ స్థాయి తీసుకు వెళ్లేందుకు దిశా నిర్ధేశం చేస్తున్నారు. ఆపద సమయంలో ట్రస్ట్ సేవలు అందించడంలో భాగస్వాములు అయిన అందరికీ ఈ సందర్భంగా నారా భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. ట్రస్ట్ ద్వారా తాము చేస్తున్న సేవలో భాగస్వాములు కావాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE