దుబాయ్‌లోని ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ సభ్యులు, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు మాట్లాడుతూ, ఎన్టీఆర్ చేసిన సేవలు తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని తెలిపారు. రాజకీయాలతో పాటు కళారంగంలోనూ అపూర్వమైన ఖ్యాతిని సాధించిన ఎన్టీఆర్, తెలుగు ప్రజల్లో ఆత్మగౌరవ భావనను రగిలించిన మహానేత అని కొనియాడారు.
పేదల సంక్షేమం, మహిళల అభ్యున్నతి, గ్రామీణాభివృద్ధి కోసం ఎన్టీఆర్ అమలు చేసిన పథకాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉందని ఈ సందర్భంగా సభ్యులు సంకల్పం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దుబాయ్‌లో నివసిస్తున్న పలువురు ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని, ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులు అర్పించారు.